టాంటెక్స్ ఆధ్వర్యంలో కార్టూన్ సదస్సు

26 Jun, 2018 16:45 IST|Sakshi

డల్లాస్‌ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్‌) ఆధ్వర్యంలో కార్టూన్ వర్క్ షాప్ నిర్వహించారు. స్థానిక  ఎస్.పి.ఆర్. బాంక్వెట్ హాల్‌లో శీలం కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ కార్టూనిస్ట్ టి.వి.ఆర్.కే.మూర్తి (విశ్వపతి) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశ్వపతి పేరుతొ ప్రసిద్ధులైన మూర్తి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో 1984 నుంచి 1990 దాకా సమ్‌ఫన్‌ అనే శీర్షికతో కార్టూన్స్ వేశారు. ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతివంటి ప్రముఖ పత్రికల్లో 5వేలకు పైగా కార్టూన్లు వేశారు.  టాంటెక్స్‌ పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం విశ్వపతిని సభకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ  కార్టూన్స్ గురించి తన అనుభవాలు జోడిస్తూ, రక రకాల బొమ్మలు ఎలా గీయొచ్చో తెలిపారు. అందరూ విశ్వపతి వేసిన బొమ్మలను అనుకరించి నేర్చుకోవడానికి ప్రయత్నించారు. ప్రతి ఒక్కరితో విశ్వపతి సంభాషిస్తూ, కార్టూన్లు గీయడంలో మెళకువలు వివరించారు. అంతేకాకుండా బాగా బొమ్మలు గీసిన వారికి తాను రాసిన 'సిన్సియర్లీ యువర్స్‌' పుస్తకాలను బహుమతిగా ఇచ్చారు. తాను గీసిన కొందరి ప్రముఖుల వ్యంగ్య చిత్రాలను టాంటెక్స్‌ కార్యవర్గ సభ్యులకు బహుమతిగా ప్రదానం చేశారు. 

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షురాలు శీలం క్రిష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం విశ్వపతిని శాలువతో, సంస్థ కార్యవర్గ సభ్యులు జ్ఞాపికతో సత్కరించారు. శీలం క్రిష్ణవేణి మాట్లాడుతూ విన్నూత్నంగా టాంటెక్స్  మొదటి సారిగా చేపట్టిన ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన వారికి, డ్రాయింగ్ పుస్తకాలను అందించిన కృష్ణ జ్యూవెలర్స్ వారికి, ఎస్.పి.ఆర్.బాంక్వెట్ హాల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు కోడూరు క్రిష్ణారెడ్డి, కార్యదర్శి మండిగ శ్రీలక్ష్మి, కోశాధికారి పాలేటి లక్ష్మి, కార్యవర్గ సభ్యులు బండారు సతీష్, ఇల్లెందుల సమీర పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు