రోటరీ క్లబ్‌తో తెలంగాణ జాగృతి యూకే భాగస్వామ్యం

9 Apr, 2018 08:54 IST|Sakshi

సాక్షి, లండన్‌ : తెలంగాణ జాగృతి యూకే విభాగం మరో మైలు రాయిని సాధించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత కలలను, ఆశయాలను సాకారం చేసేలా కేవలం సాంస్కృతిక, కళా రంగాలలోనే కాకుండా సేవ రంగంలోనూ దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా చారిత్రాత్మక సేవ సంస్థ అయిన రోటరీ క్లబ్‌తో తెలంగాణ జాగృతి యూకే విభాగం భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ సందర్బంగా బాసిల్డాన్‌లో తెలంగాణ జాగృతి యూకే విభాగం, రోటరీ క్లబ్‌తో పరస్పర సహకారాన్ని కోరుకుంటూ అనుబంధ పత్రాన్ని విడుదల చేశారు.

తమ సేవ కార్యక్రమాలను ప్రవాస తెలంగాణ, తెలుగు వారికే కాకుండా బ్రిటన్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు విస్తృతం చేయడానికి రోటరీ క్లబ్ సంస్థతో అనుబంధం పత్రం చేసుకున్నామని జాగృతి యూకే అధ్యక్షులు సుమన్ బలమూరి తెలిపారు. రోటరీ క్లబ్ సభ్యుల సహకారం మరువ లేనిదని, మున్ముందు వారి భాగస్వామ్యంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని సుమన్ పేర్కొన్నారు. జాగృతి కార్యక్రమాలను ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం చేయడం మంచి ఆలోచనని జాగృతి వ్యవస్థావప అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకి రోటరీ క్లబ్ సభ్యులు అభినందనలు తెలిపారు. ఇటీవలే తెలంగాణ జాగృతి యూకే విభాగం యూకే ప్రభుత్వ ఎన్‌హెచ్‌ఎస్‌(నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌)తో భాగస్వామ్యం ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. రోటరీ క్లబ్ ముఖ్య బృందంతో పాటు, సుమన్ బలమూరి, ఉపాధ్యక్షుడు వంశీ తులసి, కార్య వర్గ సభ్యులు సలాం యూసఫ్, వంశీ సముద్రాల, వెంకట్ బాలగోని ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు