అట్లాంటాలో మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం

21 Mar, 2018 23:16 IST|Sakshi

తనికెళ్ల భరణితో పాటు పలువురి ప్రముఖుల హాజరు

అట్లాంటా : అమెరికాలోని గాంధీ ఫౌండేషన్‌, తెలుగు సంఘాల ఆధ్వర్యంలో 2018 మార్చి 17న (శనివారం) సాయంత్రం అట్లాంటాలోని కింగ్‌ సెంటర్ ఆవరణలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మీట్&గ్రీట్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ తెలుగుచలనచిత్ర, రంగస్థల నటుడు తనికెళ్ళ భరణి, ఆకాశవాణి దూరదర్శన్ వ్యాఖ్యాత  పోణంగి బాలభాస్కర్‌ పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

ఇండియా ట్రిబ్యూన్‌ పత్రిక ఎడిటర్‌ రవి పోణంగి అతిధులను పరిచయం చేశారు. అనంతరం శిల్ప, మహాత్మాగాంధీకి ఇష్టమైన వైష్ణవ జనతో, రఘుపతి రాఘవ రాజారామ్‌ గీతాలను ఆలపించారు. గాంధీ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆంథోనీ థాలియా తమ సంస్థ కార్యకలాపాలను వివరించారు. గాంధీ విగ్రహం ప్రతిష్టించి 20 సంవత్సరాలైందనీ, ప్రతీ ఏటా వివిధ దేశాలకు చెందిన దాదాపు మిలియన్‌కు పైగా ప్రజలు ఈ విగ్రహాన్నిసందర్శిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా తనికెళ్ళ భరణి మాట్లాడుతూ  అహింసను వజ్రాయుధంగా చేసుకుని ఉద్యమాలు చేసిన ఇద్దరు మహాపురుషుల స్మారక కేంద్రాన్ని సందర్శించి నివాళులు అర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. 

పోణంగి బాల భాస్కర్‌ మాట్లాడుతూ మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని డాక్టర్‌ మార్టీన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ అమెరికాలో నల్లజాతీయుల విముక్తి కోసం పోరాడి విజయం సాధించడం నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. అనంతరం మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సమీపంలో ఉన్న గాంధీ మ్యూజియం, కింగ్‌ జన్మించిన గృహం,  కింగ్‌ పనిచేసిన ప్రార్ధనామందిరం (చర్చి), కింగ్‌ సెంటర్లను సందర్శించారు.

మరిన్ని వార్తలు