కువైట్‌లో ఇద్దరు భారతీయులకు తప్పిన మరణశిక్ష

27 Jun, 2013 06:46 IST|Sakshi

దుబాయి: కువైట్‌లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష తప్పింది. శిక్ష అమలుకు మరో 48 గంటలు మాత్రమే గడువుండగా, బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించడంతో వారు శిక్ష నుంచి తప్పించుకోగలిగారు. వీరి శిక్షను తప్పించేందుకు భారత రాయబార కార్యాలయం గణనీయమైన కషి చేసింది. చెన్నైకి చెందిన సురేశ్ షణ్ముగసుందరం, కాళిదాస్ చెల్లయ్యన్‌లతో పాటు మరో శ్రీలంక మహిళ 2008లో ఒక హత్య కేసులో అరెస్టయ్యారు. శ్రీలంకకు చెందిన మరో మహిళను హత్య చేశారనే ఆరోపణపై వీరు విచారణను ఎదుర్కొన్నారు.

వీరిని దోషులుగా తేలుస్తూ 2009 మార్చి 3న కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును అప్పీళ్ల కోర్టులో సవాలు చేయగా, అప్పీళ్ల కోర్టు కూడా 2009 ఏప్రిల్ 14న దిగువ కోర్టు ఇచ్చిన తీర్పునే ఖరారు చేసింది. వారికి ఏప్రిల్ 18న మరణశిక్ష అమలు చేయనున్నట్లు తెలియడంతో కువైట్‌లోని భారత దౌత్య కార్యాలయం జోక్యం చేసుకుంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కువైట్ న్యాయశాఖ, ఇస్లాం వ్యవహారాల శాఖ మంత్రులకు విజ్ఞప్తి చేసింది. దీంతో వారి శిక్ష వాయిదా పడింది. ఈ ఏడాది జూన్ 16న వారికి శిక్ష అమలు కావాల్సి ఉండగా, అందుకు కేవలం 48 గంటలకు ముందే మృతురాలి కుటుంబానికి పరిహారం చెల్లించడంతో వారికి మరణశిక్ష రద్దయిందని అధికార వర్గాలు చెప్పాయి.
 

మరిన్ని వార్తలు