కువైట్‌లో ఉపాధి పాట్లు

10 Feb, 2020 13:11 IST|Sakshi
ఇండియన్‌ ఎంబసీకి ఫిర్యాదు చేసిన ప్రతిని చూపిస్తున్న కువైట్‌లో చిక్కుకున్న యువకులు

దేశం కాని దేశంలో చిక్కుకున్న యువకులు

5 నెలలుగా జీతం చెల్లించని కంపెనీ

పాస్‌పోర్ట్‌లు తిరిగి ఇవ్వకుండా వేధింపులు

స్వదేశానికి పంపాలని కేంద్రానికి బాధితుల వేడుకోలు

శ్రీకాకుళం, కంచిలి: ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన పలువురు నిరుద్యోగులు మరోసారి ఏజెంట్ల చేతిలో మోసపోయారు. మంచి కంపెనీలో ఉద్యోగాలకు పంపిస్తామని చెప్పి, గుర్తింపులేని కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో తాత్కాలిక పద్ధతిలో చేర్పించడంతో... ఆ యువకులు దేశం కాని దేశంలో అష్టకష్టాలు పడుతున్నారు. ఐదు నెలలుగా జీతా ల్లేక.. పాస్‌పోర్టులు కంపెనీ యాజమాన్యం చేతిలో చిక్కుకోగా.. నరకం చూస్తున్నారు. ఇచ్ఛాపురం, కంచిలి మండలాలతోపాటు సరిహద్దు ఒడిశా రాష్ట్ర పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన పదిమంది యువకులు ఇచ్ఛాపురం పట్టణంలో రాజా ప్యాలెస్‌ ఎదురుగా నడుస్తున్న ఒక వెల్డింగ్‌ ఇనిíస్టిట్యూట్‌ యాజమాన్యం ద్వారా పది నెలల క్రితం కువైట్‌లో ‘గల్ఫ్‌టెక్‌ కంపెనీ’లో వెల్డర్, ఫిట్టర్‌ ఉద్యోగాలకు వెళ్లారు. ఇనిస్టిట్యూట్‌ యాజమాన్యానికి ఒక్కొక్కరూ రూ.65 వేల నుంచి రూ.75 వేల వరకు చెల్లించి పది నెలల క్రితం ఉద్యోగాల్లో చేరారు. వీరికి ఇండియన్‌ కరెన్సీ ప్రకారం నెలకు రూ.30 వేల జీతం.

మొదటి నెల నుంచే జీతం ఇచ్చేందుకు కంపెనీ యాజమాన్యం మొరాయించేది. మొత్తమ్మీద ఐదు నెలలు ఎలాగోలా గడిచాయి. తర్వాత తమకు జీతాలు చెల్లించలేదని బాధిత యువకులు వాపోతున్నారు. జీతం ఇచ్చి పనిచేయించుకోవల్సిందిగా బతిమాలినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. చివరికి తమ ను ఇండియాకు పంపించాల్సిందిగా కోరినప్పటికీ ససేమిరా అంటున్నారని, తమ పాస్‌పోర్టులు వారి వద్ద భద్రపర్చుకొని ఇలా ఏడ్పిస్తున్నారని యువకులు వాపోతున్నారు. సాక్షికి అక్కడి నుంచి ఫోన్‌ చేసి తమ కష్టాలను చెప్పుకొన్నారు. కువైట్‌లో గల ఇండియన్‌ ఎంబసీ కార్యాలయానికి 15 రోజుల క్రితం ఫిర్యాదు చేశామని, వారి నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందన లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ఆకలి దప్పికలతో ఆందోళన చెందుతున్నామని తెలిపారు. కంపెనీకి చెందిన ఒక ఇంట్లో సరైన ఆహారంఇవ్వకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారని యువకులు పేర్కొన్నారు.

మోసపోయింది వీరే..
కంచిలి మండలం కుంబరినౌగాం గ్రామానికి చెందిన కడియాల గణేష్, ఇచ్ఛాపురం మండలం ఈదుపురం గ్రామానికి చెందిన బ్రజరాజ బెహరా, లొద్దపుట్టికి చెందిన కొంతాల వినోద్‌కుమార్, అరకభద్రకు చెందిన సాడి తేజేశ్వరరావు, ఒడిశా రాష్ట్ర పరిధిలో గంజాం జిల్లా చికిటి బ్లాక్‌ పరిధి కె.సువాని గ్రామానికి చెందిన అబధాన్‌ డొంబురు బెహరా, కొత్తసింగి గ్రామానికి చెందిన శంకర్‌ కృష్ణారెడ్డి, బొనసొల గ్రామానికి చెందిన బాకి లింగరాజు, పాత్రపూర్‌ బ్లాక్‌ బొరంగొ గ్రామానికి చెందిన సిద్దాబత్తుల బాలకృష్ణ, సంకుడా గ్రామానికి చెందిన చిత్తరంజన్‌ సాహు, లండ ఈశ్వరరావులు మోసపోయారు. ఎలాగైనా తమను ఇండియాకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు
ఇటువంటి గల్ఫ్‌ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని ఇప్పటికే పలుసార్లు హెచ్చరించామని ఇచ్ఛాపురం సీఐ ఎం.వినోద్‌బాబు పేర్కొన్నా రు. ఈ విషయమై ఆయనను సాక్షి వివరణ కోరగా.. అనుమతులు లేకుండా ఇంటర్వ్యూలు నిర్వహించవద్దని ఇచ్ఛాపురం సర్కిల్‌ పరిధిలో గల అన్ని వెల్డింగ్‌ ఇనిస్టిట్యూట్లకు నోటీసులిచ్చామన్నారు. కువైట్‌ పంపించిన సంబంధిత వెల్డింగ్‌ ఇనిస్టిట్యూట్‌ వ్యవహారాన్ని కూడా పరిశీలించి, అవసరమైన చర్యలు చేపడతామన్నారు. 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా