డాలర్‌ డ్రీమ్స్‌పై మరో పిడుగు

22 May, 2018 01:06 IST|Sakshi

‘ఈఏడీ’ రద్దు చేస్తామనిఅంటున్న ట్రంప్‌ సర్కార్‌ 

అమెరికాలో వేలాది మంది భారతీయుల్లో అలజడి 

తాత్కాలిక ఉద్యోగానికి వీలు కల్పిస్తున్న ఈఏడీ 

రద్దు చేస్తే దేశం వీడడమే అంటున్న ఐటీ నిపుణులు.. వివాదాస్పద నిర్ణయాలతో తగ్గుతున్న వలసలు 

అమెరికా వెళ్లేందుకు ఐఐటీయన్లు, చైనీయుల అనాసక్తి

(కంచర్ల యాదగిరిరెడ్డి, కాలిఫోర్నియా నుంచి) 
ఎందాక ఈ నడక 
ఈ అడుగు సాగినందాక 
ఎన్నాళ్లు సాగుతుందీ అడుగు? 
ఎదురుగా లోయలో నిలిచే దాక 
ఏమంటుంది ఆ లోయ? 
ఈడ్చుకుంటుంది అగాధం దాక.  
ఏమౌతుంది ఆ పైన? 
ఇది ప్రశ్నగా మిగిలిన ప్రశ్న 

అమెరికాలో ఆరున్నర సంవత్సరాలుగా ఫేస్‌బుక్‌లో ఐటీ నిపుణుడిగా ఉద్యోగం చేస్తున్న కస్తూరి రంగనాథ్‌ భావోద్వేగం ఇది! తమ జీవితాలు ఇప్పుడు డాక్టర్‌ సినారె ‘విశ్వంభర’ను గుర్తుకు తెస్తున్నాయంటూ ఆవేదన చెందారు. ఇది ఒక్క రంగనాథ్‌ బాధే కాదు.. అమెరికా వచ్చి ఏళ్లుగా కొలువులు చేసుకుంటున్న వేలాది మంది భారతీయుల వ్యథ! వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ఇలాంటి వారందరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు ఆయన కన్ను ఈఏడీ (ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌)పై పడింది. అమెరికా పౌరసత్వం, ఇమిగ్రేషన్‌ సేవల విభాగం(యూఎస్‌సీఐఎస్‌) జారీ చేసే ఈ ఈఏడీతో ఇక్కడ తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. హెచ్‌1 బీ వీసా కలిగి ఉండి, గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసి దాని ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల భార్యలు/భర్తలు ఈఏడీ కింద తాత్కాలిక ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ ఈఏడీ విధానాన్ని రద్దు చేస్తామని ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించడంతో ఇలాంటి వారందరిలో కలవరం మొదలైంది. అమెరికా సిలికాన్‌ వ్యాలీలోని శాన్‌ జోస్‌ ఫేస్‌బుక్‌ కార్యాలయాన్ని సందర్శించిన ‘సాక్షి’ప్రతినిధితో రంగనాథ్‌ తన గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘నేను, నా భార్య ఏడాదికి 50 వేల డాలర్లు (రూ.33.50 లక్షలు) అమెరికా ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లిస్తాం. ఇప్పుడు ఈఏడీ విధానం కింద నా భార్య ఉద్యోగం చేయడానికి వీల్లేదంటూ ట్రంప్‌ సర్కార్‌ చట్టం తేబోతోంది. అదే జరిగితే నేను పక్కన ఉన్న కెనడాకు వెళ్లి ఉద్యోగం చేసుకుంటా’’అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే టాప్‌ టెన్‌ విశ్వవిద్యాలయాలలో ఒకటైన బర్కిలీలోని యూనివర్సిటీ అఫ్‌ కాలిఫోర్నియాలో పీజీ పూర్తి చేసి క్యాంపస్‌ నియామకాలలో ఆపిల్‌ కంపెనీలో చేరిన అశ్విన్‌ రాచమల్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ‘‘ఇక్కడ పని చేస్తున్నందుకు లక్షల్లో పన్నులు చెల్లిస్తున్నాం. అయినా మేమేదో దొంగతనం చేస్తున్నామన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఈఏడీపై మరో కంపెనీలో నా భార్య ఉద్యోగం చేస్తుంది. ఐఐటీ గ్రాడ్యుయేట్‌ అయిన ఆమె ఇప్పుడు ఉద్యోగం చేయటానికి వీల్లేదని నిర్ణయం చేస్తే మరుక్షణం ఈ దేశాన్ని వదిలేస్తా. ఈఏడీ మాకు ఎంత ముఖ్యమో ఇక్కడి ఐటీ కంపెనీలకు అంతే ముఖ్యం’’అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సిలికాన్‌ వ్యాలీలో పని చేస్తున్న భారతీయ ఐటీ నిపుణుల్లో దాదాపు 5 నుంచి 6 శాతం మంది యూరప్‌ దేశాలకు తరలిపోయారు. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1.ప్రముఖ కంపెనీలు ముందు జాగ్రత్తగా తమ ఆఫీసులు కొన్నింటిని ఇక్కడ్నుంచి తరలించడం, 2. ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (ఈఏడీ) రద్దు ప్రతిపాదన. 

తగ్గుతున్న నిపుణుల రాక 
ట్రంప్‌ వలస విధానాల కారణంగా భారత్, చైనా నుంచి వచ్చే నిపుణుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా భారత్‌ నుంచి వచ్చే ఐఐటీ గ్రాడ్యుయేట్ల సంఖ్య మరీ తగ్గింది. 2012–13లో ఫేస్‌బుక్‌ 275 మందిని, 2013–14లో 325, 2014–15లో 436 మందిని రూ.కోటి అంతకంటే ఎక్కువ మొత్తంలో ఆఫర్లు ఇచ్చి నియమించుకుంది. ఆపిల్‌ కూడా అదే స్థాయిలో ఐఐటీయన్లను ఆకర్షించింది. అయితే గడచిన రెండున్నర సంవత్సరాలలో ఐఐటీయన్లు అమెరికా రావడమే మానేశారు. ఉన్నత విద్య కోసం వచ్చేవారి సంఖ్య కూడా బాగా తగ్గింది. ‘‘ఐఐటీయన్లు భారత్‌ లోనే స్టార్టప్‌ కంపెనీలు స్థాపించడం, ఇతరత్రా కార్పొరేట్‌ రంగాలలో మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. మా కంపెనీలో పని చేస్తున్న కొందరు ఉద్యోగాలకు రాజీనామా చేసి భారత్‌ తిరిగి వెళ్లారు’’అని ఆపిల్‌ (ఆర్‌అండ్‌డీ) చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జెఫ్‌ విలియమ్స్‌ చెప్పారు. ఇక్కడి ఐటీ కంపెనీల్లో సీనియర్‌ స్థాయుల్లో చైనా, భారతీయులే ఉంటారు. గడచిన మూడేళ్లుగా చైనా నుంచి వచ్చే ఐటీ నిపుణుల సంఖ్య 70 శాతానికి తగ్గింది. చైనాలో ప్రసిద్ధిగాంచిన పేకింగ్‌ విశ్వవిద్యాలయం, చైనా యూనివర్సిటీ అఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, హర్బిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్‌ టెక్నాలజీ నుంచి కంప్యూటర్‌ నిపుణులు అమెరికా రావడం తగ్గిపోయింది. వాళ్లంతా ఇప్పుడు ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు వెడుతున్నారని శాన్‌ జోస్‌ కేంద్రంగా పని చేస్తున్న సైబర్‌ జెన్‌ టెక్నాలజీస్‌ కన్సల్టెన్సీ డైరెక్టర్‌ జేమ్స్‌ పేర్కొన్నారు. 

ఎక్కడ చూసినా ఉద్యోగ ఖాళీలే 
ఒక ఐటీ ఉద్యోగాలే కాదు అమెరికాలోని ఆపిల్, ఫేసుబుక్, పేపాల్‌ సహా అనేక కంపెనీల హెడ్‌ క్వార్టర్స్‌ కేంద్రమైన శాన్‌ జోస్‌ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. అయితే సరిపడ ఉద్యోగులు దొరకడం లేదు. ‘‘మేం గంటకు 15 డాలర్లు ఇస్తాం. ఒక్క కాలిఫోర్నియాలో మాకు 5 వేల మంది ఉద్యోగులు కావాలి. కానీ దొరకడం లేదు. ఈఏడీ ఉన్న కొందరితో పని చేయించుకుంటున్నాం. ఇప్పుడు దానిని రద్దు చేస్తే మాకు ఇబ్బందులు తప్పవు’’అని వాల్‌ మార్ట్‌ కాలిఫోర్నియా హెచ్‌ఆర్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ రిచర్డ్‌ సన్‌ చెప్పారు. శాన్‌ జోశ్‌ సిటీలో ‘సాక్షి’ప్రతినిధికి చిన్న పెద్ద వాణిజ్య కూడళ్ల వద్ద ‘ఉద్యోగులు కావాలి’అన్న బోర్డులే కనిపించాయి.  

75 శాతం మంది ఐటీ నిపుణులే 
ఈఏడీ ద్వారా ఉద్యోగం చేసుకుంటున్న వారిలో 75 శాతం మంది ఐటీ నిపుణులే. వీరిలోనూ 65 శాతం మంది సిలికాన్‌ వ్యాలీ ఐటీ కంపెనీల్లో పని చేస్తున్నారు. అందువల్లే ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్‌ వంటి అగ్రశ్రేణి సంస్థలు ఈఏడీ రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ విధానాన్ని రద్దు చేస్తే మొదటికే మోసం వస్తుందని ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయినా ట్రంప్‌ ప్రభుత్వం దీన్ని రద్దు చేసేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు. ‘‘కాలిఫోర్నియా నిబంధనల ప్రకారం మాకు వచ్చే వేతనంలో 34 శాతం పన్నులకే పోతోంది. మరి ఇలాంటప్పుడు భార్య, భర్త పని చేయకుండా ఎలా నెట్టుకురాగలం? ఒకవేళ ఈఏడీ రద్దు చేస్తే మేమెందుకు ఉండాలి? మా కష్టంలో సగం పన్నులకే ఎందుకు చెల్లించాలి’’అని గూగుల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బ్రహ్మరెడ్డి ప్రశ్నించారు. ఫేస్‌బుక్, ఆపిల్‌ కంపెనీల్లోనే దాదాపు 24 వేల మంది ఈఏడీతో పని చేస్తున్నారు. ‘‘నా భర్త ఐఐటీ గ్రాడ్యుయేట్‌. ఆయనకు ఫేస్‌బుక్‌లో ఉద్యోగం వస్తే ఆయనతో పాటు వచ్చి ఈఏడీపై ఇన్ఫోసిస్‌లో నేను పని చేస్తున్నా. ఇప్పుడు దీన్ని రద్దు చేస్తే నేను ఖాళీగా ఇంట్లో ఉండాలా. ఒకవేళ అదే జరిగితే నేను నా భర్త స్వదేశానికి తిరిగిపోతాం’’అని పిన్నపరెడ్డి ప్రసూన అన్నారు. ‘‘ఇప్పటికే ఇక్కడ ఐటీ కంపెనీల్లో వేలాది ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అర్హులైన వారు దొరకడం లేదు. ఫలితంగా అనేక ప్రాజెక్టులు కోల్పోవాల్సి వస్తుంది’’అని టీసీఎస్‌ ఉత్తర అమెరికా మానవ వనరుల విభాగం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆపరేషన్స్‌ మురళీ శర్మ ఇటీవల అమెరికా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడి విశ్వవిద్యాలయాలలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అమెరికన్లకు భారతీయ ఐటీ కంపెనీలు ప్రత్యేకంగా 2 సంవత్సరాల నుంచి క్యాంపస్‌ నియామకాలు చేపడుతున్నాయి. ఇలా ఉద్యోగాలలో చేరిన వారిలో 50 శాతంకు పైగా శిక్షణ కాలంలోనే మానేస్తున్నారని ఇన్ఫోసిస్‌ ఉత్తర అమెరికా మానవ వనరుల విభాగం సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ సురేష్‌ పెద్దిబొట్ల తెలిపారు.  

మరిన్ని వార్తలు