తామా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా సంబరాలు

21 Aug, 2019 15:15 IST|Sakshi

అట్లాంటా : అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో ఇన్ఫోస్మార్ట్  టెక్నాలజీస్ అధినేత కరుణాకర్ రెడ్డి అసిరెడ్డి పర్యవేక్షణలో నారీమణుల కోసం ప్రత్యేకంగా మహిళా సంబరాల కార్యక్రమం జరిగింది. దాదాపు 400 మందికి పైగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా తామా కార్యవర్గ వనితలు శ్రీవల్లి శ్రీధర్, ప్రియ బలుసు, శిల్ప మద్దినేని, గౌరి కారుమంచి, హరిప్రియ దొడ్డాక, నీరజ ఉప్పు, ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీవల్లి, శిల్ప ఉప్పులూరి, స్రవంతి, పూజిత, పూర్ణిమ అర్జున్, రాగ వాహిని, భానుశ్రీ వావిలకొలనులు తమ గాత్రంతో ప్రేక్షకుల అలరించారు. వీణావాయిజ్యకారిణి ఉష మోచెర్ల, శాంతి మేడిచెర్ల వివిధ ప్రాంతీయ నృత్యాలతో మయూర వన్నెల నాట్య శిఖామణులు, యాంకర్‌గా రాగ వాహిని మాట చాతుర్యతతో అందరినీ ఆకట్టుకున్నారు. అధిక బరువు, మానసిక ఒత్తిడికి సంబంధించి డాక్టర్ నందిని సుంకిరెడ్డి, డాక్టర్ సౌమ్య రెడ్డి తమ అమూల్యమైన సూచనలు సలహాలు అందించారు. తామా సహకారంతో ప్రతి శనివారం నిర్వహిస్తున్న సిలికానాంధ్ర మనబడి గురువులను సత్కరించారు.

'ఆడజన్మ' ప్రదర్శన అందరి హృదయాలను ఆకట్టుకుంది. దాస్యం మాధవి 'స్త్రీ తత్వం' అనే కవితాంశతో ప్రారంభించి ఆడజన్మను మొదలుకొని ఒక స్త్రీ తన జీవిత కాలంలో తను ఎదుర్కొని పోరాడే ఒక్కో అంశాన్ని కళ్ళకు కట్టినట్టుగా వర్ణిస్తూ రమణీయంగా అభివ్యక్తపరిచారు. పాటలతో, ఆటలతో, మాటలతో నవరసాలను పండించారు. అంతే కాకుండా 'తెలుగు అమ్మాయి' పోటీ నిర్వహించి పలురకాల వైవిధ్య పరీక్షలతో పోటీదారులలో ఉత్సాహాన్ని నింపి వారిలో అత్యుత్తమంగా రాణించిన కొందరు నారీమణులకు విశిష్ఠ అతిథుల చేత బహుమానాలను అందింపచేసారు. ఈ సందర్భంగా విజేతలకు కాంత్ పొట్నూరు, సునీత పొట్నూరు బహుమతులను అందజేశారు. అలాగే కే.బి. జవేరి జువెలర్స్ డికేటర్ సమర్పించిన డైమండ్ రింగ్ తోపాటు ఇతర రాఫుల్ బహుమతులను కూడా విజేతలకు అందించారు. రేఖ హేమాద్రిభొట్ల, దీప్తి అవసరాల, గౌతమీ ప్రేమ్, కల్పనా పరిటాల, సుష్మ కిరణ్ తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో తమవంతు కృషి చేశారు.


 

మరిన్ని వార్తలు