డల్లాస్‌లో టాంటెక్స్ 'నెల నెలా తెలుగు వెన్నెల'

23 Jul, 2018 13:19 IST|Sakshi

డల్లాస్‌ (టెక్సాస్‌) : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' తెలుగు సాహిత్య వేదిక 11వ వార్షికోత్సవ వేడుకలు డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. స్థానిక ఫార్మర్స్ బ్రాంచ్ సెయింట్ మేరీస్ మలంకర చర్చి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో డల్లాస్‌లోని తెలుగు భాషాభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. తెలుగు సాహిత్య వేదిక వార్షికోత్సవానికి శీలం కృష్ణవేణి అధ్యక్షత వహించగా, వీర్నపు చినసత్యం సమన్వయకర్తగా వ్యవహరించారు. 

2018 సంవత్సరంలో జరిగిన సాహిత్య కార్యక్రమాల గురించి సాహిత్య వేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం వివరించారు. లాస్య సుధ అకాడమీ విద్యార్థులైన శ్రావణి, హాసిని, బృంద, రుషిత, శ్రావ్య, సిరి, శ్రీనిధి, ఇషా కె, వినిష, ధాత్రిశ్రీ ప్రార్థనా గీతం ఆలపించారు. ఎన్.ఎస్.మూర్తిగారు 'అనువాద కథలు' అంశం మీద తాను స్వయంగా తర్జుమా చేసిన కొన్ని కథలు వాటి  ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రసంగించారు. విశ్వపతి టీ.వీ.ఆర్.కె.మూర్తి 'అన్నమయ్య సాహిత్యంలో సాంఘిక సమానత్వం' అంశం మీద మాట్లాడారు. ప్రముఖ వెంట్రిలోక్విస్ట్ సంతోష్ తన అద్భుతమైన ప్రదర్శనతో అందరిని ఆనందంలోముంచెత్తారు.

సత్కళాభారతి సత్యనారాయణ 'కళలు-సంస్కృతి' గురించి మాట్లాడారు. నెలనెలా తెలుగు వెన్నెల స్థాపకులను, ఇప్పటి దాకా ప్రతి సంవత్సరం సాహిత్య వేదిక నిర్వహించిన సమన్వయకర్తలను ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం ఘనంగా సత్కరించింది. ప్రభల అంజలి, కాకర్ల దీపిక, ప్రభల ఆరతి వాగ్గేయకార వైభవం తెలుపుతూ ఆలపించారు. డా.వైజర్సు బాలసుబ్రహ్మణ్యం 'సంగీత సాహిత్య సమన్వయం' అంశం మీద ప్రసంగించారు. ముత్తేవి రవీంధ్రనాథ్ 'తెలుగు సంస్కృతి - ఒక పరిచయం' అంశం మీద ప్రసంగించారు. టాంటెక్స్ అధ్యక్షులు శీలం కృష్ణవేణి తమ సందేశాన్ని సభకు వినిపించారు. ప్రఖ్యాత తెలుగు రచయిత  చిలకమర్తి రచించిన 'గయ్యాళి గంగమ్మ' హాస్య నాటికను ప్రభల శ్రీనివాస్ దర్శకత్వంలో నటీనటులు ఇంగువ లావణ్య, తడిమేటి కళ్యాణి, గోలేటి శ్రీరాం చక్కగా ప్రదర్శించారు. 

ఎన్.టీ.ఆర్  జీవిత చరిత్ర అయిన' ఎదురులేని మనిషి' పుస్తకాన్ని డా. నందమూరి లక్ష్మి పార్వతి ఆవిష్కరించారు. అనంతరం 'సంస్కృతంలో చమత్కారాలు' అంశం మీద ప్రసంగించారు. ప్రముఖ నృత్య దర్శకులు డా.హలీం ఖాన్ ఆవుల కళ్యాణికిచెందిన అభినయ కూచిపూడి డాన్స్ అకాడమీ కళాకారులు మేకల నైషా, ఆవుల అభినయ్, కోలి శ్రీవల్లి, కొండల నమ్రత,కొండల అంషిక, నల్ల సమీక్ష, కర్ర దీషణ, వెలగ మహిత, గూడ అనీక, మంతెన రాధిక, కొండబోయిన శృతితో కలిసి తెలుగు భాష చరిత్ర విశేషాలను తెలుపుతూ 'తెలుగు ప్రస్థానం' అనే నృత్య రూపకాన్ని ప్రదర్శించారు.

సాహితీ ప్రముఖులందరిని ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు శీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షులు వీర్నపు చినసత్యం, కార్యవర్గ బృందం, పాలకమండలి అధిపతి కన్నెగంటి చంద్ర బృందం పాల్గొని పుష్ప గుచ్చం , దుశ్శాలువ, జ్ఞాపికలతో సన్మానించారు. తెలుగు భాష అభివృద్ధిని ఎల్లవేళలా  ప్రోత్సహిస్తూ , ఈ 11 వ సాహిత్య వేదిక వార్షికోత్సవానికి తమవంతు ధన సహాయం అందించిన పోషక దాతలను అబినందిస్తూ, సంస్థ వారిని జ్ఞాపికలతో సన్మానించినది. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ సాహిత్య వేదిక కమిటీ, కార్యవర్గ సభ్యులకు, వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు