అమెరికాలో ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం

9 Oct, 2019 15:42 IST|Sakshi

వాషింగ్టన్‌: నగరంలో కనుల పండుగగా శ్రీనివాస కళ్యాణ వేడుకలు ‘తారా’ (తెలుగు అసోషియేషన్‌ ఆఫ్‌ రీడింగ్‌ అండ్‌ అరౌండ్‌) జనరల్‌ సెక్రటరీ 'సంతోష్‌ కుమార్‌ బచ్చు ఆధ్వర్యంలో  అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ...  శ్రీ వేంకటేశ్వర స్వామివారు, శ్రీదేవి, భూదేవి, అమ్మవార్ల విగ్రహాలకు తిరుపతిలో కళ్యాణం జరిగేంత ఘనంగా వేద పండితులు, అర్చకుల చేత కళ్యాణ వేడుకలు జరిపించినట్లు పేర్కొన్నారు. నాదస్వర వాయిద్యాల మధ్య  కోలాటం ఆడుతూ... స్వామి వారిని పల్లకిలో స్వాగతిస్తూ.. సుప్రభాత సేవతో స్వామివారిని, అమ్మవార్లను ఊరేగించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తి విన్యాసాలతో,  గోవింద నామాలతో , విష్ణు సహస్ర , అన్నమాచార్య కీర్తనలతో భక్త బృందం పాల్గొని తన్మయత్వంలో మునిగితేలారు.

అలాగే  ఉదయం ఏర్పాటు చేసిన ఫలహారాన్ని, కళ్యాణం తర్వాత పంచిన మహాప్రసాదాన్ని భక్తులు ఆస్వాదించారని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా తిరుపతి నుంచి తెప్పించిన లడ్డు, వడ ప్రసాదం విరివిరిగా పంచామని, చివరగా పల్లకి సేవతో స్వామివారికి, అమ్మవార్లకి భక్తులంతా వీడ్కోలు పలికినట్లు ఆయన వివరించారు. స్వామివారి కళ్యాణం తర్వాత తిరుపతి నుంచి తెప్పించిన లడ్డూ ఉచితంగా పంచడంతో భక్తులంతా హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. అనంతరం స్వామివారి కళ్యాణానికి హజరై విజయవంతం చేసిన భక్తులందరికి  తారా నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. 


>
మరిన్ని వార్తలు