‘వీసా’ మోసం!

26 Jul, 2013 17:17 IST|Sakshi

వివిధ దేశాలకు వెళ్లాలనే ఉద్దేశంతో పలుమార్లు వీసా కోసం ప్రయత్నించి విఫలమైన ఇద్దరు ఘనులు.. ఈ సందర్భంగా వీసా ప్రాసెసింగ్‌లో తాము సంపాదించిన అనుభవాన్ని అడ్డదారిలో ఉపయోగిస్తూ పోలీసులకు చిక్కిన ఉదంతమిది. వీరిద్దర్నీ హైదరాబాద్ తూర్పుమండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వీరి మోసాన్ని అదనపు డీసీపీ బి.లింబారెడ్డి మీడియాకు వివరించారు. వీసా కన్సల్టెన్సీ పేరుతో ఓ బోగస్ సంస్థను ఏర్పాటు చేయడంద్వారా వీసాకు అవసరమైన పత్రాలను నకిలీవి తయారుచేసి ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు. వీరిని సంప్రదిస్తున్న అభ్యర్థులు నకిలీ పత్రాల సాయంతో అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల కాన్సులేట్స్‌కు వీసా ఇంటర్వ్యూలకు వెళ్తున్నారని వివరించారు.

 

నిందితుల నుంచి భారీగా బోగస్ స్టాంపులు, పత్రాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్ తిలక్‌నగర్‌కు చెందిన ప్రదీప్ డానియల్ గూడూరి పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. గతంలో నాలుగైదుసార్లు అమెరికా వెళ్లేందుకు వీసాకోసం ప్రయత్నించినా సఫలీకృతుడు కాలేదు. అయితే వీసా ప్రాసెసింగ్ విధానంపై మాత్రం పట్టు వచ్చింది. దీంతో నగరంలోని శివం చౌరస్తాలో ‘డాలర్స్ అండ్ పౌండ్స్ వీసా కన్సల్టెన్సీ’ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. మరోవైపు జవహర్‌నగర్‌కు చెందిన కర్నికోటి మాథ్యూసన్ వృత్తిరీత్యా కంప్యూటర్ ఆపరేటర్. అతను కూడా గతంలో నాలుగుసార్లు అమెరికా, మరో నాలుగుసార్లు కెనడా, ఒకసారి ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీసాలకోసం యత్నించి భంగపడ్డాడు. దీంతో ప్రదీప్‌తో చేతులు కలిపి అతడి సంస్థలోనే కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరాడు.

 

వీరిద్దరూ విద్యా వీసాపై అమెరికా, లండన్, కెనడా దేశాలకు వెళ్లాలని భావించే విద్యార్థులకు బోగస్ పత్రాలు తయారు చేసివ్వడం ప్రారంభించారు. ప్రాసెసింగ్‌కోసం ఒక్కో అభ్యర్థి నుంచి అడ్వాన్సుగా రూ.10 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేస్తున్నారు. ప్రాసెసింగ్ పూర్తయి వీసా వస్తే భారీ మొత్తం చెల్లించేలా ఒప్పందం చేసుకుంటున్నారు. దరఖాస్తుకు అవసరమైన బోగస్ ధ్రువీకరణ పత్రాలను వీరే తయారుచేసి ఇస్తున్నారు. కొన్ని నమూనా అసలు పత్రాలను స్కాన్ చేసి.. వాటికి కొన్ని మార్పుచేర్పులు చేయడం ద్వారా బోగస్‌వి తయారు చేస్తున్నారు.

 

వాటిని అవసరమైన వారికి విక్రయించేస్తున్నారు. ఒక్కో పత్రం రూపొందించినందుకు మాథ్యూసన్‌కు ప్రదీప్ రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు చెల్లించేవాడు. వీరి వ్యవహారాలపై సమాచారమందుకున్న తూర్పుమండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీకాంత్ నేతృత్వంలో ఎస్సై ఎ.సుధాకర్, ఎస్.శంకర్‌రెడ్డిలతో కూడిన బృందం గురువారం దాడి చేసి ఇద్దరినీ అరెస్టు చేశారు. వీరి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ అధికారుల పేరుతో ఉన్న 30 బోగస్ రబ్బర్ స్టాంపులు, నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును అంబర్‌పేట పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు