వాషింగ్టన్‌లో వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం

5 Nov, 2019 20:10 IST|Sakshi

వాషింగ్టన్‌ డీసీ : వియన్నా, వర్జీనియా, అమెరికాలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు, తెలుగు సంఘాల నాయకులు, అభిమానులు అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో మీట్‌ & గ్రీట్‌(ఆత్మీయ సమ్మేళనం) కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నవంబర్‌ 4(సోమవారం)న జరిగిన ఈ ఈవెంట్‌లో ఏలూరు వైఎస్సార్‌సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్‌తో పాటు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి(ఉత్తర అమెరికా) రత్నాకర్‌ పండుగాయల హాజరయ్యారు. హోటల్‌ బాంబే తందూర్‌ రెస్టారెంట్‌లో నిర్వహించిన ఈ సభలో 200 మందికి పైగా పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని స్మరిస్తూ రమేష్‌ రెడ్డి వ్యాఖ్యాతగా అతిథులను సభకు పరిచయం చేశారు. అనంతరం అభిమానులు నాయకులు పుష్పగుచ్చాలతో, శాలువాలతో అతిథులను సత్కరించారు. అనంతరం రత్నాకర్‌ పండుగాయల ప్రసంగిస్తూ దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయాలను, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన పథకాలను కొనియాడుతూ, ప్రస్తుత ప్రభుత్వ తీరు తెన్నులను ప్రశంసించారు.

'రాష్ట్ర ప్రభుత్వం తరపున నార్త్‌ అమెరికాలో ప్రత్యేక ప్రతినిధిగా నాకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తాను. ఏపీ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను. అందుకు మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం' అని అన్నారు.  తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఏలూరు వైఎస్సార్‌సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ.. పెద్దాయన ఏర్పరిచిన ఆశయాల దారిలో నడుస్తున్న నేటి తరం యువనేత సీఎం జగన్‌కు సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. తరాలు మారినా రాజశేఖరుడి లాంటి గొప్ప రాజకీయవేత్త, పేదలపాలిటి పెన్నిధి మనకు కనిపించరని, కులమత ప్రాంతాలకు అతీతంగా ఆయన సామాన్యుడి మదిలో నిలిచిపోయారని ప్రస్తావించారు. అలాంటి మహనీయుని ఆశయాలకు వారసుడిగా ఆశయ సాధనలో ధీరుడిగా పాలన అందిస్తున్న వైఎస్‌ జగన్‌ తీరు గొప్పదని కొనియాడారు. ప్ర‌జా సంక్షేమ‌మే ఊపిరిగా ప్ర‌జ‌ల మ‌న‌స్సులో నిలిచిన నేత వైఎస్సార్‌ అని, దివంగ‌త మ‌హానేత అమ‌లు చేసిన ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల రూపంలో ఆయ‌న ఇప్ప‌టికీ మ‌నంద‌రి గుండెల్లో నిలిచి ఉన్నారని చెప్పారు. 

రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, తెలుగు ప్రజలు ఆయనను ఎప్పటికీ మరవరని పేర్కొన్నారు, రాజన్న సువర్ణ యుగం నాటి రాష్ట్రం, ప్రస్తుత పాలకుడు జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను పెంచి గౌరవంగా తల ఎత్తుకునే విధంగా చేయగల నాయకుడు జననేత వైఎస్‌ జగన్‌ ఒక్కరే అని వారు ధీమాగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గడచినా 5 నెలల్లో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అత్యంత అద్భుతమని అన్నారు. సీఎం జగన్‌ నాయకత్వంలో తెలుగు ప్రజలంతా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. పేదల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సమర్థవంతమైన నాయకుడిగా మంచి చేస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. 2019 అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకొని, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం చాలా ఆనంద దాయకమని వారు సంతోషం వ్యక్తం చేశారు. అతి తక్కువ వ్యవధిలోనే  ఈ సభకు హాజరై, సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. చివరగా బాంబే తందూర్ భోజనంతో రత్నాకర్ పండుగాయల, కోటగిరి శ్రీధర్ గారి మీట్ & గ్రీట్ (ఆత్మీయ సమ్మెళనం)కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.

మరిన్ని వార్తలు