హజ్ యాత్రికులకు సేవలందిస్తున్న జగన్‌ అభిమానులు

22 Aug, 2018 15:16 IST|Sakshi

మక్కా : ముస్లింల పవిత్ర హజ్‌యాత్ర ఆదివారం ప్రారంభమైంది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 లక్షలకుపైగా ముస్లింలు సౌదీ అరేబియాకు చేరుకున్నారు. హజ్ యాత్రికులందరూ ఆదివారమే మక్కాలో ప్రార్థనలు చేసి అక్కడి నుండి అరాఫత్‌కు బయలుదేరారు. సోమవారం అరాఫత్‌లో బసచేసి ప్రార్థనల అనంతరం మంగళవారం ఉదయం ఈదుల్ అజ్ హా నమాజు తర్వాత మీనాకు చేరుకున్నారు. మీనాలో ఏర్పాటు చేసిన క్యాంపుల్లో మూడు రోజులు బస చేసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. లక్షలాదిమంది ఒకే చోట చేరడంతో బస చేసే క్యాంపుల వద్ద జనప్రవాహ తాకిడికి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా సౌదీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. అదే విధంగా హజ్ యాత్రికులకు సేవ చేయాలనే ఉద్దేశంతో కొన్ని సంఘాలు తమవంతుగా యాత్రికులకు సేవలందిస్తున్నాయి. 

అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా ప్రవాసాంధ్రులు కూడా వాలంటీర్లుగా ఏర్పడి మీనాలో సేవ చేసేందుకు ముందుకొచ్చి, హాజ్ యాత్రికులకు సేవలందిస్తున్నారు. గతంలో ప్రజాసంకల్పయాత్ర సజావుగా సాగాలని మక్కాలో ప్రార్ధనలు చేసి, అక్కడి నుండి తెచ్చిన జమ్ జమ్ నీటిని, మసీదు జ్ఞాపికను వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని పాదయాత్రలో కలిసి అందజేసిన గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన షేక్ సలీం తన మిత్రబృందంతో కలిసి హాజ్ యాత్రికులకు సేవలందిస్తున్నారు. హజ్‌ యాత్రకు వచ్చిన తెలుగువారిని కలుస్తూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారికి షేక్ సలీం, అతని స్నేహితులు అందుబాటులో ఉంటున్నారు.

ఈ సందర్భంగా షేక్ సలీం మాట్లాడుతూ.. ఇస్లాం ఐదు మూలస్థంబాలలో ఐదవదైన  హజ్ యాత్ర చేయాడానికి వచ్చిన మన ప్రాంత ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రహదారులు మరిచిన వారికి తోడుగా ఉంటూ వారు బస చేసే క్యాంపునకు తీసుకువెళ్ళటం, అలసట బారిన పడిన వారికి మంచినీరు సదుపాయాలు సమకూర్చడం, నడవలేని వారికి వీల్ ఛైర్ తో వారి గమ్యస్థానలకు చేర్చి తమవంతుగా సహాయసహకారాలు అందిస్తున్నామన్నారు. హజ్ యాత్రలో అవలంబించాల్సిన పద్దతులు, అలవాట్లను యాత్రికులకు క్షుణ్ణంగా వివరించడంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సలీం మండిపడ్డారు. యాత్రలో కలిసిన గుంటూరు, కడప జిల్లాల వాసులు వారి ఆవేదనను తమతో పంచుకున్నారని తెలిపారు. రాష్ట్రం నుండి నేరుగా సౌదీకు చేరుకునే సదుపాయం కల్పించి ఉంటే హజ్‌ యాత్రికులకు కష్టాలు ఉండేవి కాదన్నారు. అలానే వరదలతో అస్తవ్యస్తమైన కేరళ ప్రజల కోసం ప్రార్ధించాలని హాజీలను కోరుతున్నామని సలీం తెలిపారు. నాలుగు రోజుల పాటు హాజ్ యాత్రికులకు సేవలందించేందుకు షేక్ సలీంతో పాటు, అబ్దుల్ హమీద్, షేక్ ఫరిద్, రఫీ, సయిద్, అలీమ్, మోయిన్, మోషిన్ తదితరులు అక్కడే ఉంటున్నారు.

మరిన్ని వార్తలు