అతిథిగా పిలిచి అవమానిస్తామా? : తానా

9 Jul, 2019 15:15 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికాలో జరిగిన తానా మహాసభల్లో బీజేపీ జాతీయ కార్యదర్శి రాం మాధవ్‌కు అవమానం జరిగిందంటూ వస్తున్న వార్తలను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఖండించింది. సామాజికమాధ్యమాలతో పాటూ పలు మీడియాల్లో రాం మాధవ్‌కు చేదు అనుభవం ఎదురైందంటూ వార్తలు రావడం బాధాకరమని తానా 2019 సదస్సు కోఆర్డినేటర్‌ డా.వెంకట రావు ముల్పురి అన్నారు. తానా సభల్లో రాం మాధవ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారని తెలిపారు. అన్ని ముఖ్యమైన రాజకీయపార్టీల నాయకులు తానా సభలకు వచ్చారని చెప్పారు.

సభలకు విచ్చేసిన రాం మాధవ్‌ను తానా కార్యవర్గం మర్యాదపూర్వకంగా ఆహ్వానించిందని, తర్వాత స్టేజీపైకి వెళ్లే సమయంలో 10 మంది డ్రమ్స్‌తో తీసుకువెళ్లారని వెంకట రావు ముల్పురి తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందించామన్నారు. రాం మాధవ్‌ ప్రసంగించే సమయంలో అక్కడ 14 వేల మంది హాల్‌లో ఉన్నరన్నారు. దాదాపు రాం మాధవ్‌ ప్రసంగం ఆసాంతం ప్రశాంతంగా సాగిందని, చివర్లో మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ పేరు రావడంతో కొందరు ప్రత్యేక హోదా విషయమై అరిచారన్నారు. ముందు 30 వరుసల్లో కూర్చున్న తానా ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు, తానా సభ్యులు మిగతావారు ఎలాంటి నినాదాలు చేయలేదని స్పష్టం చేశారు. కేవలం జనరల్‌ టికెట్‌ తీసుకుని వచ్చిన అతిథులు కూర్చున్న దగ్గర నుంచే కొందరు నినాదాలు చేశారన్నారు. రాం మాధవ్‌ను ముఖ్య అతిథిగా పిలిచి ఆయన్ని తానా ఎందుకు అవమానిస్తుందన్నారు. తానా వేడుకలకు అపఖ్యాతి తీసుకొచ్చేందుకే కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు