లోకకళ్యాణార్ధం సింగపూర్‌లో శ్రీవారి కళ్యాణం

26 Mar, 2020 14:51 IST|Sakshi

సింగపూర్‌ : సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోకకళ్యాణార్ధం కోవిడ్ -19 నిర్మూలనే మహాసంకల్పంగా శ్రీ  శార్వరి నామ సంవత్సర ఉగాది పర్వదినాన శ్రీదేవి , భూదేవి సమేత శ్రీ శ్రీనివాసకల్యాణోత్సవం నిర్వహించారు. స్థానిక సెరంగూన్ రోడ్ లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయమందు మార్చి 25 బుధవారం నాడు అత్యంత  భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారికి ఉదయం పూట  సుప్రభాతసేవ, తోమాలసేవ, అభిషేకం, సహస్రనామార్చనలతోపాటూ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ  శ్రీనివాస కల్యాణం, ఆస్ధానం, ఊరేగింపును వైభవోపేతంగా నిర్వహించారు. లోక క్షేమం కొరకు రోగనివారక భగవన్నామ స్తోత్రాలను పండితులు భక్తులకు ఉపదేశించి పారాయణం చేయించారు. అనంతరం నిర్వహించిన పంచాంగ శ్రవణంను అందరూ ఆసక్తిగా ఆలకించారు. 

ప్రస్తుతమున్న ప్రత్యేక పరిస్ధితులదృష్ట్యా సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, హిందూ ఎండోమెంట్స్ బోర్డ్ నిర్ధేశించిన మార్గదర్శకాలతో దేవాలయానికి వచ్చే భక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించడం, భక్తుల వివరాల సేకరించడంతో పాటు భక్తులు సామాజిక దూరాన్ని పాటించేల వివిధ ఏర్పాట్లు చేసి వాలంటీర్ల సహాయంతో, భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరికీ షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడి, అన్నప్రాసాదములను ప్రత్యేక ప్యాకెట్ రూపంలో అందించారు.

తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి తెలుగువారందరికీ శార్వరీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలపటంతో పాటు, అందరూ ప్రభుత్వ సూచనలను, వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ సురక్షితంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి అన్నివిధాల సహకరించిన హిందూ ఎండోమెంట్స్ బోర్డుకు, పెరుమాళ్ దేవస్ధానాల కార్యవర్గాలకు కార్యక్రమ నిర్వాహకులు వినయ్ కుమార్ ధన్యవాదములు తెలిపారు.

మరిన్ని వార్తలు