ఎస్‌టీఎస్ ఆధ్వర్యంలో లేడీస్ నైట్

13 Sep, 2018 16:26 IST|Sakshi

సింగపూర్‌ : సింగపూర్ తెలుగు సమాజం(ఎస్‌టీఎస్‌) ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా 'నారి -2018' లేడీస్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఆర్చర్డ్ హోటల్‌ జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 550 మంది మహిళలు హాజరయ్యారు. ఉదయభాను వ్యాఖ్యాతగా కార్యక్రమాన్ని ఆద్యంతం ఉర్రూతలూగించారు. ఎమ్మెల్యే ఆర్ కె రోజా ముఖ్య అతిధిగా హాజరవ్వగా, ప్రముఖగాయని సమీర భరద్వాజ్ తన గాత్రం తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.


 
ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మిస్ అండ్ మిసెస్ ఎస్‌టీఎస్‌ పోటీలు, మహానటి వేషభాషల అనుకరణ పోటీలు, లఘుచిత్ర పోటీలు, వివిధ వినోదభరితమైన ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. వంద మంది వనితలు వివిధ సాంప్రదాయ దుస్తులను ధరించి సింగపూర్ బుక్ ఆఫ్ రికార్ద్స్ లో స్థానం సంపాదించడం విశేషం. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం, ఇంత మంది మహిళలు హాజరుకావడం, దానికి తనను ముఖ్య అతిధి ఆహ్వానించడం పట్ల రోజా ఆనందాన్ని వ్యక్తపరిచారు. అంతేకాకుండా, ప్రముఖ అడ్వకేట్ వేంకటేశ్వరితో కలిసి సింగపూర్ తెలుగు సమాజం సంయుక్తంగా 'లైఫ్ అండ్ లా" పోస్టర్ ను ఆవిష్కరించారు.

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. మహిళల కోసం ఈ కార్యక్రమం చేయటం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. వ్యాఖ్యాత ఉదయభాను, గాయని సమీర భరద్వాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన బిజీషెడ్యూల్ ని పక్కనబెట్టి ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిధి గా విచ్చేసిన రోజాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించుటకు కృషిచేసిన కార్యవర్గ సభ్యులకు, కార్యవర్గ సభ్యుల జీవిత భాగస్వాములకు, వాలంటీర్స్ కు, స్పాన్సర్స్ కు  కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలియజేసారు. విజేతలకు, సింగపూర్ బుక్ ఆఫ్ రికార్ద్స్ లో స్థానం సంపాదించిన మహిళలకు కార్యక్రమ నిర్వాహకురాలు స్వాతి అభినందనలు తెలియజేసారు.

మరిన్ని వార్తలు