ఘనంగా ముగిసిన టాంటెక్స్ 135వ సాహిత్య సదస్సు

22 Oct, 2018 14:52 IST|Sakshi

డల్లాస్‌ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' సాహిత్య సదస్సు నిర్వహించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 135 నెలల పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులను టాంటెక్స్ నిర్వహించింది. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి, ఉత్సాహంగా పాల్గొని సభని జయప్రదం చేశారు. కార్యక్రమంలో ముందుగా చిన్నారులు వేముల సాహితి, వేముల సింధూర ప్రార్ధనా గీతంతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. తరువాత మనబడి చిన్నారులు గురజాడ దేశభక్తి గీతం ఆలపించారు. నానుడి, జాతీయాలు, పొడువు కథలు గురించి డా. ఊరిమిండి నరసింహ రెడ్డి ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తి రేకెత్తించారు. చంద్రహాస్ మద్దుకూరి ‘పిలిచినా బిగువటరా’ పాట పూర్వాపరాలు వివరించారు. 

డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి దేవరకొండ బాల గంగాధర్ తిలక్ కవితా వైశిష్ట్యాన్ని సోదాహరణంగా వివరించారు. కొన్ని కవితలు చదివి వినిపిస్తూ, అమృతం కురిసిన రాత్రితో ముగించారు. రమణ జువ్వాడి శ్రీనాధుని పద్య వైభవాన్ని కొన్ని పద్యాలు చదివి వివరించారు. డా. పుదూర్ జగదీశ్వరన్ ఆముక్తమాల్యదలోని కొన్ని పద్యాలను రాగ యుక్తంగా చదివి వాటి అర్ధం వివరించారు. ఉమా భారతి రాసిన ‘సరికొత్త వేకువ’, ‘నాత్యభారతీయం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. బసాబత్తిన ‘నాట్య భారతీయం’ , ‘సరి కొత్త వేకువ’ పుస్తకాలను, రచయిత్రిని సభకు పరిచయం చేశారు.

ఉమాభారతి కోసూరి  మాట్లాడుతూ.. 'సాహిత్యమంటే.. ఓ పుస్తకం, వేమన పద్యాలు మాత్రమే కాదు. కళలంటే ‘తకిట తఝణులు’, రాగాలాపనలు మాత్రమే కాదు. ‘సహితస్య భావం సాహిత్యం’ అంటే అన్ని
కళలు కలగలసినదే సాహిత్యం అని అర్ధం. కళలలో కవిత్వానిది అగ్రపీటం. కవిత్వం సాహిత్యంలో అంతర్భాగం అని మనకి తెలిసిందే.  కవిత్వం అంటే దుఃఖార్తులకూ, శ్రమార్తులకూ, శోకార్తులకూ మానసికోల్లాసాన్ని
కలిగించే దివ్య కళ అని నాట్యశాస్త్రంలో భరతుడు అంటాడు. అసలు జీవించడం నుండే సాహిత్యం పుట్టుకొస్తుంది అని కూడా అనవచ్చు. మానవ జీవనానికి గొప్ప మార్గదర్శకం మనకున్న సాహిత్య సంపదే అని, జీవన విధానాన్ని దిద్దుకునేందుకు సరిదిద్దుకునేందుకు కూడా మనకున్న గొప్ప సాహిత్య సంపద ఎంతైనా తోడ్పడుతుంది అని ఎందరో మేధావులు సూచించారు. అలాగే మనిషి మానసిక ఎదుగదల, సంక్షేమాలపై కూడా సాహిత్య, లలితకళల ప్రభావం తప్పక ఉంటుంది అని కూడా ఉండనే ఉంది. ముఖ్యంగా అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని మొదటి తరం సాహితీ వేత్తలు ముందు తరాల కందించే విధానానికి ముగ్దురాలై అమెరికాలోని సాహితీ వేత్తలందరికీ ధన్యవాదాలు తెలుపుపుతున్నా' అని పేర్కొన్నారు.

ఉమాభారతి కోసూరిని టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, అధ్యక్షురాలు శీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు, కార్యదర్శి శ్రీలు మండిగ, పాలకమండలి సభ్యులు  శాలువా, జ్ఞాపిక ఇచ్చి  ఘనంగా సత్కరించారు. తనను ఎంతో ఆదరించి, చక్కటి ఆతిధ్యం అందించిన  టాంటెక్స్ కార్యవర్గానికి ఉమా భారతి కృతజ్ఞతలు తెలియజేశారు. టాంటెక్స్ అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం మాట్లాడుతూ ఉమా భారతి నృత్య సేవలను కొనియాడారు. తన పూర్వ ప్రదర్శనలను గుర్తు చేసుకున్నారు. సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు