మా వినతుల సంగతి ఏమైంది?

23 Aug, 2019 06:39 IST|Sakshi
సైండ్ల రాజిరెడ్డి, గల్ఫ్‌ బాధితుడు

ఆర్టీఐ కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గల్ఫ్‌ బాధితుల దరఖాస్తు

మోర్తాడ్‌: సౌదీ అరేబియాలోని కంపెనీ వంచనతో ఇంటికి చేరిన తెలంగాణ కార్మికులు పునరావాసం కోసం కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి  పేషీలో వినతి పత్రం సమర్పించారు. అయితే, దానిపై స్పందన కనిపించకపోవడంతో సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలను కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి దరఖాస్తు చేశారు. పునరావాసం కల్పించాలని సీఎం పేషీని ఆశ్రయించిన గల్ఫ్‌ బాధితులు.. తమ వినతుల సంగతి ఎంత వరకు వచ్చిందనే అంశంపై సమాచార చట్టం ద్వారా తెలుసుకోవాలనే ప్రయత్నం చేయడం ఇదే ప్రథమం అని పలువురు వెల్లడిస్తున్నారు. సౌదీ అరేబియాలోని ప్రముఖ నిర్మాణ సంస్థ జేఅండ్‌పీ కంపెనీలో పనిచేయడానికి కొన్నేళ్ల క్రితం నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్‌ జిల్లాల నుంచి అనేక మంది కార్మికులు వలస వెళ్లారు. కొంతకాలం బాగానే నడిచిన కంపెనీ.. ఆర్థిక కారణాలను చూపుతూ కార్మికుల వేతనాలను నిలిపివేసింది.

అంతేకాకుండా యాజమాన్యం కార్మికులకు పని కల్పించకుండా క్యాంపులకే పరిమితం చేసింది. అలాగే, అకామా (గుర్తింపు కార్డు) రెన్యూవల్‌ చేయకపోవడంతో కార్మికులు మరో కంపెనీలో పని వెతుక్కునే వీలు లేకుండా పోయింది. దాదాపు ఆరు నెలల పాటు కార్మికులను జేఅండ్‌పీ కంపెనీ తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. కార్మికులు తాము పడుతున్న ఇబ్బందులను సౌదీ అరేబియాలోని లేబర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రియాద్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయంలో కంపెనీ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. సౌదీ లేబర్‌ కోర్టు, మన విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు స్పందించి కార్మికులను క్యాంపుల నుంచి వారి స్వస్థలాలకు పంపించారు. జూన్‌ లో కొందరు, జూలైలో మరికొందరు కార్మికులు వారి స్వగ్రామాలకు చేరుకున్నారు. తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు 102 మంది ఉన్నారు. కంపెనీ మోసం చేయడంతో తిరిగి వచ్చిన తమకు ప్రభుత్వం పునరావాసం చూపించాలని వేడుకున్నారు. జూలై 16న జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట్‌కు చెందిన సైండ్ల రాజిరెడ్డి సౌదీ నుంచి వాపసు వచ్చిన కార్మికుల తరపున సీఎం పేషీలో పునరావాసం కోసం దరఖాస్తు అందించారు. అయితే, దీనిపై స్పందన కనిపించకపోవడంతో ఈనెల 14న సమాచార చట్టం కింద తమ వినతి పత్రం సంగతి ఎంత వరకు వచ్చిందో తెలపాలంటూ దరఖాస్తు అందించారు.  

సమాచార చట్టం ద్వారానైనా న్యాయం జరుగుతుందని..
సమాచార చట్టం ద్వారానైనా గల్ఫ్‌ బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. మేము ప్రభుత్వానికి పునరావాసం కోసం విన్నవించాం. కానీ, స్పందన లేదు. సమాచార చట్టాన్ని వినియోగించి ప్రభుత్వ స్పందనను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.– సైండ్ల రాజిరెడ్డి, గల్ఫ్‌ బాధితుడు

మరిన్ని వార్తలు