లండన్​లో ఘనంగా పీవీ శత జయంతి ఉత్సవాలు

30 Jun, 2020 17:20 IST|Sakshi

లండన్​: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ఎన్నారై ఫోరమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జయప్రకాశ్ నారాయణ్, పీవీ తనయ వాణి దేవి, లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ, పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల పాల్గొని ప్రసంగించారు. జయప్రకాశ్ నారాయణ్ మాట్లాడుతూ పీవీని చైనా సంస్కరణలకు ఆద్యుడు డెంగ్ జియావోపింగ్​తో పోల్చారు. భారతదేశం పీవీ తెచ్చిన ఆర్థిక సంస్కరణలతో గాడిలో పడిందన్నారు. ‘ఆనాటి నుండి నేటి వరకు అందరూ పీవీ విధానాలనే అనుసరిస్తున్నారు. పంజాబ్ లో శాంతి నెలకొల్పడంలో ఆయన సఫలం అయ్యారు. కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించడంలో చాలా వరకు సఫలం అయ్యారనే చెప్పుకోవొచ్చు. ఇంకో 15 ఏళ్లు పీవీ ప్రధానిగా ఉండి ఉంటే ప్రగతి చైనాను అధిగమించేవాళ్లం’ అని అన్నారు.

పీవీ తనయ వాణి దేవి మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు కూతురిని కావడం నాకు గర్వంగా ఉంది. ఆయన స్థిత ప్రజ్ఞుడు. ఎలాంటి సందర్భాల్లోనూ కోపం తెచ్చుకోని వ్యక్తి. సమయపాలన, క్రమశిక్షణ ఆయన విజయానికి మెట్లు. బాల్యం నుంచే ఆయన ఏకసంతాగ్రాహి అని మా నానమ్మ చెబుతుండేవారు. రెండున్నర ఏళ్లకే కఠిన పద్యాలను కంఠస్తం చేశారు. అందరూ ఆయన్ను మృదు స్వభావి అనుకుంటారు కానీ మహారాష్ట్రలో తుపాకుల శిక్షణనిచ్చారు. పీవీ రచనలు, ఆయన అందుకున్న బహుమతులు, ఆయనకు ఇష్టమైన వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేశామని చెప్పారు.

‘పీవీతో మా నాన్న మంచి అనుబంధం ఉంది. 2016లో ఇండియాకు వచ్చినప్పుడు హైదరాబాద్​లోని పీవీ జ్ఞానభూమిని సందర్శించాను. ప్రపంచ రాజకీయ నాయకులకు ఆయన మార్గదర్శి. బ్రిటన్​లో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా’ అని ఎంపీ వీరేంద్ర శర్మ తెలిపారు. మహేశ్ బిగాల మాట్లాడుతూ తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు ప్రోత్సాహంతో 51 దేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలను జరుపుతున్నట్లు తెలిపారు. సంవత్సరం పొడవునా పీవీ జయంతి కార్యక్రమాలను నిర్వహించాలని టీఈఎన్​ఎఫ్ ప్రెసిడెంట్ గంప వేణుగోపాల్ ప్రతిపాదించగా, పాల్గొన్న అన్ని సంఘాలు స్వాగతించాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షుడు  సుమన్ రావు, యుక్త సంస్థ తరఫున కిల్లి సత్యప్రసాద్, మహేశ్ జమ్ముల, అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, దుబాయ్, బహ్రయిన్ తదితర దేశాలకు చెందిన 130 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శత జయంతి సందర్భంగా టేన్ఫ్​ అధ్యక్షుడు ప్రమోద్​ గౌడ్ అధ్యక్షతన జరిగిన మరో కార్యక్రమంలో సంస్థ కార్యవర్గంతో పాటు టీడీఎఫ్ ప్రతినిధులు కమలాకర్ రావు, శ్రవణ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ జాగృతి ప్రతినిధులు సుమన్ రావు, కిషోర్ మునగాల, సంతోష్ ఆకుల, కిల్లి ప్రసాద్, యుక్త, రాములు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జీపీఐ ఆధ్వర్యంలో జరిగిన ఇంకో కార్యక్రమంలో ఉదయ్ నాగరాజు, వైరాజిస్టు బాల శ్రీనివాస్​, లండన్ కార్పొరేటర్ ప్రభాకర్ ఖాజా, ఉదయ్, రెహానా, మోహన్ మద్ది, విజన్ తెలంగాణకు చెందిన శ్రీధర్ గౌడ్, నాట్స్​కు చెందిన గంగసాని రాజేశ్వర్ రెడ్డి పాల్గొని విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు