మనోమాలిన్యాన్ని తొలగించే దీపాలు

19 Nov, 2014 00:45 IST|Sakshi
మనోమాలిన్యాన్ని తొలగించే దీపాలు

క్షణికానందం కలిగించి, క్షణకాలంలో చదివి పారేసే పుస్తకాలను పదేపదే ప్రచురించడానికి బదులుగా శాశ్వతానందం కలిగిస్తూ, కలకాలం భద్రపర్చుకునే గ్రంథాలను ప్రచురించేందుకు ప్రచురణకర్తలు ముందుకు రావాలి. పాఠకులు ఆదరించాలి. పుస్తకం హస్తభూషణం కాదు మస్తక భూషణం కావాలి. 47వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రధాన లక్ష్యం ఇదే!
 
 మానవ నాగరికత క్రమవికాసంలో పుస్తక పఠనం ప్రధానమైంది. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే నాలుగు కళల్లో అత్యంత ప్రధానమైంది పుస్తక పఠనం. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సం వత్సరం కొన్నివేల గ్రంథాలను ప్రచు రిస్తున్నారు. పుస్తకాల సంఖ్య గణనీ యంగా పెరిగినా, పాఠకుల సంఖ్య రోజురోజుకీ తరిగిపోతోంది. విజ్ఞానాన్ని పెంపొందిం చేవి, వినోద ఆహ్లాదాలను అందించేవి పుస్తకాలు. ‘ఇన్నో సెన్స్’ నుంచి ఇంటర్‌నెట్ వరకు సాధించిన ప్రగతి పుస్తక పఠనం వల్లనే.
 
 పుస్తక పఠనాసక్తితో విలువైన గ్రంథ పఠనంలో నిమ గ్నమైన వారిని ఒకప్పుడు పుస్తకాల పురుగులు అనేవారు. నేడు పుస్తకాలను తొలిచే పురుగులే కానీ, పుస్తక ప్రియులు లేకపోవటం దురదృష్టం. గ్రంథాలయాల్లోని విలువైన పుస్తకాలు శిథిలమవుతున్నాయి. కొన్ని విలువైన పుస్తకాలు గ్రంథాలయాల్లో ఊర్మిళమ్మల్లా నిద్రాణంగా ఉన్నాయి. యువతను రెచ్చగొట్టే రకరకాల టి.వి.చానళ్లు, వ్యాపార ధోరణులతో వెలువడుతున్న చౌకబారు పుస్తకాలు, సెక్స్ పత్రికలు, యువకులను విలువైన గ్రంథపఠనం నుంచి దూరం చేస్తున్నాయి.
 ప్రముఖ ఆంగ్ల రచయిత అలివర్ గోల్డ్‌స్మిత్ ఒక గొప్ప పుస్తకం చదివినప్పుడు ‘‘ఒక గొప్ప స్నేహితుడు దొరికినంత అనుభూతి కలుగుతుంది. దాన్ని మళ్లీ చదివి నప్పుడు చిరకాల మిత్రుని కలిసినంత ఆనందం కలుగు తుంది’’ అన్నారు.
 
 సుప్రసిద్ధ రచయిత మాక్సింగోర్కీ ‘‘పుస్తకాలు నా మనస్సుకు, హృదయానికి రెక్కలిచ్చాయి. నేను బురదగుంట నుంచి బయటపడేందుకు ఎంతో తోడ్పడ్డాయి. పుస్తకాలు చదవకపోతే నా చుట్టూ ఉన్న, మౌఢ్యంలోనూ, నీచంలోనూ మునిగిపోయేవాణ్ణి. బురద గుంటలో పడి ఉన్న నన్ను లేవనెత్తి నా ముందు విశాల మైన ప్రపంచ దృశ్యాలను సాక్షాత్కరింపజేసినవి పుస్త కాలు’’ అన్నారు.
 
 మహాత్మాగాంధీ మంచి పుస్తకం మహోన్నతమైన మార్పును కలిగిస్తుందని వివరిస్తూ, ‘‘నా జీవితంలో తక్షణం మహత్తరమైన, నిర్మాణాత్మకమైన మార్పు తెచ్చిన పుస్తకం ‘‘అన్ టు ది లాస్ట్’’. ఆ పుస్తకం నన్నెంతో ఆకర్షిం చింది. అది చదవడం ప్రారంభించి, చివరి వరకు దాన్ని వదల్లేకపోయాను. ఆ పుస్తకంలో చదివిన విషయాలను ఆచరణలో పెట్టాలనే నిర్ణయానికి వచ్చాను. దాన్ని సర్వో దయం పేరుతో అనువదించానని’’  ఆహ్లాదంగా వివ రించారు. ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి ఆ పుస్తకం ఎంతగానో దోహదం చేసింది. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డా॥ బి.ఆర్.అంబేద్కర్ లండన్ లైబ్ర రీలో రోజుల తరబడి పుస్తక పఠనంలో నిమగ్నమయ్యే వారు. పుస్తక పఠనమే ఆయనను గొప్ప మేధావిగా, రచయితగా చేసింది. ఆయన మాటల్లో ‘‘పుస్తకాలు మనో మాలిన్యాన్ని తొలగించే దీపాలు’’. మంచి పుస్తకాల వల్ల మనోమాలిన్యం తొలగిపోతుందని, మానసిక వికాసం కలుగుతుందన్న అభిప్రాయం అక్షరసత్యం.
 
 డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రపంచ దేశాల మన్న నలను అందుకున్న గొప్ప తత్వవేత్త. ప్రాచ్య, పాశ్చాత్య తత్వశాస్త్రంపై ప్రామాణిక గ్రంథాలు రచించారు. రష్యాలో భారత రాయబారిగా ఉన్నప్పుడు కూడా విలువైన గ్రంథా లను పఠించడం ఆయన పుస్తక పఠనాసక్తికి నిదర్శనం. ప్రముఖ సాహితీవేత్త, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశ లింగం ఎన్నో గ్రంథాలు చదివి అపారమైన పరిజ్ఞానాన్ని సముపార్జించారు. శతాధిక గ్రంథాలు రచించారు. ఆయన పుస్తకాల ఆవశ్యకతను వివరిస్తూ ‘‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో-కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో’’ అన్నారు.
 
 నేటి యువత స్థితి దానికి భిన్నంగా ఉంది. నవనాగరి కత ప్రభావం వల్ల మంచి చొక్కాలు తొడుక్కుంటున్నారు. కానీ మంచి  పుస్తకాలను కొనుక్కోవడం లేదు. జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్స్ పరీక్షలలోగానీ రాష్ట్ర ప్రభు త్వం నిర్వహించే సర్వీస్ కమిషన్ పరీక్షల్లోగానీ నేటి యువ కులు ఆశించినంతగా ఫలితాలు సాధించలేకపోవడానికి కారణం పుస్తకపఠన లోపమే. ప్రముఖ గాంధేయవాది వావిలాల గోపాలకృష్ణయ్య ‘‘చచ్చేదాకా చదవాలి - వచ్చే దాకా వల్లించాలి’’ అనే సూక్తిని ఎన్నో సభల్లో చెప్పేవారు.
 
 నేటి పుస్తక రచయితల్లో, ప్రచురణకర్తల్లో వ్యాపారధో రణి పెరిగిపోయింది. పుస్తకాల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవు. వ్యాపార ధోరణితో నవలలు, కథా సంపుటాలను మాత్రమే ప్రచురిస్తున్నారు. కవిత్వం, సాహితీ విమర్శ వంటి ప్రక్రియలను ప్రచురించే సంస్థలు లేవు. ప్రచురించినా కొనే పాఠకులు కరువయ్యారు. నైతిక ప్రబోధం కలిగించే మంచి సాహిత్య గ్రంథాలు రావటం లేదు. స్వాతంత్య్రానికి పూర్వం వావిళ్ల వారి వంటి ప్రచు రణ సంస్థలు సేవాదృష్టితో ప్రబంధాలు, పురాతన గ్రం థాలు ప్రచురించేవారు. ప్రస్తుతం తెలుగు విశ్వవిద్యాల యం, తెలుగు అకాడమీ వంటి సంస్థలు ప్రామాణిక సాహిత్య గ్రంథాలను ప్రచురించి, సరసమైన ధరలకు పాఠకులకు అందిస్తున్నారు. ఆ సంస్థల కృషి మరింతగా పెరిగి, మంచి సాహిత్య గ్రంథాలు వెలుగులోకి రావాలి. వ్యాపార ధోరణితో వచ్చే చెత్త పుస్తకాలను నిరాదరించాలి.
 
 పుస్తకాలు ప్రధానంగా రెండు రకాలు. 1. క్షణికానం దం కలిగించేవి - డిటెక్టివ్, సెక్స్ ఇతివృత్తాలతో వచ్చే నవలలు, ఈ వర్గీకరణకు చెందినవి. ఇవి క్షణకాలంలో చదివి పారేసేవి. 2. కలకాలం భద్రపరచుకొనే గ్రంథాలు: రామాయణ, మహాభారతాది ఇతిహాసాలు, ఇంగ్లిష్ సాహి త్యంలో మిల్టన్ షేక్స్‌పియర్ వంటి గ్రంథాలు ఈ వర్గీక రణకు చెందినవి. ఇవి శాశ్వతానందం కలిగించేవి. ఇటు వంటి గ్రంథాలను ప్రచురించేందుకు ప్రచురణకర్తలు ముందుకు రావాలి. పాఠకులు ఆదరించాలి. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగానైనా విద్యార్థినీ విద్యార్థులు, యువతీ యువకులు, విద్యావంతులు పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంపొందించుకొనే విధంగా ప్రతిజ్ఞ చేయించాలి. యువకులు పుస్తకాన్ని హస్తభూషణంగా కాక మస్తక భూషణంగా భావించాలని ఆకాంక్షిద్దాం.

డా.షి.వి.సుబ్బారావు
(వ్యాసకర్త సాహితీ విమర్శకులు)

 

 

 

 

 

 

>
మరిన్ని వార్తలు