డల్లాస్‌లో మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళి

3 Sep, 2018 11:22 IST|Sakshi

డల్లాస్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా డల్లాస్‌లో పార్టీ శ్రేణులు ఘననివాళులు అర్పించాయి. ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్సీపీ కమిటీ సభ్యులు, వైఎస్సార్ ఫౌండేషన్ సంయుక్తంగా రెడ్ క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక ఎలెమెంట్స్ హోటల్ లో జరిగిన రక్తదాన శిబిరానికి వైఎస్సార్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్బంగా రెడ్ క్రాస్ ప్రతినిధులు మాట్లాడుతూ ఒక నాయకుడుకి నివాళిగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలు నిర్వహించటం చాలా గొప్ప విషయమన్నారు. రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు దీనిని ఆదర్శంగా తీసుకొని పేదలకి సహాయపడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న డాక్టర్ బూచిపూడి రామిరెడ్డి మాట్లాడుతూ .. వైఎస్సార్ అంటేనే సేవకి అర్థమని, అభిమానులు కూడా అదేబాటలో నడుస్తూ ప్రతి సంవత్సరం వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయటం చాలా గొప్పవిషయమని తెలిపారు. కార్యక్రమంలో దాదాపుగా 150 మంది వరకూ రక్తదానం చేశారని వారందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వైఎస్సార్ ఫౌండేషన్, డల్లాస్ వైఎస్సార్సీపీ కమిటీకి వైఎస్సార్ అభిమానులకి, రెడ్ క్రాస్ సంస్థకి డాక్టర్ బూచిపూడి రామిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వాలెంటీర్లుగా పనిచేసిన స్కూల్ విద్యార్ధులకి నిర్వాహకులు సర్టిఫికెట్లు అందజేశారు.

మరిన్ని వార్తలు