ఎన్నారైల నీటి ప్రమాదాలపై ‘టాటా’ ఆందోళన

12 Sep, 2019 16:16 IST|Sakshi

ఎన్నో ఆశలతో, మరెన్నో ఆశయాలతో అమెరికా బాటపడుతున్న తెలుగు యువత అవి నెరవేరకముందే అర్ధాంతరంగా మృత్యువాత పడుతున్నారు. ఎన్నో కలల్ని మోసుకుంటూ ఉన్నత దిశగా ఎదగాలని, వారి మీదే ప్రాణాల్ని పెట్టుకున్న కుటుంబ సభ్యులకి మంచి జీవితం ఇవ్వాలనే కోరికలతో వెళ్లి ఇలా విదేశాల్లో ప్రమాదాల బారిన పడి అయినవారికి తీరని శోకాన్ని మిగల్చడం బాధాకరం. అమెరికా గడ్డపై ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. వాటిలో కూడా సరదా కోసం నీటిలోకి దిగి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో పీజీ చేస్తున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు కౌశిక్‌ ఓలేటి, కొయ్యలముడి అజయ్‌లు సెప్టెంబరు 3న నీట మునిగి ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ ప్రమాదాలపై తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(టాటా) ఆందోళన వ్యక్తం చేసింది. టాటా ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ మహేష్‌ ఆదిభట్ల దీనిపై ఒక ప్రెస్‌ నోట్‌ను విడుదల చేశారు.

నీటిలో మునిగి చనిపోవడం వల్ల అమెరికాలో ఏడాదికి 3,72,000మంది చనిపోతున్నారు. ఈ మరణాలలో భారత సంతతికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరగడం మా దృష్టికి వచ్చింది. సరైన అవగాహన లేక నదులు, జలపాతాలలోకి దిగి ప్రాణాలు విడుస్తున్నారు. కొందరు తమ మాతృదేశంలో మంచి ఈత వచ్చిన వారు కావొచ్చు. అలా అని అమెరికాలోని నదులలో ఈత అంత సులభం కాదు. మన నదుల తీరు వేరు. ఇక్కడి పరిస్థితులు వేరు. ఇవేవి తెలియకుండా భారత్‌లో ఈత కొట్టాం.. అమెరికాలో కొట్టలేమా అని నదులలోకి దిగి మృత్యువాత పడుతున్నారు. భారత నదులకు పూర్తి భిన్నంగా ఇక్కడి నదులు ఉంటాయి. 

ఒక్లహామాలోని టర్నర్‌ఫాల్స్‌, డల్లాస్‌లోని గ్రేప్‌వైన్‌, క్రేటర్‌ లేక్‌, లివర్‌మోర్‌ నదులలో ఎక్కువగా భారతీయులు ప్రమాదాల బారిన పడుతున్నారు. టర్నర్‌ఫాల్స్‌ జలపాతంలో గత మూడు నెలల్లోనే నలుగురు భారతీయులు మృత్యువాత పడ్డారు. జులై నెలలో ఒకరు, ఆగస్టులో ఒకరు, సెప్టెంబర్‌లో ఇద్దరు ఈ జలపాతంలో మునిగి చనిపోయారు. భారతీయులకు ఈ నదులపై సరైన అవగాహనలేక వీటిని పర్యాటాక స్థావరాలుగా భావించి తెలియక నీటిలో దిగి మృత్యువాత పడుతున్నారు. ఈ ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని టాటా సూచిస్తోంది. తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ వీటిపై అవగాహన కల్పించేందుకు పలు సదస్సులు నిర్వహిస్తోంది. ఒత్తిడికి గురైన వారికి సహాయ సహకారాలు అందిస్తోంది. టాటా అడ్వైజరీ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పైల మల్లారెడ్డి, అధ్యక్షుడు విక్రమ్‌ జంగం సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు.

మరిన్ని వార్తలు