జీఎస్‌టీ ‘జనమేధ’యాగం

13 Sep, 2016 01:04 IST|Sakshi
జీఎస్‌టీ ‘జనమేధ’యాగం

ఫ్రాన్స్, అమెరికాల్లోని పేద, ధనిక వర్గాల మధ్య ఆదాయాల వ్యత్యాసాలు తగ్గడానికి జీఎస్‌టీ తోడ్పడలేదు. పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థల్లో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజా బాహుళ్యంపైన పరోక్ష పన్నులు నానాటికీ పెరుగుతుంటాయి, కోటీశ్వరులు, మహా కోటీశ్వరులపై ప్రత్యక్ష పన్నులు తగ్గుతూ ఉంటాయి. గతంలో గుజరాత్ సీఎంగా మోదీ, బీజేపీలు ఫెడరల్ వ్యవస్థ అనే భావననే జీఎస్‌టీ కలుషితం చేసిందని విమర్శించారు. ఇప్పుడు వారు గొంతు మార్చినంత మాత్రాన వ్యాపిస్తున్న ఆ ‘కాలుష్యం’ తొలగిపోదు.
 
‘‘సరికొత్తగా దేశంలో ప్రవేశపెట్టబోతున్న వస్తు సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్-జీఎస్‌టీ) విధింపు రేటు వ్యవస్థ క్రమంగా చాపకింద నీరులా పాకి, జాంబవంతుడి అంగలతో విస్తరించి ఇప్పటికే దేశ ప్రజల ఆదా యాల మధ్య పెరిగిపోయిన అసమానతలను మరింత పెంచనుంది.’’
 - ప్రొఫెసర్ అజిత్ రనడే, ప్రసిద్ధ ఆర్థికవేత్త
 
మాటలు నేర్వకపోతే అదొక అవమానంగాను, న్యూనతగాను భావించే వాళ్లు ఈ లోకంలో ఉంటారని ప్రాచీన సామెత. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్న పాలనా వ్యవస్థ నిజానిజాల మధ్య తేడాను గమనించలేనంత స్థాయికి ఎదిగిపోయిందా? లేక ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం. ఎఫ్. లాంటి అమెరికా అనుబంధ సంస్థలు ప్రవేశపెట్టించిన ప్రజా వ్యతిరేక సంస్కరణల స్వరూప స్వభావాలు ఆయనకు తెలియకనా? లేదా తెలిసి తెలిసే బీజేపీ-ఎన్డీఏ కూటమి ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్-యూపీఏ పాల కపక్షం విదేశాల నుంచి ఎరువు తెచ్చుకున్న ఈ జీఎస్‌టీ పన్నుల వ్యవస్థను బిల్లుగా ప్రవేశపెట్టినప్పుడు వారు ఎందుకు వ్యతికేకించాల్సి వచ్చింది? ఇప్పుడు అదే బిల్లును దుమ్ముదులిపి స్వల్ప మార్పులతో తిరిగి వారే ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చింది? ఈ ప్రశ్నకు మోదీ ప్రధానిగా ఉన్న పాలకపక్షం సూటిగా సమాధానం చెప్పగల స్థితిలో లేదు. పైగా ఫెడరల్ వ్యవస్థ  చట్రంలోని  రాష్ట్రాల స్వయం నిర్ణయాధికార స్థాయిని కుంచింప జేస్తూ మోదీ ప్రభుత్వం సర్వాంతర్యామిగా ఎందుకు మారవలసి వచ్చింది? ఈ ప్రశ్నకూ అది సమాధానం చెప్పగల స్థితిలో లేదు.
 
అమెరికానే విప్పగల ‘పన్ను’ గుట్టు
కానీ ఈ ప్రశ్నకు సమాధానం అమెరికా నుంచి అందుతోంది. ప్రపంచ పెట్టు బడిదారీ వ్యవ స్థకు నాయక స్థానంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఒబామా మన జీఎస్‌టీ బిల్లుకు పూర్తి మద్దతు తెలుపుతూ మోదీని అభినందించారు. ప్రపంచ బ్యాంకు ద్వారా భారతదేశంపై రుద్దించిన ప్రజా వ్యతిరేక సంస్క రణలను అమెరికా అటు కాంగ్రెస్-యూపీఏ కూటమిచేత, ఇటు బీజేపీ పాలకవర్గం చేత కూడా జయప్రదంగా మింగించగలుగుతోంది. కనుకనే తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఒబామా భారత్‌లో మోదీ సర్కారు బ్యాంకు ‘సంస్కరణ’లను మరింత శరవేగంగా అమలు జరుపు తున్నందుకు,
 
‘ఆర్థిక సంస్కరణల ప్రగతి’ని నిలబెడుతున్నందుకు కితాబులు కురిపించారు. ఈ జీఎస్‌టీ ఫలితంగా ‘ఇండియాలో ఆర్థికరంగ కార్యకలాపా లకు అనూహ్యమైన అవకాశం కల్గుతుంద’ని కూడా చెప్పారు. ‘లాభం లేనిదే వ్యాపారి వరదన పోడం’టారు. మోదీ కేవలం గత రెండేళ్లలో ఒబామాను ఎనిమిదిసార్లు కలుసుకున్నారు! బీజేపీ కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి అధికార పక్షమైన కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఇదే జీఎస్‌టీ బిల్లును, బీజేపీ అధికారంలో పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నిరాకరించవలసి వచ్చింది? ఈ రహస్యం వెనుక ఉన్నది విదేశీ ప్రత్యక్ష గుత్త పెట్టుబడులూ, వాటికి అమెరికా పాలక వ్యవస్థలేనని మరచి పోరాదు.
 
అసలు ఈ జీఎస్‌టీ వ్యవస్థకు మూల విరాట్టు యూరప్. అందులోనూ మొట్టమొదట అన్నిరకాల పరోక్ష పన్నులను ఒక తాటిపైకి తెచ్చి ‘ఏకీకృత పన్ను రేటు’ వ్యవస్థ రూపంలో ఈ జీఎస్‌టీని తొలుత ప్రవేశపెట్టిన ఫ్రాన్స్. కానీ ఈ జీఎస్‌టీ కాలక్రమంలో రూపం మారిన పరోక్ష పన్నుల వ్యవస్థగానే స్థిరపడిపోయింది. ఏకీకృత భారీ పన్ను రేటు వ్యవస్థగానే ఉండిపోయింది. ఫ్రాన్స్, అమెరికాల్లోని పేద, ధనిక వర్గాల మధ్య ఆదాయాల వ్యత్యాసాలు తగ్గడానికి ఈ జీఎస్‌టీ తోడ్పడలేదు.
 
ఫెడరలిజానికి చేటన్న నోరే...
ఈ పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థల్లో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజా బాహుళ్యంపైన పరోక్ష పన్నులు నానాటికీ పెరుగుతుంటాయి, కోటీశ్వరులు, మహా కోటీశ్వరులపై ప్రత్యక్ష పన్నులు తగ్గుతూ ఉంటాయి. గతంలో గుజ రాత్ ముఖ్యమంత్రిగా ఉండగా మోదీ, బీజేపీ ఈ జీఎస్‌టీ పన్ను ఫెడరల్ వ్యవస్థ అనే భావననే కలుషితం చేసిందని విమర్శించారని మరచిపోరాదు. ఇప్పుడు పాలకులు ‘గొంతు’ మార్చుకున్నా వ్యాపిస్తున్న ఆ ‘కాలుష్యం’ అంత తేలిగ్గా తొలగిపోదు.
 
బళ్లు ఓడలు కాకపోవచ్చుగానీ, ఓడలు మాత్రం బళ్లు కాజాలవు. బహుశా అందుకే తమిళనాడు, కేరళ, బెంగాల్ రాష్ట్రాలు స్థానిక పన్నులను కొన్నింటిని కేంద్రానికి ధారాదత్తం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ జీఎస్‌టీ రేటును ఫ్రాన్స్ ఎన్నిసార్లు పెంచుతూ పోయిందో లెక్కలేదు. ఆదిలో 10 శాతంగా ఉన్న జీఎస్‌టీ రేటును 25 శాతానికి, ఆ పైన 35 శాతానికి మరి ఆపైన 40 శాతానికి పెంచుకుంటూ పోయిందని అంచనా. మన దేశంలో ప్రవేశపెడుతున్న జీఎస్‌టీ రేటు ఇప్పటికింకా నిర్ధారణ కాలేదు. 22 శాతంగా మొదట చూపినా, 20 లేదా 18 శాతానికైనా కుదించాలన్న ‘ఆలోచన’ కూడా బీజప్రాయంగా ఉంది.
 
కాబట్టి పాలకుల అవకాశవాదం ఏ పరిస్థితులకు దారి తీస్తుందో చెప్పలేం. స్థానిక పరిస్థితులను బట్టి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో ‘గాలివాటు’ ఎటువైపు మొగ్గుతుందో తెలియని అనూహ్య పరిస్థితి. ఇది మోదీ ప్రభుత్వం చెబుతున్నట్లు ‘సహకార ఫెడరలిజం’ కాదు. ‘ఏకీకృత పన్ను’ పేరిట సాగబోతున్న వ్యవస్థీకృత దోపిడీ. సామాన్యుల ప్రత్యక్ష బాధలకు సాక్షులు వేరే ఉండరు. ఈ సత్యం మన దేశంలో గత 70 ఏళ్లలోనూ ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వ్యవస్థ ద్వారా ప్రయోజనం పొందిన వారి సంఖ్యను గమనిస్తే అర్థమవుతుంది.
 
1991లో భారత పాలకులు ప్రపంచ బ్యాంకు సంస్కరణ లను తలకెత్తుకున్న తర్వాత గత పాతికేళ్లలోనూ స్వతంత్ర దేశంగా ఇండియా దేశీయ వస్తు తయారీ, వస్తువుల ఎగుమతి రంగాలలో ఆశించిన అభివృద్ధిని సాధించడంలో విఫలమయిందనీ, కోట్లాదిమంది పేదసాదలకు ఎలాంటి కనీస సౌకర్యాలను, ఆహార భద్రతనూ కలిగించలేకపోయిందని ప్రముఖ ఆర్థిక వేత్త,  డాక్టర్ సీపీ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
 
అలాగే, స్వల్పకాలిక ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర పాలక పక్షాలు పలు రాయితీలతో విదేశీ గుత్త కంపెనీల ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించినా, దీర్ఘకాలంలో భారత ఆర్థిక వ్యవస్థకు దుష్ఫలితాలు తప్పవని ప్రొఫెసర్ అలెక్సీ ఎం. థామస్ (అజిమ్‌ప్రేమ్‌జీ యూనివర్సిటీ) హెచ్చరిస్తున్నారు. అందుకు తగినట్టుగానే వర్తక వాణిజ్యాన్ని అమెరికా-యూరప్ సంపన్న దేశాల ప్రయోజనాలకు అనుకూలంగా మలిచే డబ్ల్యూటీవో సంస్థ ద్వారా ఇండియా వంటి వర్ధమాన దేశాల ఎగుమతులను పెరగనివ్వకుండా ఆంక్షలు పెట్టి అడ్డుకోవటం జరుగుతోంది.
 
ఎందుకని? 1930ల నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి కారణమైన అమెరికా 2007 తీవ్ర ఆర్థిక మాంద్యంతో కకా వికలమై ఇప్పటికీ తేరుకోలేకుండా ఉంది. కానీ ప్రపంచాధిపత్యాన్ని, ‘టైరిజం’ సాకుతో తన విస్తరణ వాదాన్ని, దురాక్రమణ చర్యలనూ అదుపు చేసు కోలేని అమెరికా పరిస్థితి ‘చింత చచ్చిపోతున్నా పులుపు చావలేదన్న’ట్టుగా ఉంది.

దాన్ని ఒబామా బింకంగా ఎలా ప్రకటించారో చూడండి: ‘‘ఈ పరిస్థి తుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నిబంధనలను మనమే (అమెరికా) రూపొం దించాల్సి ఉంది. మన ఆర్థిక వ్యవస్థ ఇంకా ప్రపంచాన్ని శాసించగల స్థానంలో ఇప్పటికీ ఉన్నందున ఇప్పుడే, ఈ రోజునే మనం శాసించాలి. అదీ, మన షరతుల మీదనే జరగాలి. ప్రపంచ వర్తక వ్యాపార నిబంధనలను ఇప్ప టికిప్పుడు మనం శాసించక పోతే, ఏం జరుగుతుందో ఊహించండి. దూసు కువస్తున్న చైనాయే ఆ నిబంధనలను రూపొందించి శాసిస్తుంది సుమా’’ (2015, మేలో ఓరగాన్‌లోని ‘నైక్’ ఫ్యాక్టరీ కార్మికుల సభలో ప్రసంగం).
 
 అసలు ‘పేటెంటు’ ఎన్డీఏదే
అలాగే, భారతదేశంలో జాతీయోత్పత్తుల సగటు విలువకు తగ్గట్టుగా ప్రత్యక్ష పన్నుల రేటు విధింపు లేదు. ఇలా సంపన్న వర్గాలపైన ప్రత్యక్ష పన్నుల నిష్పత్తి క్రమంగా తగ్గిపోవడానికి కారణం ప్రభుత్వ రాజకీయ ప్రయోజనా లేనని మరో సుప్రసిద్ధ ఆర్థికవేత్త ప్రొఫెసర్ జయతీ ఘోష్ (జేఎన్‌యూ, ఢిల్లీ: మే 4, 2016) స్పష్టం చేస్తున్నారు: ‘‘పన్నులు చెల్లిస్తున్నది తామొక్కరమేననే భావన సంపన్న వర్గాల్లోనూ, మధ్యతరగతి వారిలోనూ ఉంది. కానీ అది సరికాదు.

నిజానికి పన్నుల భారం ఎక్కువగా మోసేది ధనిక వర్గాల కన్నా పేద వర్గాలే’’నని జయతీ రుజువు చేశారు. 2015-16లో సంపన్నులపై ప్రత్యక్ష పన్నులు 6.7 శాతం మాత్రమే పెరగగా... పేద, మధ్య తరగతి వారిపై పరోక్ష పన్నులు 31 శాతం పెరిగాయి. అంటే, పేద వర్గాలే పరోక్ష పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వ రాబడిని (రెవెన్యూ) కూడబెడుతున్నా రన్నమాట. ఇంతకూ అసలు రహస్యమేమంటే- వస్తు సేవలపై ఏకీకృత పన్నును కేంద్ర స్థాయిలో (జీఎస్‌టీ) విధించాలన్న ప్రతిపాదన తొలి ప్రతి పాదకులు 2000లో వాజపేయి ప్రధానిగా ఉన్న బీజేపీ-ఎన్డీఏ కూటమే.

రేటు నిర్ధారణకు పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన అసిమ్ దాస్ గుప్తా అధ్యక్షతన ఒక సాధికార కమిటీ కూడా అప్పుడే ఏర్పడింది. ఆ దరిమిలానే 2011లో యూపీఏ పాలకులు జీఎస్‌టీ నమూనా రూపకల్పనకు ఆదేశించి రాజ్యాంగ సవరణ బిల్లును సాధ్యం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ బిల్లును నాడు పెక్కు రాష్ట్రాలు తోసిపుచ్చాయని మరువరాదు.

ప్రస్తుతానికి పాలకవర్గాలు వినియోగవస్తు వ్యామోహ సంస్కృతిని పనిగట్టు కుని ‘పక్కవాటు’ ఎత్తుగడగా యువతలో ప్రోత్సహిస్తున్నాయి. కావున సమా చార సాంకేతిక వ్యవస్థకు బందీలైపోయిన యువత నుంచి ప్రజా సమ స్యలపైన, వారి బాధలపైన సకాలంలో స్పందించగల చైతన్యాన్ని మనం ఇప్పట్లో ఆశించలేము. అంతవరకూ, జీఎస్‌టీ లాంటి ‘‘అశ్వమేధ యాగాలు’’ ప్రజలపై స్వారీ చేస్తూనే ఉంటాయి.

 

ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
 

మరిన్ని వార్తలు