మాకు దిక్కెవరు..!

13 Dec, 2019 12:43 IST|Sakshi
ఏవోజీఎం కంపెనీ క్యాంపులో కట్టెల పొయ్యిపై వంట చేసుకుంటున్న కార్మికులు

షార్జాలో తెలంగాణ కార్మికుల ఆక్రందన

వేతనాలు చెల్లించని కంపెనీ యజమాని

క్యాంపు భవనానికి విద్యుత్, నీటి సరఫరా బంద్‌

తిరిగి వచ్చేందుకు డబ్బులు లేక అవస్థలు

పాస్‌పోర్టులు సైతం యజమాని వద్దనే..

మోర్తాడ్‌(నిజామాబాద్‌ జిల్లా): యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లోని షార్జాలో భవన నిర్మాణ రంగానికి చెందిన ఏఓజీఎం కంపెనీ యజమాని కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆ కంపెనీ నిర్వహణ లోపం కార్మికుల పాలిట శాపంగా మారింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ల నుంచి షార్జాలో భవన, ఇతర నిర్మాణాల కాంట్రాక్టులను నిర్వహిస్తున్నాడు. అతని వద్ద నిజామాబాద్, నిర్మల్‌ జిల్లాలకు చెందిన 14 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరితో పాటు మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన ఇద్దరు, చెన్నైకి చెందిన మరో కార్మికుడు పనిచేస్తున్నాడు. కార్మికులకు  యజమాని ఆరు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదు. ఒక్కొక్కరికి రూ.1.80 లక్షల వరకు  చెల్లించాల్సి ఉంది. సాధారణంగా గల్ఫ్‌ దేశాల్లో పనిచేసే కార్మికులకు కంపెనీ నిర్వాహకులు ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలి. కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులు మంజూరైనా.. కాకపోయినా కార్మికులకు మాత్రం వేతనాలను సక్రమంగా చెల్లించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉంది. అయితే, ఆ కంపెనీ యజమాని ఇదేమీ పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు తమకు రావాల్సిన వేతనాల కోసం సమ్మె కొనసాగిస్తున్నారు.

లేబర్‌ కోర్టుకు..
వేతన బకాయిల కోసం కార్మికులు షార్జాలోని లేబర్‌ కోర్టును ఆశ్రయించగా కోర్టు.. కంపెనీ యజమానికి నోటీసులు జారీచేసింది. అక్కడే ఉంటే తాను జైలుపాలు కావాల్సి వస్తుందని గ్రహించిన కంపెనీ యజమాని తన స్వస్థలమైన కేరళకు వెళ్లిపోయాడు. కార్మికులు మాత్రం క్యాంపులోనే ఉండిపోయారు.

షార్జాలోని క్యాంపులో కార్మికులతో మాట్లాడుతున్నగుండెల్లి నర్సింహ
విద్యుత్, గ్యాస్, నీటిసరఫరా నిలిపివేత..
క్యాంపులో ఉంటున్న కార్మికులు దుర్భర జీవనం గడుపుతున్నారు. కంపెనీ యజమాని క్యాంపు కోసం తీసుకున్న భవనానికి అద్దె చెల్లించడానికి ఇచ్చిన చెక్కులతో పాటు గ్యాస్, విద్యుత్, నీటి బిల్లుల కోసం ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అయ్యాయి. కార్మికులను సైట్‌ వద్దకు తీసుకెళ్లే బస్సులకు, సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీనర్‌ నిర్వాహకులకు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్‌ అయ్యాయి. దీంతో క్యాంపు కొనసాగుతున్న భవనానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గ్యాస్, ఫిల్టర్‌ నీటి సరఫరా సైతం నిలిచిపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లోనే ఉంటున్నారు.  గ్యాస్‌ సరఫరా లేకపోవడంతో కట్టెల పొయ్యిలపై వంట చేసుకుంటున్నారు. ఫిల్టర్‌ నీటి సరఫరా లేక పోవడంతో ఉప్పు నీటిని తాగాల్సి వస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఇండియా కాన్సులేట్‌లో ఫిర్యాదు..
 కంపెనీ యజమాని నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్న కార్మికులకు అండగా నిలిచిన గల్ఫ్‌ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు నర్సింహ ఇండియా కాన్సులేట్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో విదేశాంగ శాఖ అధికారులు కేసును నమోదు చేశారు. కార్మికులకు వేతనాలు అందకపోవడంతో వారి వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. దీంతో ఎన్‌ఆర్‌ఐ సెల్‌ ద్వారా విమాన టిక్కెట్లు ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి నుంచి టికెట్లు అందకపోతే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ద్వారా టిక్కెట్‌లను ఇప్పించడానికి కృషిచేస్తామని జీడబ్ల్యూపీసీ అధ్యక్షుడు నర్సింహ ‘సాక్షి’కి వివరించారు.

కార్మికులకు అండగా జీడబ్ల్యూపీసీ..
షార్జాలో అవస్థలు పడుతున్న కార్మికులకు గల్ఫ్‌ కార్మికుల రక్షణ సమితి(జీడబ్ల్యూపీసీ) అండగా నిలిచింది. ఆరు నెలలుగా వేతనాలు అందక.. క్యాంపులో సరైన సౌకర్యాలు లేక తిప్పలు పడుతున్న కార్మికులను గల్ఫ్‌ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నర్సింహ షార్జాలో కలుసుకున్నారు. కంపెనీ యజమాని కేరళకు వెళ్లిపోవడంతో కార్మికుల పాస్‌పోర్టులు అతని వద్దనే ఉండిపోయాయి. అయితే నర్సింహ.. కంపెనీ యజమానితో ఫోన్‌లో మాట్లాడి పాస్‌పోర్టులు కార్మికులకు వాపసు చేయాలని సూచించారు. కంపెనీ క్యాంపులో మొత్తం 17 మంది కార్మికులు ఉండిపోగా అందులో ఇద్దరికి వీసాలను రెన్యూవల్‌ చేయలేదు. దీనికి సంబంధించి జరిమానా చెల్లించి కార్మికులను ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మిగిలిన కార్మికులకు వారి పాస్‌పోర్టులను ఇప్పించి సొంతూళ్లకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు.

వేతన బకాయిలు ఇప్పించండి  
మాకు ఆరు నెలల వేతనం అందాల్సి ఉంది. కంపెనీపై లేబర్‌ కోర్టులో కేసు వేశాం. ఎలాగైనా వేతన బకాయిలు ఇప్పించాలి. ఆరు నెలల వేతనం యజమాని వద్దనే ఉండిపోవడంతో మాకు ఇబ్బందిగా ఉంది. విదే శాంగ శాఖ చొరవ తీసుకుని వేతనం ఇప్పించాలి. కంపెనీ యజమాని కేరళకు వెళ్లిపోవడంతో మమ్మల్ని పట్టించుకునే వారు లేరు.– ముత్తెన్న, ఇస్సాపల్లి, నిజామాబాద్‌ జిల్లా

ఎంతో ఇబ్బంది పడుతున్నాం..
క్యాంపులో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా నిలిచిపోవడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నాం. నరకంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండదేమో. కంపెనీ యజమాని మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. మేము మాత్రం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్ని ఎలాగైనా ఇంటికి పంపించడానికి ఏర్పాట్లు చేయాలి.     – లస్మన్న, గొల్లమడ, నిర్మల్‌ జిల్లా  

ఇంటికి రావడానికిడబ్బులు లేవు..
ఆరు నెలల నుంచి వేతనం ఇవ్వకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఇంటికి రావడానికి ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వమే దయ ఉంచి విమాన టిక్కెట్లు ఇవ్వాలి. కనీసం ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి వెళ్లడానికి కూడా డబ్బులు లేవు. మా పరిస్థితి  దయనీయంగా ఉంది.  – విఠల్, గొల్లమడ,నిర్మల్‌ జిల్లా

మానవతా దృక్పథంతో ఆదుకోవాలి  
షార్జాలోని కంపెనీ క్యాం పులో ఉన్న మమ్మల్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. కంపెనీ యజమాని ఏమీ చెప్పకుండా కేరళకు వెళ్లిపోయాడు. మేము మాత్రం అనాథల్లా కంపెనీ క్యాంపులోనే ఉండిపోయాం. మాకు దేవుడే దిక్కు. మా పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. మమ్మల్ని ఇంటికి పంపించడానికి చర్యలు తీసుకోవాలి.– ఎల్లేష్, గుండారం, కామారెడ్డి జిల్లా
 
ఏం చేయాలో అర్థం కావడం లేదు
కొన్ని రోజుల నుంచి క్యాంపుకే పరిమితమైన మాకు ఏమిచేయాలో అర్థం కావడం లేదు. మా పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. వేతనాలు లేవు. క్యాంపులో కనీస సౌకర్యాలు లేవు. రోజురోజుకు పరిస్థితి దిగజారిపోతోంది. కంపెనీ యజమాని కేరళ నుంచి షార్జాకు వస్తాడనే నమ్మకం లేదు.– సంపంగి మహేష్, అమతాపూర్, డిచ్‌పల్లి  

మమ్మల్ని ఇంటికి చేర్పించండి  
షార్జా నుంచి మమ్మల్ని ఎలాగైనా ఇంటికి చేర్పించండి. మా పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. కనీసం మా పాస్‌పోర్టులు కూడా ఇవ్వలేదు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మాట్లాడితే పాస్‌పోర్టులు పంపిస్తానని చెబుతున్నాడు. పాస్‌పోర్టులతో పాటు టిక్కెట్‌లను ఇప్పిస్తేనే ఇంటికి చేరుకోగలుగుతాం.– జోగు ఊషన్న,జీజీ నడ్కుడ, నిజామాబాద్‌ జిల్లా

మరిన్ని వార్తలు