చికాగోలో 'రావాలి జగన్‌ కావాలి జగన్‌'

22 Jan, 2019 18:27 IST|Sakshi

చికాగో : ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 341 రోజుల పాటు ప్రజాసంకల్పయాత్ర చేసిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా, వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం చికాగో ఆధ్వర్యంలో జగన్‌ అన్నకు తోడుగా.. రావాలి జగన్‌ కావాలి జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ 3648కిలోమీటర్ల దూరం నడిచి ఓ చరిత్రను సృష్టించారని ఎన్‌ఆర్‌ఐలు అన్నారు. చికాగో దగ్గర్లోని విస్కిన్‌సన్‌, డెట్రాయిట్‌, ఇండియానా నుంచి ఎన్‌ఆర్‌ఐలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి సుపరిపాలనను ఎన్‌ఆర్‌ఐలు గుర్తు చేసుకున్నారు. పేదరిక నిర్మూలన కోసం వైఎస్సార్‌ అనుసరించిన విధానాలు తర్వాతి ప్రభుత్వాలు కూడా అనుసరిస్తూ వస్తున్నాయని కొనియాడారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర అనే మహోన్నత అధ్యాయం ముగిసిందని, పేదలకు తమకంటూ ఓ నాయకుడు ఉన్నాడన్న నమ్మకం కలిగించిందని తెలిపారు. త్వరలోనే కష్టాలన్నీ పరిష్కారమవుతాయనే భరోసా వచ్చిందని పేర్కొన్నారు.  వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, గట్టు శ్రీకాంత్‌ రెడ్డి, బొత్ససత్యనారాయణ, నజీం అహ్మద్‌, పద్మజా రెడ్డిలు వీడియో కాన్ఫరెన్స్‌ కాల్‌ ద్వారా ఎన్‌ఆర్‌ఐలను ఉద్దేశించి మాట్లాడారు.

'ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తాము ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ప్రజలు వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలను జన్మభూమి కమిటీలు ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయో, ప్రభుత్వ పథకాలు తమకు చేరడం లేదని, ప్రజలు వైస్‌ జగన్‌కు విన్నవించుకున్నారు. తమ పాలనలో పథకాలు అందరికి చేరుతున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లు తమ అనుకూల మీడియాలో ఊదరగొడుతున్నారు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరు. రాజన్న రాజ్యం తిరిగి రావాలంటే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం కావాలని అందరూ ఎదురు చూస్తున్నారు' అని ఎన్‌ఆర్‌ఐలు పేర్కొన్నారు.

మిడ్‌ వెస్ట్‌ వైఎస్సార్‌సీపీ ఇంచార్జీ ఆర్‌వీ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. చికాగో ఎన్‌ఆర్‌ఐ వైఎస్సార్‌సీపీ కోర్‌ ఆర్గనైజర్లు కేకే రెడ్డి, రామ్‌భూపాల్‌ రెడ్డి కందుల, శరత్‌ యెట్టపు, పరమేశ్వర్‌ యెరసాని, రమాకాంత్‌ జొన్నలలు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో తమవంతు సహాయసహకారాలు అందించారు.

మరిన్ని వార్తలు