శ్రీశ్రీ జరిపిన పుస్తకావిష్కరణ

13 Jun, 2015 23:24 IST|Sakshi
శ్రీశ్రీ జరిపిన పుస్తకావిష్కరణ

20-5-1980. అది మద్రాసు మహానగరం. టి.నగర్‌లోని జి.ఎన్.బెట్టీ రోడ్, మహాలక్ష్మీ క్లబ్. సాయంత్రం 6 గంటలు. సంకు గణపతిరావు అతిథులందరినీ వేదికపైకి ఆహ్వానించి, సుప్రసిద్ధ నటుడు కొంగర జగ్గయ్యకు మైకు అందించారు. ఆయన తన కంచుకంఠంతో సభను ఉద్దేశించి ఉపన్యసించారు. ఆ తరువాత శ్రీశ్రీ ‘మానవులం’ పుస్తకావిష్కరణ చేశారు. ఆ రోజులలో మినీ కవితలను యువకులు జోరుగా రాస్తున్నారు. ‘మానవులం’లో నేను రాసిన ఒక ఖండికను చదివారు.

 ‘నేను కవితా వామనుణ్ణి / నా మొదటి పాదం విశ్వనాథపైన నా రెండవ పాదం శ్రీశ్రీపైన / నా మూడవ పాదం ఆత్రేయమీద పెట్టాను
 అందుకే నేను ఎదగనివాణ్ణి / కవితా వామనుణ్ణి’. దీని గురించి శ్రీశ్రీ పదిహేను నిమిషాలకు పైగా వ్యాఖ్యానించారు. నాకున్న సంస్కృత పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు చాటిచెప్పారు. ఆయనకున్న సంస్కృత పరిజ్ఞానాన్ని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఆనాటి సభకు నయగార కవి ఏల్చూరి సుబ్రహ్మణ్యం వారి శ్రీమతితో వచ్చారు. కొసరాజు, ముళ్లపూడి వెంకటరమణ, ఎమ్వీయల్, పి.బి.శ్రీనివాస్, కాకరాల, దేవిప్రియ కూడా సభకు విచ్చేసి, అందరూ తలో పది నిమిషాలకు పైగా మాట్లాడారు. ఎమ్వీయల్ మాట్లాడుతూ, ఇటువంటి రచనలు అలిశెట్టి ప్రభాకర్ రాస్తున్నాడని కొన్నింటిని ఉటంకించి సభకు వివరించారు. పి.బి.శ్రీనివాస్ ‘మానవులం’ మీద రాసిన సమీక్షను అందరికీ చదివి వినిపించారు.

 సభ రెండు గంటల్లో ముగుస్తుందని కొంగర జగ్గయ్య మలి ఉపన్యాసం చేశారు. పాత్రికేయుడు సంకు గణపతిరావు వందన సమర్పణ గావించారు. ఆ సభ విశేషమేమిటంటే శ్రీశ్రీ ఎన్నడూ లేని విధంగా పట్టు పీతాంబరాలలో వచ్చారు. సభ కిటకిటలాడింది.
  కె.ప్రభాకర్; ఫోన్: 9440136665
 

మరిన్ని వార్తలు