నాష్‌విల్లేలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

2 May, 2018 21:44 IST|Sakshi

టేనస్సీ: నాష్‌విల్లేలోని గణేష్‌ ఆలయంలో శ్రీనివాస కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అమెరికా తెలుగు అసోసియేషన్‌(ఆటా), ఇండియన్‌ కమ్యూనిటీ ఆఫ్‌ నాష్‌విల్లే(ఐసీఓఎన్‌)ల ఆధ్వర్యంలో గత నెల 28న నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో విగ్రహాలను అలంకరించి శ్రీనివాస కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ ​కార్యక్రమంలో కళ్యాణ కమిటీ సభ్యులు ఆల రామకృష్ణా రెడ్డి, నూకల నరేందర్‌ రెడ్డి, సుషీల్‌ చందా, గుడూరు కిశోర్‌ రెడ్డి, దయప ప్రకాశ్‌ రెడ్డి, పునీత్‌ దీక్షిత్‌, రవి కిరణ్‌, రాధిక రెడ్డి, నూకల లావణ్య, మంజూ లిక్కి, బూస సునీత, అరమండ్ల రాధిక, రాచకొండ సాయిరాం, కేస సిరిషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా పూర్తి చేసినందుకు భక్తులకు, అతిథులకు, దాతలకు, ఆలయ పూజారి, ఆలయ బోర్డు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నాష్‌విల్లేలోని గణేష్‌ ఆలయం విస్తరణ పనులను గత కొన్ని ఏళ్లక్రితమే ప్రారంభించారు. ఆలయ అభివృద్ధికి దాదాపు 4 మిలియన్ల డాలర్లను ఖర్చుచేశారు. అమెరికా తెలుగు అసోసియేషన్‌(ఆటా), ఇండియన్‌ కమ్యూనిటీ ఆఫ్‌ నాష్‌విల్లే(ఐసీఓఎన్‌) సభ్యులు పెద్ద మొత్తంలో ఆలయానికి విరాళాలు ఇచ్చారు. గత ఏడాది కూడా శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు