ఆసియా దేశాల సదస్సుకు తెలంగాణ ఎన్నారై అధికారి

1 Aug, 2019 14:41 IST|Sakshi

 ఫిలిప్పీన్స్ : ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఆగస్టు 3-4 తేదీలలో ప్రవాసి కార్మికుల కోసం వివిధ దేశాలలో అందుబాటులో ఉన్నసహాయక వ్యవస్థలపై ఆసియా స్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహిస్తున్నారు. మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఎ) నిర్వహిస్తున్న ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ ప్రవాసి విభాగం అధికారి చిట్టిబాబు హాజరవుతున్నారు. ప్రవాసి కార్మికులకు ఆయాదేశాలలో ప్రస్తుతం అందుబాటులోఉన్న సహాయక వ్యవస్థలు, ఉత్తమ పద్ధతుల గురించి ఇందులో పాల్గొనే ప్రభుత్వ ప్రతినిధులు, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకునే వీలు కలుగుతుంది. 

ఈ సమావేశం ద్వారా ఆసియా దేశాలలోని వలసకార్మికులకు అందుతున్న వివిధ సహాయక వ్యవస్థల గురించి తెలుసుకొని, అర్థం చేసుకోవడం, అమలులో ఉన్న మంచి పద్దతులను అధ్యయనం చేయడానికి అవకాశం దొరుకుతుంది. వేరే దేశంలో విజయవంతంగా అమలవుతున్న మద్దతు వ్యవస్థలను మనం స్వీకరించడానికి, అమలులో ఎదురవుతున్న సవాళ్లు, అడ్డంకులను ఎలా అధిగమించాలో తెలుసుకోవడానికి ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రవాసికార్మికులకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయి సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ ప్రవాసి విభాగం అధికారి చిట్టిబాబు హాజరుకావడం పట్ల మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా భారతదేశ సభ్యులు పి. నారాయణ స్వామి, మంద భీంరెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు