వాషింగ్టన్‌ డి.సిలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

10 Jul, 2020 21:23 IST|Sakshi

వాషింగ్టన్ డి సి (వర్జీనియా): దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా అమెరికాలో వాషింగ్టన్ డి సి మెట్రో వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం జులై 8వ తేదీ సాయంత్రం (ఇండియా కాలమానము - గురువారం ఉదయం) ఘనంగా నివాళులు అర్పించారు. వాషింగ్టన్ డి సి రీజినల్ ఇన్ ఛార్జ్  శశాంక్ రెడ్డి, సత్య పాటిల్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు సమక్షంలో సామాజిక దూరం పాటిస్తూ  జయంతిని  జరుపుకున్నారు. ఈ సందర్భంగా  తమకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. (మదిలో మహానేత)

వైఎస్సార్‌ సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు మాట్లాడుతూ, ‘ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ ప‌థకాల‌ను ప్ర‌వేశపెట్టి వాటి ఫ‌లాల‌ను ప్ర‌తి పేద‌వాడికి అందించిన గొప్ప వ్య‌క్తి రాజశేఖర రెడ్డి. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఆరాధ్య దైవం, చెదరిపోని గుండె బలం, నాయకత్వానికి నిలువెత్తు రూపం, మేరునగ ధీరుడు మన వైఎస్ రాజశేఖరుడు. ఎందరికో అసాధ్యమయిన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయ యవనికపై తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. మాట తప్పని..మడమ తిప్పని రాజకీయ నేత దివంగత ముఖ్యమంత్రి, మహానేత  వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి.  రైతు సంక్షేమం కోసం రుణమాఫీ, పావలా వడ్డీ, పశుక్రాంతి, జలయజ్ఞం, ఉచిత విద్యుత్‌ వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రజలంతా బాగుండాలి. ప్రజల బాగోగులు చూసుకోవాలి అని  నిరంతరం తపించిన వ్యక్తి ఆయన. అదే ఆలోచనలతో, భావనలతో అనేక పథకాలు రూపొందించి, అమలు చేసి  తాను మరణించే వరకు రైతు సంక్షేమ పథకాలను కొనసాగించి ప్రజలందరి మన్ననలు చూరగొన్న మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి’ అని కొనియాడారు.  (రైతు దినోత్సవం)

వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్  శశాంక్ రెడ్డి మాట్లాడుతూ, సమున్నత వ్యక్తిత్వం, చెరగని చిరునవ్వు, చెదరని దృఢనిశ్చయం, పదహారణాల తెలుగుదనం కలబోసి విరబూసిన విలక్షణ వ్యక్తిత్వమే ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. వామనుడి మూడు పాదాలంత విస్తృత వ్యక్తిత్వానికి వైయస్ఆర్ అనే మూడంటే మూడు పొడి అక్షరాలు కొండను అద్దంలో కొంచెంగా చూపించే ప్రతీకలు. ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. పోయారు. కానీ దేశ రాజకీయ పటంపై హిమశిఖర సదృశంగా సమున్నతమైన వ్యక్తిగా భాసిల్లిన మహా వ్యక్తిత్వం వైయస్ఆర్‌ది’ అని ప్రశంసించారు. (తెలంగాణలో ఘనంగా వైఎస్‌ జయంతి వేడుకలు)

రఘునాథ రెడ్డి మాట్లాడుతూ, ‘మహానేత జయంతి రోజున ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసి ముఖ్య మంత్రికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లా నుంచే న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుడుతున్నట్లు  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారని తెలిపారు. ప్రతి ఊరు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్‌మోహన్‌ రెడ్డి అని అన్నారు.  కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు చూడకుండా అందరికి మంచి చేయాలని ముందుకు వెళ్తున్నట్లు  తెలిపారు.  రైతుల సంక్షేమం కోసం నవరత్న పథకాల్లో ఎంతో ప్రాధాన్యతనిచ్చారని కొనియాడారు. 

వినీత్ లోక వైఎస్సార్‌ను స్మ‌రించుకుంటూ, ఆయ‌న మ‌ర‌ణం లేని మ‌హానేత‌ అని అన్నారు.  ఆరోగ్య శ్రీ, 104, 108 సేవ‌లు, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, రైతుల‌కు ఉచిత విద్యుత్‌, జ‌ల‌య‌జ్ఞం.. ఇలా ఎన్నో ప‌థ‌కాల రూపంలో ఆయ‌న ఎప్ప‌టికీ చిరంజీవే..అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు,  వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్  శశాంక్ రెడ్డి, నాటా నాయకులు సత్య పాటిల్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకులు ఎల్‌వి కిరణ్, రఘునాథ్ రెడ్డి, వినీత్ లోక, నరేన్ ఒద్దులా, మదన గళ్ళ, అర్జున్ కామిశెట్టి, వినయ్ మాదాసు లతో పాటు పలువురు ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు      
 
 

మరిన్ని వార్తలు