ఘనంగా టాంటెక్స్‌ సంక్రాంతి సంబరాలు

7 Feb, 2018 22:01 IST|Sakshi

డాలస్‌ఫోర్ట్‌ వర్త్‌: అమెరికాలోని సాహిత్య, సంగీత సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేసి, ఆధునికతను మేళవించి తెలుగు మనసులను రంజింపచేశారు. సాంస్కృతిక బృంద  సమన్వయ కర్త పద్మశ్రీ తోట ఆధ్వర్యంలో, శీలం కృష్ణవేణి అధ్యక్షతన డాలస్‌లో జనవరి 27న స్థానిక మార్తోమా చర్చి ఆడిటోరియంలో టాంటెక్స్‌ సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి.

ప్రార్థనా గీతంతో ప్రారంభమైన కార్యక్రమాలు, సంస్కృతి సంప్రదాయాల మేళవింపుగా చాలా ఆసక్తికరంగా సాగాయి. కూచిపూడి నృత్యాలు, ‘దైర్యే సాహసే లక్ష్మి’ అనే నృత్యరూపకం పలువురిని ఆకట్టుకున్నాయి. సినిమా పాటలకు పిల్లలు చేసిన డ్యాన్స్‌లు హుషారును నింపాయి. వినూత్నంగా ‘అమ్మ’ పాటలతో సాగిన నృత్య రూపకం అందరిని ఎంతగానో అలరించింది.

ఈ కార్యక్రమంలో టాంటెక్స్‌ నూతన అధ్యక్షులు శీలం కృష్ణవేణి మాట్లాడుతూ..  ఈ సంక్రాంతి పర్యదినాన నూతన ఉత్సాహంతో తెలుగు భాషకు, ప్రజలకు సేవ చేయడమే పరమార్దం అని అన్నారు. నిస్వార్ద కళా సేవకులు, నిర్విరామ శ్రామికులు తన కార్యవర్గ సభ్యుల అండదండలతో ఉత్తర అమెరికా తెలుగు ప్రజలకు తన శాయశక్తులా సహాయ పడతానని ఆమె అన్నారు. అంతేకాక 32 సంవత్సరాల చరిత్ర ఉన్న టాంటెక్స్‌ లాంటి విశిష్ట సంస్థకు అధ్యక్ష పదవి  చేపట్టినందుకు సర్వదా కృతజ్ఞురాలునని, టాంటెక్స్‌ సంస్థ తెలుగు వారందరికి మరింత చేరువయ్యేలా చేసి, తెలుగు జాతి మొత్తం గర్వపడేలా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

ఉప్పలపాటి కృష్ణారెడ్డికి శాలువా కప్పి పుష్ప గుచ్చాలతో టాంటెక్స్‌ అధ్యక్షులు శీలం కృష్ణవేణి, కార్యవర్గ, పాలకమండలి సభ్యులు ఘనంగా సత్కరించారు. 2017 సంవత్సరంలో  పోషక దాతలను కృష్ణారెడ్డి ఉప్పలపాటి, శీలం కృష్ణవేణి, మిగతా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక జ్ఞాపికలతో సన్మానించారు. కొత్తగా ఎన్నికైన సంస్థ కార్యనిర్వహక సభ్యులు కోడూరు కృష్ణారెడ్డి, పాలేటి లక్ష్మి, బండారు సతీష్‌,  చంద్ర పోలీస్‌, బొమ్మ వెంకటేష్‌, యెనికపాటి జనార్ధన్‌లను, పాలక మండలి సభ్యులు నీలపరెడ్డి మధుసూదన్‌ రెడ్డి, మందాడి ఇందు రెడ్డి, నెల్లుట్ల పవన్‌ రాజ్‌, అర్రెబోలు దేవేందర్‌ రెడ్డిలను సాదరంగా కమిటీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి రజిత విచ్చేశారు. నటి తన హాస్యోక్తులతో, చిరు నాటకతో ప్రేక్షకులను అలరించారు. అతిథి రజితకు సంస్థ కార్యవర్గ సభ్యులు శాలువ కప్పి, జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమానికి సహాకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ గీతం ఆలపించడంతో, విచ్చేసిన వారందరినీ ఎంతో ఆహ్లాదపరచిన, శోభాయమానంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు తెరపడింది.

మరిన్ని వార్తలు