యూఏఈలో వలసదారులకు తీపికబురు

31 May, 2019 10:38 IST|Sakshi

శాశ్వత నివాసం కోసం గోల్డ్‌కార్డులు

గల్ఫ్‌ డెస్క్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఆశించిన విదేశీ వలసదారులకు అక్కడి ప్రభుత్వం తీపికబురు అందించింది. యూ ఏఈ నిబంధనల ప్రకారం ఆ దేశానికి వలస వచ్చేవారు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు. ఉద్యోగం, వ్యాపారం, మరే రంగంలోనైనా స్థిరపడిన వారికి మూడేళ్లు, ఐదేళ్లు, పదేళ్ల వీసా మాత్రమే అక్కడి ప్రభుత్వం జారీచేస్తుంది. అయితే ఇంజీనీర్లు, డాక్టర్లు వంటి ప్రొఫెషనల్స్‌కు, బడా పారిశ్రామికవేత్తలకు యూఏఈలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఆ దేశపు రాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మఖ్తుమ్‌ గోల్డ్‌ కార్డుల విధానం ప్రవేశపెట్టారు. 

అమెరికాలో విదేశీ వలసదారులకు అక్కడి ప్రభుత్వం గ్రీన్‌కార్డులను జారీచేస్తుంది. గ్రీన్‌కార్డును దక్కించుకుంటే అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు యూఏఈలో గోల్డ్‌కార్డును పొందితే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వీలు ఉంది. ఇప్పటి వరకు యూఏఈలో శాశ్వత నివాసాన్ని విదేశీ వలసదారులకు వర్తింపజేయలేదు. గోల్డ్‌కార్డుల విధానం అమలు కావడం ఇదే తొలిసారి. యూఏఈలో వ్యాపారం, ఇతర రంగాల్లో ఉద్యోగం చేస్తున్నవారిలో కేరళకు చెందిన వారిది పైచేయిగా ఉంది. కేరళ తరువాత ఎక్కువ మంది వలసదారులు తెలంగాణ జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. యూఏఈలో వ్యాపారం నిర్వహిస్తున్నవారితో పాటు వివిధ రంగాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వారు తెలంగాణ జిల్లాలకు చెందిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే, వీరంతా కాలపరిమితి వీసాలను పొంది పనులు చేసుకుంటున్నారు. యూఏఈ ప్రభుత్వం తొలి సారి ప్రవేశపెట్టిన గోల్డ్‌కార్డులకు అర్హత సాధించేవారు తక్కువ మందే ఉంటారని అక్కడ ఉపాధి పొందుతున్న పలువురు తెలంగాణవాసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు