ఏదీ ఆ ఆపన్నహస్తం?

8 Jul, 2016 01:21 IST|Sakshi
ఏదీ ఆ ఆపన్నహస్తం?

2004 సంవత్సరానికి ముందు ప్రతి జిల్లాలోనూ పింఛన్ల సంఖ్య పరిమితమే. అన్ని అర్హతలు ఉన్నవారు సైతం పింఛను కోసం అప్పటి లబ్ధిదారులలో ఎవరో ఒకరు కన్ను మూసే దాకా వేచి ఉండక తప్పని పరిస్థితి. అదికూడా నెలకి కేవలం రూ. 75. సంఖ్యతో సంబంధం లేకుండా, కులమతాలతో నిమిత్తం లేకుండా, రాజకీయాలకు అతీతంగా అర్హు లందరికీ పింఛన్లు మంజూరు చేయకుంటే అది నేరమని వైఎస్ భావించారు. ఆయన పాలనాకాలంలో దాదాపు 50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి.
 
 ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ మూడు దశాబ్దాలలో నేను ఎందరో రాజకీయ నాయకుల దగ్గర పనిచేస్తూ సన్నిహితంగా మెలిగాను. ముఖ్యంగా ముఖ్యమంత్రులు, మంత్రుల దగ్గర చాలా నేర్చుకున్నాను.  నా అభిరుచి మేరకు తెలుగువారి రాజకీయ చరిత్రను కూడా అధ్యయనం చేశాను. వారందరిలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అద్వితీయుడని ఎలాంటి సంకో చాలు లేకుండా చెప్పగలను. ఆయన పుట్టుకతో నాయకుడు. క్రమశిక్షణ కలిగి నవారు. ధైర్యశాలి, కష్టపడి పనిచేసేవారు. క్లిష్టమైన అంశాల మీద నిర్ణయాలు చేయడానికి వెనుకాడేవారు కాదు. అనుయాయులంటే ప్రాణమిచ్చేవారు. ఇదే లక్షణం మిత్రులను, అనుయాయులను వైఎస్ వెనుక కలకాలం నిలబడేటట్టు చేసింది. వీటన్నిటికీ మించి వైఎస్ గొప్ప దయార్ద్ర హృదయులు. దారిద్య్రాన్ని చూస్తే ఆయన మనసు ద్రవించేది.
 
  చెప్పుకోదగిన ఎన్నో విశేషాలు కలిగిన అలాంటి నేతతో దాదాపు దశాబ్దంపాటు సన్నిహితంగా పనిచేయడం నా జీవితంలోనే ఎంతో చెప్పు కోదగ్గ విషయం. వైఎస్ హయాంలో ఆంధ్రప్రదేశ్ అత్యున్నత స్థాయిలో ఆర్థిక వృద్ధి రేటును సాధించింది. ఆర్థికాభివృద్ధి ఫలితాలు అట్టడుగువర్గాలకు చేరింది కూడా అప్పుడే. అందుకే ఐదేళ్ల మూడు మాసాలు సాగిన వైఎస్ పరి పాలన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఓ అద్భుతం.
 
 సీఎస్‌వో (కేంద్ర గణాంకాల సంస్థ) సమాచారం ప్రకారం 2004-2009 మధ్య ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ సగటు వార్షిక ఆర్థిక (జీఎస్‌డీపీ) వృద్ధి రేటు 9.6 శాతం. ఇది అప్పటి జాతీయ సగటు 8.5 శాతం కంటే ఎక్కువే కాకుండా, అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ (1999-2004) సాధించిన ఐదేళ్ల సగటు వార్షిక వృద్ధి రేటు 6.06 శాతం కన్నా అధికం. 2004-2009 మధ్య సాధించిన 9.6 శాతం ఆర్థిక వృద్ధి రేటు 1956 తరువాత ఐదేళ్ల కాల పరిమితిలో మొద టిసారి నమోదైన అత్యున్నత వృద్ధి రేటు.
 
 రైతుల కోసం ఉచిత విద్యుత్ సరఫరాకు ఆదేశాలు ఇస్తూ, మే 14, 2004 వరకు ఉన్న రైతుల విద్యుత్ బకాయిలు రూ. 1,300 కోట్లు మాఫీ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ తొలి ఫైలు మీద సంతకం చేసినప్పుడు చాలా మంది ఇది తాత్కాలిక వ్యవహారమని జోస్యం చెప్పారు. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ పుణ్యమా అని ఇతర వర్గాలకు సరఫరా చేసే విద్యుత్‌పై టారిఫ్‌ను ఇతోధికంగా పెంచుతారని కూడా పలువురు భావించారు. కానీ వైఎస్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు సంపూర్ణంగా రైతులకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసింది. 2004లో 800 కోట్ల యూనిట్లుగా ఉన్న వ్యవసాయ రంగ విద్యుత్ వినియోగం 2009 నాటికి 1,500 కోట్లకు పెరిగినప్పటికీ ఇతర వర్గాల మీద ఏమాత్రం టారిఫ్ భారం పడకుండానే వైఎస్ ప్రభుత్వం పూర్తికాలం రైతులకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసింది. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించిన తరువాత ఏ వర్గం వినియోగదారుల మీద కూడా  వరసగా ఐదేళ్లు విద్యుత్ టారిఫ్‌ను పెంచకుండా ఉన్న కాలం ఇదొక్కటే.
 
 ఒకసారి ప్రణాళికా సంఘం సమావేశానికి డాక్టర్ వైఎస్‌ఆర్‌తో కలసి నేను హాజరయ్యాను. అప్పుడు డాక్టర్ మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా సంఘం ఉపాధ్యక్షులు. ఆ సందర్భంలోనే, ఇతర వర్గాల వినియోగదారులకు చార్జీలు పెంచకుండానే మీరు రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? దే శం మొత్తం మీద విశేష స్థాయిలో సంక్షేమ పథకాలూ అమలు చేస్తున్నారు. అది కూడా పన్నులు పెంచకుండా, ఆదాయ లోటు బాధ లేకుండా అమలు చేస్తున్నారు. ఇదెలా సాధ్యపడుతోందని సింగ్ డాక్టర్ వైఎస్‌ఆర్‌ను అడిగారు. ఇంకా, మీకు అవకాశం ఉన్న మేర రుణం కూడా తీసుకోరు. అయినప్పటికీ చాలా అభివృద్ధి పథకాలను అమలు చే స్తున్నారు. మీ దగ్గర మంత్రదండం ఏదైనా ఉందా? అని కూడా అడిగారాయన. నా మంత్రదండం ఏదైనా ఉన్నదీ అంటే అది, నా నిబద్ధత, నాకున్న పరిపూర్ణ విశ్వాసం అని నవ్వుతూ జవాబిచ్చారు వైఎస్.
 
 ఆరోగ్య పరిరక్షణ అందరికీ అందుబాటులో లేని కాలంలో, ముఖ్యంగా పేదవర్గాలకీ, మధ్యతరగతికీ అందరానిదిగా ఉన్న కాలంలో, ఈ వర్గాలు వైద్యసేవల కోసం రుణాల ఊబిలో కూరుకుపోతున్న సమయంలో డాక్టర్ వైఎస్ ఆరోగ్య రక్షణ ప్యాకేజీలను ప్రవేశపెట్టారన్న వాస్తవాన్ని గుర్తించాలి. ఫిక్స్‌డ్ డే వైద్యసేవలు (104), అత్యవసర వైద్యానికి రాకపోకల సేవలు (108), రాజీవ్ ఆరోగ్యశ్రీలను ఆ పరిస్థితులలో ఆయన ప్రవేశపెట్టారు. ఇలాంటి సేవలు అమలులోకి రావడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి. ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడానికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా వెనుకాడుతున్న సమయంలో రాష్ట్రంలో వైఎస్ అమలు చేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు తీవ్ర రుగ్మతలకు గురైనప్పుడు సంవత్సరంలో ఒకసారి రెండు లక్షల రూపాయల వరకు వైద్యసేవల నిమిత్తం చెల్లించే సదుపాయం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద కల్పించారు.
 
 వృద్ధులకీ, అనాథలుగా మిగిలిన మహిళలకీ, అభాగ్య విధవలు లేదా దివ్యాంగులు - ఇలాంటి వారందరికీ ఆపన్నహస్తం అందివ్వాలన్న ఆయన తపన ఎప్పటికీ గుర్తుంటుంది. అర్హులందరికీ అందే విధంగా ఆనాటి పింఛను పథకాన్ని వైఎస్ విస్తరించారు. 2004 సంవత్సరానికి ముందు ప్రతి జిల్లా లోనూ పింఛన్ల సంఖ్య పరిమితమే. అన్ని అర్హతలు ఉన్నవారు సైతం పింఛను కోసం అప్పటి లబ్ధిదారులలో ఎవరో ఒకరు కన్నుమూసే దాకా వేచి ఉండక తప్పని పరిస్థితి. అదికూడా  నెలకి కేవలం రూ. 75. సంఖ్యతో సంబంధం లేకుండా, కులమతాలతో నిమిత్తం లేకుండా, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయకుంటే అది నేరమని వైఎస్ భావించారు.
 
 ఆయన పాలనా కాలంలో దాదాపు 50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. మహిళా సాధికారతను పటిష్టం చేయడానికి స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) నెట్‌వర్క్‌ను ఆయన బలోపేతం చేసిన తీరు దేశంలోనే అపూర్వం. తాగు, సాగు అవసరాల కోసం ప్రతి నీటి బిందువునూ సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో చేపట్టిన జలయజ్ఞం కూడా దేశంలో అద్వితీయమైనది.
 
 వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధి కోసం చేసిన కృషి డాక్టర్ వైఎస్ ప్రభుత్వం నమోదు చేసుకున్న గొప్ప విజయగాథలలో ఒక గాథ. 2004-2009 సంవత్సరాలలో వ్యవసాయ రంగంలో 6 శాతం వాస్తవ వార్షిక వృద్ధి రేటును లక్ష్యంగా నిర్దేశించుకుంటూ వైఎస్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. నాటి రాష్ట్ర గవర్నర్ సుర్జీత్ సింగ్ బర్నాలా జూన్ 1, 2004న శాసనసభలో చేసిన ప్రసంగంలో ఈ అంశం పేర్కొన్నారు. అప్ప టివరకు పదే ళ్లలో రాష్ట్రంలో సాధించిన వాస్తవ వృద్ధి రేటు 3 శాతం. యూపీఏ జాతీయ స్థాయిలో నిర్దేశించుకున్న లక్ష్యం 4 శాతం. దీనిని కూడా ఆనాడు పలువురు అత్యాశగానే పరిగణించారు. అయితే వైఎస్ కృషి ఫలితంగా రాష్ట్రం పశుగణాభివృద్ధి, మత్స్య పరిశ్రమాభివృద్ధి, ఫలపుష్ప సాగు వంటి అను బంధ రంగాలతో కలిపి వ్యవసాయం 6.87 శాతం సగటు వార్షిక వృద్ధి రేటును సాధించింది.
 
 అయితే 2004-2009 ఐదేళ్ల కాలంలో జాతీయ స్థాయిలో సాధించిన వృద్ధి రేటు 3.26 శాతమే. 2004లో 136 లక్షల టన్నులు ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి 2009 నాటికి 204 లక్షల టన్నులకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఏ ఐదేళ్ల కాలంలోనూ ఇంత అధికంగా సగటు వార్షిక వృద్ధి రేటును సాధించిన సందర్భం కనిపించదు. ఇదంతా యాదృచ్ఛికంగా సంభవించింది కాదు. దీని వెనుక అకుంఠిత కృషి, దీక్ష ఉన్నాయి. పేదలకు ఇంటి సౌకర్యం కల్పించే సంకల్పంతో గుడిసె రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో వైఎస్ ఆరంభించిన ‘ఇందిరమ్మ’ (ఇంటిగ్రేటెడ్ నోవెల్ డెవలప్‌మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ మోడరన్ మునిసిపల్ ఏరియాస్) కూడా ఎంతో ఘనమైనది. ఆంధ్రప్రదేశ్ అవతరణ నుంచి 31-03-2004 వరకు రాష్ట్రంలో మొత్తం 47 లక్షల గృహాల నిర్మాణం జరిగితే, 2004 మే మాసం నుంచి, 2009 సెప్టెంబర్ మధ్య మరో 45 లక్షల గృహాల నిర్మాణం జరిగింది. 25 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. పారిశ్రామిక రంగంలో కూడా 1956 తరువాత ఏనాడూ కానరాని రీతిలో 2004-2009 మధ్య  10.9 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు సాధ్యమైంది.
 
 నారా చంద్రబాబునాయుడు పాలించిన 1994-2004 మధ్య కాలంలో సాధించిన వార్షిక వృద్ధి రేటు 6. 51 శాతమే. క్యాటో సంస్థ ప్రచురించిన ఆర్థిక స్వాతంత్య్ర సూచీ నివేదిక ప్రకారం: 2005-2009 మధ్య ఆర్థిక స్వాతంత్య్ర సాధనలో 0.11 స్కోర్లు సాధించి భారీ అభివృద్ధిని నమోదు చేసిన రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, గుజరాత్. ఆంధ్రప్రదేశ్ స్కోరు 0.40 నుంచి 0.51కి పెరిగింది. గుజరాత్ సాధించిన 0.46 నుంచి 0.57 స్కోరును దామాషా ప్రకారం చూస్తే, ఆంధ్రప్రదేశ్ సాధించిన స్కోరే వేగవంతమైనది. 2005లో ఏడో స్థానంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ 2009 నాటికి మూడో స్థానానికి ఎదిగింది. సాఫ్ట్‌వేర్ ఎగుమతులలో కూడా 2004లో 8 శాతం ఉన్న ఆంధ్రప్రదేశ్ వాటా 2009 నాటికి 12 శాతానికి పెరిగింది.
 
 హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం తలంపు చంద్ర బాబుదే కావచ్చు. కానీ ఆయన అందుకు పునాదిరాయి కూడా వేయలేదు. వైఎస్ పునాదిరాయి వేయడమే కాదు, పూర్తయిన విమానాశ్రయాన్ని చూశారు. అలాగే ఆ విమానాశ్రయం కోసం తలపెట్టిన పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, రికార్డు సమయంలో పూర్తి చేయించారు. రాకపోకలకు మరింత వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో హైదరాబాద్ చుట్టూ 12 లేన్‌ల రింగ్ రోడ్డు నిర్మాణం కూడా వైఎస్ హయాంలోనే జరిగింది.
 
  74 కిలోమీటర్ల దూరంతో, రూ.16,000 కోట్లతో తలపెట్టిన మెట్రో రైలు పథకం కూడా వైఎస్‌దే. హైదరాబాద్ నగర మంచినీటి అవసరాల కోసం రెండో దశ కృష్ణా పథకం, గోదావరి నీటి సరఫరా పథకం కూడా అప్పుడే పూర్తయ్యాయి. ఐఐటీ, బిట్స్ పిలానీ, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్, టాటా ఎనర్జీ రీసెర్చ్ సంస్థ, సింబయోసిస్, ఐఎంటీ ఘజియాబాద్, నేపియర్, డాక్టర్ సీవీరావు స్టాటిస్టికల్ సంస్థ, ఫిషరీస్ బోర్డు - ఇవన్నీ వైఎస్ హయాంలో వచ్చినవే.

మన ప్రియతమ నేత వైఎస్ 68వ జయంతిని జరుపుకుంటున్న సందర్భంలో కన్నీరు ఉబికిన ప్రతి కంటినీ తుడవాలన్న ఆయన ఆశయాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేయడమే ఆయనకు నిజమైన నివాళి. ఒక హెలికాప్టర్ ప్రమాదంలో ఆయనను మనం కోల్పోయాం. భగ వంతుని లీలలు అర్థంకావు. వైఎస్ నిజమైన మహానేత. జూలియస్ సీజర్ అంత్యక్రియల సందర్భంగా మార్కస్ ఆంటోనీ ఇచ్చిన ఉపన్యాసం నాకు గుర్తుకు వస్తోంది. ఇక్కడొక సీజర్ ఉండేవాడు. అలాంటి వారు మరొకరు ఎప్పుడు వస్తారు?
 వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు, వైఎస్సార్‌సీపీ
 రాజకీయ వ్యవహారాల సంఘం సభ్యుడు
 - డీఏ సోమయాజులు

>
మరిన్ని వార్తలు