ప్రపంచ దేవాంగ, చేనేత సమావేశం విజయవంతం

4 Sep, 2019 22:15 IST|Sakshi

నేపర్‌విల్లే(చికాగో) : డానా యుఎస్ఎ, ఇండో అమెరికన్ ఫిలాంత్రొపక్ సొసైటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా చికాగోలోని నేపర్‌విల్లేలో నిర్వహించిన ప్రపంచ దేవాంగ, చేనేత సమావేశం సెప్టెంబర్‌ 1న  విజయవంతంగా ముగిసింది. యుఎస్‌ఏ, భారతదేశం నుంచి పలువురు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై సభను జయప్రదం చేశారు. నేపర్‌విల్లేలోని రాయల్ ప్యాలెస్ బాంక్వెట్ హాల్‌లో ఈ సమావేశం జరిగింది. యూఎస్‌ఏ కాంగ్రెస్‌మెన్‌ బిల్ ఫోస్టర్, ఉమాస్‌ ఐఎన్‌సీ అధినేత సంతోష్ కుమార్ జీ, డానా వ్యవస్థాపక చైర్మన్ వెంకటేశ్వరరావులు జ్యోతి ప్రజ్వనలతో ఈ సమావేశాన్ని ప్రారంభించారు.  

కాంగ్రెస్‌మెన్‌ బిల్ ఫోస్టర్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిని కాపాడటంతో పాటు పేద ప్రజలకు సాయం అందిస్తున్న ప్రవాస భారతీయులను అభినందించారు. తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవడానికి మహిళలు పురుషులతో సమానంగా సాధికారికతను సాధించడానికి వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని గ్రామీణ జీవితాన్ని మెరుగుపర్చడానికి ప్రవాస భారతీయులు తమ వంతు కృషి చేయాలని సంతోష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పుట్టిన గడ్డ అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. 

భారతదేశం నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసిన చింతా శంకర్‌ మూర్తి.. ఏపీకి చెందిన రుద్రాక్షల సత్యనారాయణ ఆధ్వర్యంలో నలుగురు కార్మికులు రాత్రింబవళ్లు కష్టించి  నేసిన మువ్వన్నెల జాతీయ జెండాను ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ జెండాను ఎటువంటి అతుకులు లేకుండా కేవలం చేతితోనే నేయడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. ఇక కార్యక్రమం చివర్లో బిల్ ఫోస్టర్, మిశ్రా, సంతోష్ కుమార్ జీ,  చింతా శంకర్‌ మూర్తిలను డానా చైర్మన్‌ బాచువెంకటేశ్వరరావు సత్కరించారు.

మరిన్ని వార్తలు