అలరించిన కాలిఫోర్నియాలోని ‘రంగస్థలం’ కార్యక్రమం

13 Aug, 2019 19:59 IST|Sakshi

కాలిఫోర్నియా : తత్వా(తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ ట్రైవ్యాలీ) ఆధ్వర్యంలో ‘రంగస్థలం’ కార్యక్రమం ఆగష‍్టు 3న కాలిఫోర్నియాలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ఈవెంట్‌లో జాతిపిత మహత్మగాంధీ 150వ జన్మదిన వేడుకలు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముందుగా సంగీత సాధన వారి ‘కూనపులి’, ‘ఓ బాపూ’, ‘జననీ’ గీతాల బృంద గానలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం లయన్స్‌ డాన్స్‌ స్కూల్‌ వారి ‘వందేమాతరం’ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నటరాజ స్కూల్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు చేసిన ‘సుబ్రహ్మణ్య కౌతువం’ నాట‍్యం అందరిని అలరించింది.

కాగా కళాతపస్వి విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలోని ఆణిముత్యాల్లాంటి పాటలను అభినయించి ప్రేక్షకులను మంత్రముగ్థులను చేశారు. తరువాత వైద్యామా? పైత్యామా? ‘ఆమ్రఫల ప్రహసనం’ నాటికలు అందర్నీ కడుపుబ్బ నవ్వించాయి. ఇంటింటి రామాయణం, జానపద నృత్యాలు ప్రేక్షకులను సాయంకాలం ఉత్సాహంగా గడిపేందుకు తోడ్పాడ్డాయి. కాలిఫోర్నియా బాలబాలికలకు వివిధ పాఠశాలల ద్వారా భారతీయ కళలను, తెలుగు భాషను బోధిస్తున్న గురువులకు తత్వ వారు ‘గురువందనం’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని అందించారు. అనంతరం రుచికరమైన విందు భోజనాన్ని అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ జ్ఞాపికలు అందజేశారు. చివరగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రదర్శకులకు, అతిథులకు వాలంటీర్లకు, స్పాన్సర్లకు ‘తత్వా’ ఆధ్వర్యం ధన్యవాదాలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు