గావస్కర్‌ నయా రికార్డ్‌!

17 Sep, 2019 16:27 IST|Sakshi

చికాగో: లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గావస్కర్‌ సరికొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. ఇప్పటివరకు క్రికెటర్‌గా, వ్యాఖ్యాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ చాంపియన్‌ ప్లేయర్‌.. ఇప్పుడు నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఉన్నాడు. దీనిలో భాగంగా హార్ట్ టు హార్ట్ ఫౌండేషన్‌తో చేతులు కలిపాడు. దీనిలో భాగంగా ఇప్పటివరకు 775కు పైగా చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేయించాడు. అతిత్వరలోనే హృదయ సంబంధ లోపాలతో జన్మించే వెయ్యి మంది పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించాలనే లక్ష్యంతో ఈ ఫౌండేషన్‌ ఉంది. అంతేకాకుండా ఈ ఏడాదిలో 5000, వచ్చే రెండేళ్లలో పదివేల మంది చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న గావస్కర్‌.. చికాగోలోని మానవ్‌ సేవ్‌ మందిర్‌ను దర్శించాడు. ఈ సందర్భంగా భారత్‌లో నిరుపేద చిన్నారులకు ఉచితంగా వైద్యం అందించాలని సాయి సంజీవని ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరాడు. 

ఇక తన బ్యాటింగ్‌ మెరుపులతో గావస్కర్‌ టీమిండియాకు ఎన్నో చిర​స్మరణీయ విజయాలను అందించాడు. అందులో ముఖ్యంగా వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన గావస్కర్‌ తన తొలి సిరీస్‌లోనే రెచ్చిపోయాడు. ఏకంగా అరంగేట్రపు టెస్టు సిరీస్‌లో 774 పరుగులు సాధించి అప్పట్లో సంచలనం సృష్టించాడు. అయితే తాజాగా ఆసీస్‌ మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌ యాషెస్‌ సిరీస్‌లో తన అద్బుత ఫామ్‌తో 774 పరుగులు సాధించి గావస్కర్‌ సరసన చేరాడు. అయితే స్మిత్‌ రికార్డు అందుకున్న రోజే హార్ట్ టు హార్ట్ విత్ సునీల్ గావాస్కర్ ఫౌండేషన్‌ 775 మంది చిన్నారులకు ఆపరేషన్లు పూర్తి చేసింది. దీంతో గావస్కర్‌ తన రికార్డును తానే బ్రేక్‌ చేసుకున్నాడని పలువురు ప్రశంసిస్తున్నారు. (చదవండి: పిల్లల ఆపరేషన్లకు ఎన్‌ఆర్‌ఐల భారీ విరాళం)

మరిన్ని వార్తలు