బిడెన్తో హెచ్1బీ వీసాలపై చర్చించా: సుష్మా

24 Jul, 2013 16:36 IST|Sakshi

అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులకు జారీ చేసే హెచ్1బీ వీసా అంశంపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జో బిడెన్తో చర్చించినట్లు భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకురాలు, లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ వెల్లడించారు. భారత్లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా న్యూఢిల్లీ వచ్చిన ఆయనతో స్వరాజ్ మంగళవారం సాయంత్రం సమావేశమైనారు.  అనంతరం విలేకర్ల సమావేశంలో ఆమె ప్రసంగించారు.

 

యూఎస్లో ఇటీవల బిల్లుగా రూపాంతరం చెందిన హెచ్1బీ వీసాల వల్ల భారతీయ వృత్తి నైపుణులకు, ఐటీ రంగం పరిశ్రమలకు కలుగుతున్న లాభానష్టాలపై ఆయనకు వివరించినట్లు ఆమె తెలిపారు. బిడెన్తో సమావేశం సంతృప్తికరంగా సాగిందని సుష్మా స్వరాజ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. యూఎస్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి వీసా జారీ ప్రక్రియపై అంక్షలు విధించిన క్రమాన్ని బిడెన్తో చర్చించినట్లు సుష్మా చెప్పారు.

 

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం విదిశ (మధ్యప్రదేశ్)కు ఆయనను ఆహ్వానించానని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె తెలిపారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా యూఎస్ ఉపాధ్యక్షుడు జో బిడెన్ సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలపేతానికి జో పర్యటన దోహదపడుతుందని ఇరుదేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు