ఉపాధికి వెళ్తే.. అప్పులే మిగిలాయి!

28 Feb, 2020 12:00 IST|Sakshi

షార్జాలో కంపెనీ యజమాని వంచన

ఎన్నో కష్టాలు పడిఇంటికి చేరుకున్న కార్మికులు

మోర్తాడ్‌(నిజామాబాద్‌ జిల్లా): కంపెనీ యజమాని చేసిన పనికి వేతనం ఇవ్వకపోగా వీసా రెన్యూవల్‌ చేయకపోవడంతో పలువురు తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు అష్టకష్టాలు పడి స్వస్థలాలకు చేరుకున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) దేశం షార్జాలోని ఏఓజీఎం కంపెనీ యజమాని బిచానా ఎత్తివేయడంతో 16 మంది కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది.  షార్జాలో కేరళకు చెందిన వ్యక్తి కంపెనీ ఏర్పాటు చేసి భవన నిర్మాణ పనులు, ఇతర కాంట్రాక్టులు చేపట్టి మన దేశం నుంచి కార్మికులను రప్పించుకున్నాడు. అలా తెలంగాణ రాష్ట్రానికి చెందిన 16 మందితో పాటు ఇతర రాష్ట్రాల కార్మికులు కూడా ఈ కంపెనీలో పనిచేయడానికి వీసాలు పొందారు. అయితే కొంత కాలం బాగానే ఉన్నప్పటికీ ఆరు నెలల నుంచి కంపెనీ యజమానికి జీతాలు ఇవ్వడం లేదు. ఒక్కో కార్మికునికి రూ.1.80లక్షల చొప్పున వేతన బకాయి చెల్లించాల్సి ఉంది. డబ్బు కోసం ఇంటికి వెళుతున్నా అని చెప్పిన యజమాని తన సొంత రాష్ట్రమైన కేరళకు వెళ్లిపోయాడు. కంపెనీ యజమాని ఎప్పుడైనా షార్జాకు వస్తాడనే ఆశతో కార్మికులు మూడు నెలల పాటు కంపెనీ క్యాంపులోనే ఉండిపోయారు. అయినా యజమాని నుంచి స్పందన లేకపోవడంతో సొంత ఖర్చులతోనే కార్మికులు ఇంటికి చేరుకున్నారు.

జరిమానా చెల్లించి..
వీసాల రెన్యూవల్‌ గడువు ముగిసిపోవడం, కంపెనీ యజమాని పత్తా లేకపోవడంతో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు కార్మికులు జరిమానా భారం మోయాల్సి వచ్చింది. వీసా గడువు తీరిపోయి షార్జాలో చట్ట విరుద్ధంగా ఉన్నందుకు ఆర్మూర్‌ మండలం ఇస్సాపల్లికి చెందిన ముత్తెన్న, మోర్తాడ్‌ మండల తిమ్మాపూర్‌కు చెందిన జయరాజ్‌లు రూ.50వేల చొప్పున అక్కడి ప్రభుత్వానికి జరిమానా చెల్లించారు. అయితే 16 మంది కార్మికుల్లో 14 మంది కార్మికులకు వీసా గడువు ఉండటంతో వారికి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. కాగా, 14 మంది కార్మికులు ఒక్కొక్కరు రూ.14వేల చొప్పున విమాన చార్జీలను చెల్లించడానికి ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకున్నారు. ముత్తెన్న, జయరాజ్‌లు మాత్రం జరిమానా, విమాన చార్జీల కోసం అందరికంటే ఎక్కువ సొమ్ము ఇంటి నుంచి తెప్పించుకోవాల్సి వచ్చింది. ఏఓజీఎం కంపెనీ యజమానిపై షార్జాలోని మన విదేశాంగ శాఖ కార్యాలయంలో కార్మికులు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. విదేశాంగ శాఖ అధికారులు తమకు ఏ విధంగానూ సహకరించలేదని దీంతో షార్జా ప్రభుత్వానికి జరిమానా తప్పనిసరిగా చెల్లించాల్సి వచ్చిందని ఇద్దరు కార్మికులు వాపోయారు.

అప్పు చేసి డబ్బులు పంపించారు..
షార్జా ప్రభుత్వానికి జరిమానా చెల్లించడానికి, విమాన చార్జీల కోసం మా ఇంటి వద్ద రూ.75వేలు అప్పు తీసుకుని షార్జాకు పంపిస్తేనే నేను ఇటీవల ఇంటికి వచ్చాను. కంపెనీ యజమానిపై షార్జాలోని మన విదేశాంగ  కార్యాలయంలో ఫిర్యాదు చేశాం. కానీ, అధికారులు పట్టించుకోకపోవడంతో మాకు దిక్కులేకుండా పోయింది.– ముత్తెన్న, ఇస్సాపల్లి(ఆర్మూర్‌ మండలం)

ప్రభుత్వం ఆదుకోవాలి...
షార్జాలో కంపెనీ యజమాని వంచనతో అవస్థలు పడుతూ ఇంటికి చేరుకున్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. చేసిన పనికి వేతనం రాలేదు. వీసా గడువు ముగిసిపోయినందుకు జరిమానా మీద పడింది. మా పరిస్థితి  దయనీయంగా ఉంది. ప్రభుత్వం స్పందించి మాకు ఆర్థిక సహాయం అందించాలి.– జయరాజ్, తిమ్మాపూర్‌(మోర్తాడ్‌ మండలం)

మరిన్ని వార్తలు