తెలుగు గజల్‌కు 50 ఏళ్లు

14 Nov, 2016 02:34 IST|Sakshi
తెలుగు గజల్‌కు 50 ఏళ్లు

వలపునై నీ హృదయ సీమల 'నిలువవలెనని ఉన్నది'

ఇది తెలుగు గజల్‌కు స్వర్ణోత్సవ సంవత్సరం. 1966లో తొలి తెలుగు గజల్‌ రాసిన కవి దాశరథి. తొలి తెలుగు గజల్‌ వాగ్గేయకారుడు పి.బి.శ్రీనివాస్‌. తెలుగు గజల్‌ను చలామణీలోకి తెచ్చిన కవి సినారె. తెలుగు గజల్‌ను విశ్వవిఖ్యాతం చేసిన గాయకుడు కేశిరాజు శ్రీనివాస్‌.

ఈ ఏడాది తెలుగు గజల్‌కు స్వర్ణోత్సవం. గజల్‌ ప్రక్రియ అరబ్బీలో పుట్టింది. ఫార్సీలో పెరిగింది. ఫార్సీ భాష మూలంగా మన దేశంలోకొచ్చింది. గజల్‌ ఇస్లాంకు ముందే ఉన్న కవితా ప్రక్రియ. అరబీ భాషలో గజల్‌ పదానికి పూర్వరూపమైన ‘గజ్జాల్‌ అనే పదానికి లేడి, జింక అని అర్థమట. ఇరాన్‌ దేశపు రాగాలలో ఒక రకానికి ఆ పేరు ఉండేది. గజల్‌ ‘కసీదా’ నుంచి విడివడి ఒక ప్రత్యేకమైన కవితా ప్రక్రియ అయింది.

పదమూడవ శతాబ్దంలో ఫార్సీ కవి హజ్రత్‌ అమీర్‌ ఖుస్రో గజల్‌కు మన దేశంలో ప్రాణప్రతిష్ట చేశాడు. టర్కీ భాషా పదమైన ఉర్దూ అన్న పేరుతో మన దేశంలో ఒక భాష పుట్టి పెరిగాక వలీ దక్కనీ అనే దక్షిణ భారతదేశపు కవి ఉర్దూ భాషలో గజళ్లు రాసి ఉర్దూ గజళ్లకు వ్యాప్తిని తీసుకొచ్చాడు.

ఇబ్రాహిమ్‌ ఆదిల్‌షాహ్, మొహమ్మద్‌ కులీ కుతుబ్‌షాహ్, సుల్తాన్‌ మొహమ్మద్‌ కుతుబ్‌షాహ్, అబ్దుల్‌ హసన్‌ తానాషాహ్‌ వంటి రాజ కవులూ, మీర్‌ తకీ మీర్, గాలిబ్, జౌక్, మొమిన్, దాగ్, ఫైయ్‌జ్, హాలీ వంటి కవులూ గజల్‌ను చాలా గొప్పగా నడిపించారు. చివరి మొగల్‌ రాజైన సిరాజుద్దీన్‌ షాహ్‌ బహాదుర్‌ షాహ్‌ జఫర్‌ రాజ్యాన్ని కోల్పోయి చెరసాలలో గజళ్లు రాసుకుంటూ జీవితాన్ని వెళ్లబుచ్చాడు.
పాకిస్తాన్‌ ఏర్పడ్డాక ఉర్దూ భాష పాకిస్తాన్‌ అధికార భాష అయింది. కానీ ఉర్దూ భాష, గజల్‌ ప్రక్రియ మన దేశంలోనే సుసంపన్నంగా ఉన్నాయి.

దేశ విభజనకు ముందే గజళ్లు 78 ఆర్‌.పి.ఎమ్‌. రికార్డులపై విడుదలై జనరంజకమైనాయి. పందొమ్మిది వందల పదికే గజల్‌ రికార్డ్‌పై వచ్చింది. బేగం అఖ్తర్, సైగల్‌ వంటి గాయకుల గజళ్ల గానం చాలా మందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా తలత్‌ మెహమూద్‌ పందొమ్మిది వందల నలబై ఒకటవ సంవత్సరం తరువాత రికార్డుల కోసం పాడిన కొన్ని గజళ్లు విపరీతమైన జనాదరణ పొందాయి.

గజల్‌ తనాన్ని ‘గజలియత్‌’ అంటారు. ఈ గజలియత్, ఇతర రచనా విధానాల నుంచి శైలి పరంగా గజల్‌ను ప్రత్యేకంగా చూపిస్తుంది. గజల్‌ వ్యక్తీకరణా విధానంలోని ప్రత్యేకతే గజలియత్‌.
తెలుగు గజల్‌ పందొమ్మిది వందల అరవై ఆరులో వచ్చింది. దాశరథి వెలువరించిన ‘కవితాపుష్పకం’ కవితా సంకలనంలో ‘కామన’ శీర్షికతో తొలి తెలుగు గజల్‌ మనకు అందింది. ఆ గజల్‌లోని మొదటి షేర్‌:
‘వలపునై నీ హృదయ సీమల నిలువవలెనని ఉన్నది
పిలుపునై నీ అధర వీధుల పలుకవలెనని ఉన్నది’

తెలుగు గజల్‌ను మొట్ట మొదటిసారి స్వరపరిచి, పాడి, ప్రసారం చేసి వినిపించింది పి.బి.శ్రీనివాస్‌. పందొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో ఆకాశవాణి కడప కేంద్రం నుంచి తొలి తెలుగు గజల్‌ ప్రసారం అయింది. పి.బి.శ్రీనివాస్‌ రాసి, స్వరపరిచి పాడిన గజల్‌ అది.

ఆ గజల్‌ మొదటి షేర్‌:
‘కల్పనలు సన్నాయి ఊదే వేళ చింతలు దేనికి?
కవితలు అర్పించు కానుక లోక కల్యాణానికి’
ఉర్దూ గజళ్లలో మనకు కనిపించే హుస్న్‌–ఎ–మత్‌లాలు మొదట తెలుగులో రాసింది కూడా వారే. తెలుగులో గజల్‌ను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన కవి సి.నారాయణరెడ్డి. వారు రాసిన ఒక గజల్‌లోని మొదటి షేర్‌:
‘ఎదురుగ క్షీర సముద్రాలున్నా హృదయానికి దాహం
కరిగే తొలకరి మేఘాలున్నా గగనానికి దాహం’
దాశరథి, పి.బి.శ్రీనివాస్, సి.నారాయణరెడ్డి తెలుగు గజల్‌కు ముమ్మూర్తులు. తెలుగులో గజల్‌ ప్రక్రియకు సంబంధించిన వారందరికీ పూజ్యులు. ఆ తరువాత చెప్పుకోవలసిన గజల్‌ కవులు అమన్‌ హిందూస్థానీ, పెన్నా శివరామకృష్ణ, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు, తటవర్తి రాజగోప బాలం ప్రభృతులు.

తెలుగు వారందరూ గర్వించ తగ్గ విషయం ఏమిటంటే, పి.బి.శ్రీనివాస్‌ తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, హిందీ, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ మొత్తం ఎనిమిది భాషలలో గజళ్లను రాశారు. ప్రపంచంలోనే ఎనిమిది భాషలలో గజళ్లను రాసిన ఏకైన కవి మన తెలుగు వారైన పి.బి.శ్రీనివాస్‌! పందొమ్మిది వందల ఎనబై ఒకటి, ఎనబై నాలుగు సంవత్సరాలలో పి.బి.శ్రీనివాస్‌ ‘సంగీతా రికార్డ్స్‌ ద్వారా రెండు ఉర్దూ గజళ్ల ఆల్బంలను విడుదల చేశారు. ఒక కన్నడ గజళ్ల రికార్డును విడుదల చేశారు. పందొమ్మిది వందల తొంబై ఆరవ సంవత్సరంలో ‘గాయకుడి గేయాలు’ అన్న సంకలనంలో వారు కొన్ని గజళ్లను పొందుపరిచారు. పందొమ్మిది వందల తొంబై ఏడవ సంవత్సరంలో విడుదలైన ‘ప్రణవం’ అన్న తమ అష్ట భాషా కవితా సంకలనంలో వివిధ భాషల గజళ్లను పొందుపరిచారు. తమిళ, కన్నడం, మలయాళం, సంస్కృతం భాషలలో వారే తొలి గజల్‌ రాసినట్లు తెలుస్తోంది. వారు ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో ఉర్దూ గజళ్లను ఆలపించారు.

పందొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన ఎన్‌.టి.రామారావు చిత్రం ‘అక్బర్‌ సలీం అనార్కలి’ తెలుగు చిత్రంలో సి.నారాయణరెడ్డి రాసిన ఒక గజల్‌ మనకు మొహమ్మద్‌ రఫి గొంతులో వినిపిస్తుంది. సి.రామచంద్ర సంగీతం సమకూర్చిన ‘తానే మేలి ముసుగు తీసి ఒక జవ్వని పువ్వులాగా నవ్వుతుంటే ఏం చేయను’ అన్న ఆ గజల్‌ సంగీత, సాహిత్యపరంగా ఒక చక్కటి గజల్‌!

కొన్ని చలన చిత్రాలకు సంగీతం సమకూర్చిన తెలుగు వారు బి.శంకర్‌ ఉర్దూ గజళ్లు పాడేవారు. తెలుగు వారైన విఠల్‌ రావు గొప్ప ఉర్దూ గజల్‌ గాయకులు. ప్రముఖ వైణిక విద్వాంసులు ఈమని శంకర శాస్త్రి కుమారై విష్ణుభొట్ల దేవి తెలుగు వారై ఎనబైయవ దశకం తొలిదశలో ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో ఉర్దూ గజల్‌ గాయనిగా తమ ప్రస్థానాన్ని మొదలు పెట్టి ఆ తరువాత హైదరాబాద్‌ దూరదర్శన్‌ కేంద్రంలోనూ, బయటా తమ గజల్‌ గానాన్ని సాగిస్తున్నారు.

రెండు వేల రెండో సంవత్సరంలో వెబ్‌ ప్రపంచం.కామ్‌ అనే అంతర్జాల పత్రికలో రోచిష్మాన్‌ రాసిన ఓ గజల్‌ అంతర్జాలంలో వచ్చిన తొలి తెలుగు గజల్‌గా నమోదయింది. తొలిసారి తెలుగులో శాస్త్రీయమైన బహర్‌లో గజల్‌ రాసింది కూడా రోచిష్మాన్‌. ఎమ్‌.బి.డి. శ్యామల తొలి తెలుగు గజల్‌ కవయిత్రి. తొలి తెలుగు గజల్‌ గాయని శొంఠి పద్మజ.

పి.బి.శ్రీనివాస్, మొహమ్మద్‌ రఫి, ఎమ్‌.చిత్తరంజన్, సి.నారాయణరెడ్డి ప్రభృతుల తర్వాత తెలుగు గజల్‌ గానాన్ని చేపట్టింది కేశిరాజు శ్రీనివాస్‌. గజల్‌ శ్రీనివాస్‌గా మనమందరమూ ఎరిగిన వీరు మన హరికథా విధానాన్ని తోడు తీసుకుని తమ గానంతో గజల్‌ను విశ్వరంజకం చేశారు.

గజల్‌ పరిశోధకులుగా సామల సదాశివ, గుంటూరు శేషేంద్ర శర్మ, కోవెల సంపత్‌ కుమారాచార్య, నోముల సత్యనారాయణ, పెన్నా శివరామకృష్ణ, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గజళ్ల గురించి విలువైన రచనలు చేశారు. తెలుగు వారైన అమన్‌ హిందూస్థానీ పందొమ్మిది వందల యాబై ఎనిమిదో సంవత్సరంలోనే ఉర్దూ గజళ్లను రాశారు. పి.బి.శ్రీనివాస్, అమన్‌ హిందూస్థానీ, రోచిష్మాన్‌లు ఆంగ్లంలో కూడా గజళ్లను రాశారు.

తెలుగు గజల్‌ స్వర్ణోత్సవం సందర్భంగా ‘గజల్‌ లోగిలి’ అనే పేరుతో ఒక ఫేస్‌బుక్‌ సమూహం తెలుగు గజళ్ల కోసం మొదలై సాగుతోంది.
అయితే, గజల్‌ తెలుగులోకి మూడు దోషాలతో వచ్చింది. ఒకటి కాఫియా అంటే అంత్యాను ప్రాస విషయంలో జరిగింది. రెండవది బహర్‌ అంటే ఛందస్సు లేకుండా రావడం. మూడవది గజలియత్‌ అంటే గజల్‌తనం లేకపోవడం. గజల్‌ రాస్తున్నందుకు తెలుగునూ, తెలుగులో రాస్తున్నందుకు గజల్‌నూ భ్రష్టుపట్టిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది.
తెలుగులో గజల్‌ ప్రక్రియ బాగా పుంజుకుని సరైన దారిలో రాణించాల్సిన అవసరం ఉంది.
రోచిష్మాన్‌
09444012279

మరిన్ని వార్తలు