వాషింగ్టన్‌లో తానా మహాసభలు

18 Jun, 2018 09:00 IST|Sakshi

వాషింగ్టన్‌ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ ద్వైవార్షిక మహాసభలకు 2019 జూలై 4,5,6 తేదీలలో వాషింగ్టన్ డీసీ లోని వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కాబోతోంది. ప్రవాస తెలుగు సంఘం తానా అంగరంగ వైభవంగా ప్రతి రెండేళ్లకొకసారి జరుపుకునే మహాసభలకు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ వాషింగ్టన్ డీసీ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈమేరకు జూన్ 15వ తేదీన తానా అధ్యక్షులు సతీష్ వేమన, కార్యవర్గబృందం వాషింగ్టన్ డీసీలో వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ అధికారులతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ వేమన మాట్లాడుతూ గడచిన కొద్ది నెలలుగా వాషింగ్టన్ డీసీలో మళ్లీ తానా మహాసభలను ఏర్పాటు చెయ్యాలని తీవ్రంగా కృషి చేసినట్లు తెలిపారు. ఈ మహాసభల నిర్వహణలో పాలుపంచుకోవటానికి వాషింగ్టన్ డీసీ తెలుగు కమ్యూనిటీ చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తోందని అందరి సహకారంతో తానా ప్రతిష్ఠ మరింత పెంచేలా తెలుగు భాషా సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా నభూతో నభవిష్యత్ అనే విధంగా మహాసభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు కోమటి జయరాం, తానా బోర్డు చైర్మన్ చలపతి కొండ్రకుంట, తానా ఫౌండేషన్ చైర్మన్ డా. ప్రసాద్ నల్లూరి, మాజీ బోర్డు చైర్మన్ డా. నరేన్ కొడాలి, 2007 తానా మహాసభల కన్వీనర్ డా. హేమప్రసాద్ యడ్ల, తానా కోశాధికారి రవి పొట్లూరి, డా. వెంకట్రావు మూల్పూరి, తానా ఫౌండేషన్ కోశాధికారి రమాకాంత్ కోయ, ట్రస్టీ రవి మందలపు  క్యాపిటల్ రీజియన్ ప్రాంతీయ కోఆర్డినేటర్ రఘు మేకా, గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం అధ్యక్షులు సత్యనారాయణ మన్నే, రామ్ చౌదరి ఉప్పుటూరి తదితరులు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు