వాషింగ్టన్ డీసీలో ‘యాత్ర​‍’ జైత్రయాత్ర

9 Feb, 2019 12:19 IST|Sakshi

సాక్షి, వాషింగ్టన్ డీసీ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా దేశ విదేశాల్లోని థియేటర్లు వైఎస్సార్‌ అభిమానులతో కోలాహలంగా మారాయి. వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాల్లో (మేరీల్యాండ్, డెలావేర్, వర్జీనియా) యాత్ర ప్రీమియర్‌ షోల సందర్భంగా దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 'యాత్ర' చిత్ర యూనిట్‌కి వైఎస్సార్‌ అభిమానులు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్‌ అభిమానులు యాత్ర రిలీజ్‌ను పండగలా జరుపుకున్నారు.

వైఎస్సార్‌ జీవితంలో మహోజ్వల ఘట్టంగా నిలిచిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా ప్రజల హృదయాలను హత్తుకునేలా ఉందని వైఎస్సార్‌సీపీ సలహాదారు (యూఎస్‌ఏ), రీజనల్ ఇంఛార్జ్‌(మిడ్ అట్లాంటిక్) వల్లూరు రమేష్ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ పాత్రకు మమ్ముట్టి జీవం పోసి అత్యంత అద్భుతంగా నటించారని, బాడీ లాంగ్వేజ్‌ వైఎస్సార్‌ని తలపించిందని, చివరికి డబ్బింగ్‌ కూడా పర్ఫెక్ట్‌గా చెప్పారన్నారు. వర్జీనియాలోని సినేమార్క్ థియేటర్‌లో వైఎస్సార్‌ అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో కలిసి సతీసమేతంగా యాత్ర సినిమా చూస్తున్నంతసేపు గుండె బరువెక్కిందని, భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరూ 'యాత్ర' లో పాల్గొనాల్సిందేనని తెలిపారు. పలు సందర్భాలలో మహానేత రాజశేఖర రెడ్డి తమతో ఉన్నట్లుగా ఈ చిత్రం తమను కదిలించిందని పేర్కొన్నారు. ఈ యాత్రలో వాస్తవిక సంఘటనలున్నాయన్నారు. పంటలకు గిట్టుబాటు ధర దొరక్క ఓ రైతు చేసే ఆత్మహత్యాయత్నం, పేదరికంతో వైద్యం చేయించలేక ఓ కన్నతల్లి తన బిడ్డను కోల్పోవడం, పై చదువులు చదవాలని ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో అల్లాడే ఓ విద్యార్థి వేదనవంటివి దర్శకుడు మహి వి. రాఘవ్‌ చూపించిన తీరు వైఎస్సార్‌కి ఇచ్చిన నివాళి అనడం సబబేమో అని కొనియాడారు.

యాత్ర సినిమాని చుసిన తరువాత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిని తలచుకుని పలువురు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెలిబుచ్చారు. వైఎస్‌ రాజశేఖరెడ్డి పాత్రను (రాజన్నను) కళ్లకు కట్టినట్టుగా చూపించారని కృష్ణ రెడ్డి చాగంటి, భువనేశ్ భుజాల, రామ్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాధవీ గత స్మృతులను గుర్తుచేసుకుంటూ నిజ జీవితంలో మాట ఇస్తే వెనక్కి తగ్గని వైఎస్‌ వ్యక్తిత్వాన్ని కళ్లకు కట్టినట్టుగా వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం ‘యాత్ర’ అని సపోర్టింగ్‌ యాక్టర్స్‌ అందరూ తమ వంతు బాధ్యతలు చక్కగా నిర్వర్తించారని అన్నారు. లక్ష్మి, గీత మాట్లాడుతూ... రాజన్న రాజసం చక్కగా సినిమాలో చూపించారని ప్రశంసించారు. మ‌హానేత పాద‌యాత్ర నాయ‌కుడికి.. ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య దూరాన్ని చెరిపేసిందని, రాష్ట్ర స్థితిగ‌తుల‌ను మార్చి ఎంద‌రికో మార్గదర్శకమైందని అందుకే ఆయ‌న‌ను ప్రేమించని హృద‌యం ఉండ‌దంటే అతిశ‌యోక్తి కాదని సత్తిరాజు సోమేశ్వర రావు అన్నారు.

సమాజం మళ్లీ ఒక్కసారి వైఎస్‌ స్మృతులను నెమరు వేసుకోవడం చాలా అందమైన అనుభవమని ప్రవాసులు అన్నారు. సహజత్వానికి దూరం పోకుండా నిజాయతీగా తీసిన సినిమా ‘యాత్ర’. తక్కువ పదాల్లో ఎక్కువ చెప్పిన మహీ ప్రయోగం బాగుందని తెలిపారు. ఎంత ఖర్చయినా పర్వాలేదు ఓ మహా యోధుడిని సమాజానికి చూపించాలనే ఆకాంక్ష నిర్మాతలు విజయ్, శశి దేవిరెడ్డి, శివ మేకలది. ఈ కార్యక్రమంలో వల్లూరు రమేష్‌ రెడ్డి, మాధవి రెడ్డి, సోమిరెడ్డి, క్రిష్ణా రెడ్డి, గీత రెడ్డి, రామ్ రెడ్డి, లక్ష్మి రెడ్డి, కోటి రెడ్డి, సంతోష్ రెడ్డి, రాజశేఖర్ కాసారానేని, భువనేశ్ భుజాల, రాజశేఖర్ బసవరాజు, సత్తిరాజు సోమేశ్వర రావు అనేక మంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు