కాలిఫోర్నియాలో వైఎస్సార్‌కు ఘన నివాళి

9 Sep, 2019 22:00 IST|Sakshi
కాలిఫోర్నియాలోని బే ఏరియాలో వైఎస్‌ఆర్‌ వర్ధంతి వేడుకలు 

కాలిఫోర్నియా: మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి  పదో వర్ధంతి(సెప్టెంబర్‌ 2) సందర్భంగా యూఎస్‌ఏ వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ కమిటీ అధ్వర్యంలో అభిమానులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు  ఘన నివాళులు అర్పించారు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో సెప్టెంబర్‌ 2, సోమవారం రోజున బ్లూ ఫాక్స్‌ బంకెట్‌ హాల్‌లో అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ అధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించి, మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బే ఏరియా ప్రముఖులు డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి, వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ కన్వీనర్‌ మధులిక, యూఎస్‌ఏ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ కేవీ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పేద ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం వైఎస్సార్‌ ఎంత పరితపించేవారో వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం సీఎం వైఎస్‌ జగన్‌కు అందరు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ కన్వీనర్ మధులిక మాట్లాడుతూ వైఎస్సార్‌ అనే మూడు అక్షరాలు పేదప్రజల గుండెచప్పుడుగా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటాయన్నారు. ప్రస్తుతం జగనన్న రూపంలో రాజన్న రాజ్యం తిరిగి వచ్చిందన్నారు. యూఎస్‌ఏ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ కేవీ రెడ్డి మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్‌ మరణించి 10 ఏళ్లు అయినప్పటికీ ప్రజల హృదయాలలో  ఆయనకున్న స్థానం చూస్తే ఆయన అభిమానిగా చాలా సంతోషంగా ఉందన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూడటంతో.. ఆ ఆలోచనల నుంచి వచ్చిన పథకాలే ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్‌, రూ. 2కే కిలో బియ్యం, 108, 104, ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటు అని కొనియాడారు.

వైఎస్సార్‌ హయాంలో ప్రతి కుటుంబం ఏదో విధంగా లబ్ధిపొందిందన్నారు. వినాయకచవితి పండుగ రోజున అన్ని కార్యక్రమాలను పక్కనపెట్టి ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చారంటే వైఎస్సార్‌ మీద ఉన్న ఎనలేని అభిమానాన్ని చాటుతుందన్నారు. ఇంకా అనేక మంది వక్తలు మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సువర్ణయుగం గురించి, మహిళా సాధికారత కోసం ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కమిటీ ముఖ్య సభ్యులు నాగార్జున, ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ ఫార్మాసిస్ట్‌ మధు వంగ, నీలిమ వంగ, సురేంద్ర అబ్బవరం, గోపిరెడ్డి, కిరణ్ కూచిబొట్ల, సుబ్రహ్మణ్యం రెడ్డివారి, ప్రవీణ్ మునుకూరు, హరి శీలం, నరసింహ బయనబోయిన, రవీంద్రరెడ్డి, గురు, మరికొంతమంది వైఎస్సార్‌ అభిమానులు అమెరికన్ రెడ్ క్రాస్ అధ్వర్యంలో రక్తదానం చేశారు. కార్యక్రమంలో వందకు పైగా కుటుంబాలు, వైఎస్సార్‌ అభిమానులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు