ఉపాధి కోసం వెళ్లి...

2 Jun, 2018 12:53 IST|Sakshi
మహేష్‌ (ఫైల్‌) అయితంశెట్టి పరమేశ్‌ (ఫైల్‌)

అబుదాబీలో గుండెపోటుతో మడకపాలెం యువకుడి  మృతి

బెంగళూరులో రైలు ఢీకొని వీరనారాయణం యువకుడి దుర్మరణం

శోక సంద్రంలో కుటుంబాలు  

పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలకు ఆశాదీపాలుగా ఉన్న ఇద్దరు యువకుల ఆయువు అంతలోనే తీరిపోయింది. ఉన్న ఊరును, కన్నవారిని వదిలి  వేరే ప్రాంతాలకు వెళ్లిన వారిని  మృత్యువు కాటేసింది.దీంతో ఆ కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఉపాధి కోసం అబుదాబీకి వెళ్లిన మునగపాక మండలం మడకపాలెం యువకుడు అక్కడ గుండెపోటుతో మృతి చెందగా, మాడుగుల మండలం వీరనారాయణంకు చెందిన మరో యువకుడిని రైలు రూపంలో మృత్యువు కబళించింది.

మునగపాక(యలమంచిలి):   ఆర్థిక ఇబ్బందుల నుంచి కుటుంబాన్ని గట్టెక్కించాలని భావించాడు.  ఇక్కడే ఉంటే ఆ స్థాయిలో సంపాదించలేనని అనుకున్నాడు. సంసాదన కోసం దేశం కాని దేశం వెళ్లాడు.  కష్టాలు తీరుతాయని ఆశిస్తున్న సమయంలో గుండెపోటుకు గురై ఓ యువకుడు మృతి చెందడంతో కుటుంబం వీధినపడాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మడకపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి నూకరాజు,నరసమ్మ దంపతులకు ఇద్దరు సంతానం, కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తెకు  వివాహం జరిగింది.   పేదరికంలో ఉన్న కుటుంబానికి చేయూత ఇచ్చేందుకు  కుమారుడు మహేష్‌(25) గాజువాక ఏజెంట్‌ ద్వారా  ఐదేళ్ల క్రితం అబుదాబీ వెళ్లాడు.

అక్కడ రెండేళ్లపాటు  వెల్డర్‌గా పనిచేసి, ఇంటికి వచ్చేశాడు. ఏడాదిపాటు గ్రామంలో ఉంటూ తల్లిదండ్రులకు చేయూతగా ఉండేవాడు. 22 నెలల క్రితం మళ్లీ అబుదాబీ వెళ్లాడు.  కుటుంబమంతా సంతోషంగా ఉన్న తరుణంలో వారికి పిడుగులాంటి వార్త అందింది. మహేష్‌ గురువారం రాత్రి విధులు ముగించుకుని   ఇంటికి వెళ్లి, నిద్రించే క్రమంలో 11 గంటల సమయంలో గుండెపోటుకు గురై   మృతిచెందాడు.  స్నేహితులు మహేష్‌ తల్లితండ్రులకు శుక్రవారం తెల్లవారు 2 గంటలకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మహేష్‌ కుటుంబ సభ్యులు భోరున విలపించారు. కుటుంబానికి అండగా నిలిచిన మహేష్‌   మృతిచెందడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

రైలు ఢీకొని ..
మాడుగులరూరల్‌: కుటుంబానికి అండగా ఉండేందుకు పనికోసం  వేరే రాష్ట్రానికి వెళ్లిన ఓ యువకుడు రైలు ఢీకొని దుర్మరణం చెందాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  మండలంలో వీరనారాయణం గ్రామానికి చెందిన అయితంశెట్టి పరమేశ్‌(20) ఐటీఐ పూర్తిచేసి, ఉపాధి కోసం గత నెల 28న బెంగళూరు వెళ్లాడు. అక్కడ ప్రైవేటుగా రాడ్‌ బెండింగ్‌ పనులు చేస్తున్నాడు. పరమేశ్‌తో పాటు మరో పది మంది యువకులు ఈ పని చేయడానికి వెళ్లారు. 

పరమేశ్‌ పనిచేసే స్థలానికి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌ మీదకు గురువారం ఉదయం  బహిర్భూమికి వెళ్లాడు. అకస్మాత్తుగా  రైలు వచ్చి పరమేశ్‌ను ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని ట్రాక్‌పైకి వెళ్లడంతో  రైలు వచ్చిన శబ్దం వినిపించలేదు. తోటి యువకులు   కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పరమేశ్‌ మృతదేహానికి బెంగళూరులో పోస్టుమార్టం నిర్వహించి, అంబులెన్స్‌ లో శుక్రవారం స్వగ్రామానికి తీసుకొచ్చారు. వీరనారాయణంలో అంత్యక్రియలు నిర్వహించారు. పరమేశ్‌ తండ్రి భీమునాయుడు గతంలో హత్యకు గురయ్యాడు.  పరమేశ్‌ మృతి చెందడంతో తల్లీసోదరుడు భోరున విలపించారు.  గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

>
మరిన్ని వార్తలు