పుడమి గుండెల మీద కొలిమి

4 Apr, 2017 00:29 IST|Sakshi
పుడమి గుండెల మీద కొలిమి
రెండో మాట
తాజాగా వెలువడిన అనేక అంతర్జాతీయ వాతావరణ పరిశోధనలలో నిపుణులు మరో సత్యాన్ని బయటపెట్టారు. కొలిమిని మరిపిస్తున్న వేసవి వేడిమితో, వడగాడ్పులతో ప్రపంచవ్యాప్తంగా కకావికలవుతున్న 44 ప్రధాన మండలాలలో ఉన్న నగరాలలో హైదరాబాద్‌ ఒకటని ఆ పరిశోధనలు వెల్లడించాయి. ‘ఎల్‌–నినో’ మన నెత్తిన తాండవించే సమయంలో, తాపాన్ని రెట్టించే వడగాడ్పులకు భారీ సంఖ్యలో జనాలు, ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు గురి కావచ్చునని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
 
రాక్షస సంహారంలో ఎంతో సాహసవంతులుగా కనిపించే మన దేవుళ్లు, సూర్యతాపం దగ్గర మాత్రం గడగడలాడిపోయారు. ఎర్రన ‘హరివంశం’ ఇదే చెబుతోంది. మూడేళ్లు చండప్రచండంగా ఎండలు కాసినా చలించకూడని త్రిమూర్తులు నెలవులు తప్పి ఏం చేశారో ఆయన వర్ణించాడు. అంతటి విష్ణు మూర్తి కూడా వేసవి తాపానికి పాలసంద్రంలో దూకి ఒంటిని చల్లబరుచు కున్నాడట. శివుడు కొండల చాటుకు వెళ్లి సేద తీరాడట. చతుర్ముఖ బ్రహ్మ చల్లటి పద్మాలను ఆశ్రయించాడట. మరో కవీశ్వరుడు సారంగి తమ్మయ్య కైలాసంలో ఉన్నా ఈశ్వరుడు పడిన బాధను చిత్రించాడు. చల్లగా ఉండే కైలాసగిరిని వదిలి శివుడు వేసవి తాపాన్ని చల్లార్చుకోవడానికి భూమ్మీద చెట్ల నీడలను (వటమూల తలమూల) ఆశ్రయించవలసి వచ్చిందిట. వేసవి తాపం దేవతలనే ఆ విధంగా గంగ వెర్రులెత్తిస్తే, పూట బత్తెం, పుల్ల వెలుగుగా గడిపే దరిద్ర నారాయణుల బాధను వర్ణించడం ఎవరికి సాధ్యం? 
 
రాళ్లను కరిగించే, ఊళ్లను కాగించే వేసవి తాపోద్ధతి ఈ ఏడాది ఫిబ్రవరి నెల పూర్తి కాకుండానే విజృంభించి, మార్చిలో హద్దు మీరి, ఏప్రిల్‌ తొలివారం కూడా గడవకుండానే ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈ ఘడియలలోనే అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తలు పిడుగులాంటి వార్తను మోసుకు వచ్చారు. అనిశ్చితమైన సమాచారంతోనే దేశీయ శాస్త్రవేత్తలు వేసవి తాపం గురించి అంచనాలు వేస్తున్నారు. వాతావరణం గురించి వారు వేస్తున్న అంచ నాలు (జోస్యాలు కావు) ప్రకృతి చిత్రాల మాదిరిగానే తారుమారవుతు న్నాయి. అదొక్కటే కాదు. ఈ ఏడాది జూలైలో మరో ఉపద్రవం ముంచుకు రాబోతోందని శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరిస్తున్నారు.
 
చంద్రుడి మీద కాలు మోపిన తరువాత మానవుడు జాంబవంతుడి అంగలతో రోదసీయాత్రలను, దూర గ్రహయాత్రలను సాగించే యత్నం ఆరంభించాడు. సరికొత్త వైజ్ఞానిక విజయాలతో సూర్యుడి నుంచి నాలుగో గ్రహమైన అంగారకుడి (మార్స్‌) మీద సాగుకు ఉన్న సానుకూలత ఎంతో ధ్రువపరిచేందుకూ పరిశోధనలు వేగవంతమవుతున్నాయి. ఇలాంటి ప్రయో గాలను (బంగాళదుంపలు పండించడం) ఏండీస్‌ పర్వత శ్రేణులలో ఏడు వేల ఏళ్ల నాడే జరిగినట్టు మానవుడు నిరూపించాడు. ఈ నేపథ్యంలో మార్స్‌ మీద ఆ ప్రయోగానికి పునాదులు పడ్డాయి. లీమా (పెరూ) ఊసర క్షేత్రాలలో బొగ్గు పులుసు వాయువు (కార్బన్‌ డయాక్సైడ్‌) దట్టంగా పేరుకున్న నేలలో ఈ విజయం సాధ్యమైందని శాస్త్ర వేత్తలు మొన్న మార్చి 29న ప్రకటించారు.
 
అంటే, సుదూర గ్రహరాశుల గురించి సాగిస్తున్న పరిశోధనలలో ఫల వంతమైన ఫలితాలను సాధిస్తున్న తరుణమిది. కానీ వాతావరణానికి సంబం ధించిన అంచనాలు ఇతమిత్థంగా లేకపోవడం మానవాళికి పెద్ద లోటు. 
 
వాతావరణ నివేదికలతో తంటా
భారత వాతావరణ శాఖ ఇటీవల వెల్లడించిన జోస్యం (అంచనా) గురించి ఇక్కడ చెప్పుకోవాలి. వేసవి తాపం 42 డిగ్రీలకు పెరుగుతుందనీ, తరువాత తగ్గి 40–41 డిగ్రీల మధ్య స్థిరపడుతుందని ఆ శాఖ వెల్లడించింది. నిరుడు ఏప్రిల్‌ 12వ తేదీ దాకా ౖహె దరాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తరువాత 43 డిగ్రీలకు చేరింది. అంటే ఐదేళ్ల కాలపరిమితిని తీసుకుంటే వేసవి తాపం ఏటా పెరిగిపోతున్న వాస్తవం అర్థమవుతుంది. నిరుడు ఏప్రిల్‌ 12కు రెండు రోజుల ముందే రాయలసీమలో సాధారణ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ తాపశక్తి నమోదు కావచ్చునని ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వెంటనే వడగాడ్పులు ఉండవని చెప్పింది. ఈ జోస్యమూ వమ్మయింది. రాష్ట్రంలో ఇంకొన్ని చోట్ల 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. హైదరాబాద్‌లో ఎన్నడూ ఎరగని సాధారణ ఉష్ణోగ్రత మొత్తం రాష్ట్రంలోనే 4 డిగ్రీలు అదనంగా నమోదైంది. ఇక ఈ వారంలో (1–4–17 నుంచి) వేసవి తాపం 48 డిగ్రీలకు పెరిగిపోవచ్చునని ప్రైవేట్‌ ప్రొవైడర్ల అంచనా.
 
అస్థిమితమైన అంచనాల వల్ల గానీ, వాతావరణంలో వేగంగా వచ్చిన మార్పుల వల్లగానీ, తీవ్ర వేసవి తాపం వల్ల గానీ లేదా ఎల్‌–నినో అనే వాతావరణ వ్యవస్థ ప్రభావంతో గానీ దక్షిణాది రాష్ట్రాలలో జలాశయా లలో నీటి నిల్వలు మార్చి 25 నాటికే 16 శాతానికి పడిపోయాయి. ఇదే రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడులలో ఉన్న 31 జలాశయాల పూర్తి సామర్థ్యం 51.59 శతకోటి ఘనపుటడుగులు. ఆ నీటి నిల్వ ప్రస్తుతం 8 శతకోటి ఘనపుటడుగు లకు తగ్గింది. రైతాంగం కలవరానికి మూలం ఇదే. దేశంలో చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఉత్తర, మధ్య భారత రాష్ట్రాలు అట్టుడికినట్టు ఉడుకుతున్నాయి. మరణాల సంఖ్య పెరిగిపోతోంది. యూపీ, గుజరాత్, దక్షిణ హరియాణా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు బెంగాల్, మహారాష్ట్రలో కూడా వడగాలులు స్వైర విహారం చేస్తున్నాయి. 
 
భగ్గుమంటున్న భాగ్య నగరం
తాజాగా వెలువడిన అనేక అంతర్జాతీయ వాతావరణ పరిశోధనలలో నిపు ణులు మరో సత్యాన్ని బయటపెట్టారు. కొలిమిని మరిపిస్తున్న వేసవి వేడి మితో, వడగాడ్పులతో ప్రపంచ వ్యాప్తంగా కకావికలవుతున్న  44 ప్రధాన మండలాలలో ఉన్న నగరాలలో హైదరాబాద్‌ ఒకటని ఆ పరిశోధనలు  (30.3.17) వెల్లడించాయి. శరవేగాన జరుగుతున్న నగరీకరణ, పచ్చని పరి సరాలను అంతే వేగంగా నాశనం చేయడం ఇందుకు కారణమని కూడా అవి స్పష్టం చేశాయి. అంతేకాదు, అమిత ఉష్ణోగ్రతలకు, కరవు కాటకాలకూ దారి తీసే ‘ఎల్‌–నినో’ అనే వాతావరణ వ్యవస్థ మన నెత్తిన తాండవించే సమ యంలో, తాపాన్ని రెట్టించే వడగాడ్పులకు భారీ సంఖ్యలో జనాలు, ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు గురి కావచ్చునని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
 
ఇలాంటి వాతావరణ పరిస్థితుల కారణంగానే 1992– 2015 సంవత్స రాల మధ్య దేశవ్యాప్తంగా 22,562 మంది చనిపోయారని ‘జాతీయ విపత్తుల నివారణ సంస్థ’ నిర్ధారించింది. 2015లో ఒక్క ఆంధ్రా, తెలంగాణల్లో 2,500 మంది వడగాడ్పులకు మరణించారు. ఈ ఏడాది కూడా సగటున దేశ వ్యాప్తంగా 42 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివిధ అంచనాలను బట్టి తెలుస్తోంది. మొత్తం వర్షపాతం కన్నా ఆరు రెట్లు తక్కువ పడుతుందని ఊహిస్తున్నారు. జూలై వర్షపాతాన్ని నిరోధించే దిశగానే ప్రకృ  తిలో ‘ఎల్‌–నినో’ వ్యవస్త కదలవచ్చని శాస్త్రవేత్తల ఆందోళన. ఈసారి తొలకరి వర్షాలు కూడా వాయిదా పడవచ్చునని అంచనా.
 
కరుగుతున్న మంచు, పెరుగుతున్న వేడి
ఈ వేసవి వాతావరణంలో ఇంతటి పెను మార్పులకు భూఖండపు ధ్రువ ప్రాంత వాతావరణం పెను మార్పులకు గురికావడమే ప్రధాన కారణం. ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంత మంచుకొండలు తొలిసారి వేగంగా కరిగి పోతు న్నాయి. 38 సంవత్సరాలుగా ఉపగ్రహాలు సేకరించిన రికార్డుల ప్రకారం అంటార్కిటిక్‌ ప్రాంతాన్ని దట్టంగా కప్పేసిన సముద్రపు మంచు గుట్టలు కరిగిపోయి కనిష్ట ప్రమాణంలో కనపడీ కనపడనట్టుగా ఉన్నాయనీ, ఈ పరిణామం ఆందోళనకరమనీ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏనాడూ ఆర్కి టిక్‌ సముద్రంలో ఇంత కనిష్ట స్థాయిలో మంచుగుట్టలు ఉండటం చూడ లేదని పరిశోధకుల భావన. సాధారణంగా మార్చి నెలలో ఆర్కిటిక్‌ మంచు కంటికి కానరానంత దట్టంగా అలుముకుని ఉంటుంది.
 
అంటే 1981–2010 నాటికన్నా ఈ ఏడాది ఆర్కిటిక్‌ సముద్రపు మంచు గుట్టల పరిమాణం వేగంగా (ప్రతి పదేళ్లకు దాదాపు 3 శాతం చొప్పున) తరిగిపోతోందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ దృష్ట్యానే  2017లో వర్షాలు సాధారణ స్థాయికన్నా తగ్గిపోతాయని వాతావరణ పరిశోధ కులు చెబుతున్నారు. అంచనాలలో 5 శాతం మేర జోస్యం తప్పుతుందను కున్నా జూన్‌–సెప్టెంబర్‌ వరకు వర్షాలు 95 శాతం (887 మిల్లీమీటర్లు) పడ వచ్చునని ఇప్పటికీ ఉన్న అభిప్రాయం. అదే సమయంలో ఉష్ణోగ్రతలను తీవ్రతరం చేస్తూ దుర్భిక్ష పరిస్థితులకు దారితీసే ‘ఎల్‌–నినో’ వాతావరణ వ్యవస్థ మాత్రం జూలై నుంచే వర్షాగమనాన్ని అటకాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ‘స్కైమెట్‌’ అధినేత జతీన్‌ సింగ్‌ అంచనా. వర్ష రుతువు ద్వితీయార్థంలో మాత్రం కొంత మేర వర్షపాతానికి అనుకూలంగా ఉండ వచ్చునని కూడా చెబుతున్నారు. మొత్తంమీద ఎల్‌–నినో తీవ్రత 60 శాతానికి మించే ఉండవచ్చునని శాస్త్ర వేత్తలు నిర్ధారిస్తున్నారు. ఇదే జరిగితే వర్షపాతం గత నాలుగేళ్లలో నామ మాత్రంగానే నమోదు కావటం ఇది మూడవసారి అవుతుందనీ వాతావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం.
 
ప్రకృతితో పోరాటమూ పాఠమే
ఇలాంటి ఒడిదుడుకులలోనే మానవుడి వైజ్ఞానిక సంపద తమస్సును చీల్చుకుని మనస్సును చిత్రికపట్టి సునిశితం చేసుకుంటుంది. ఇతర ఖండాలలోని శాస్త్రవేత్తలు ప్రకృతి వైపరీత్యాలను గురించి చేసే అన్వేషణతో పోల్చితే నిరం తరం సునామీలను, టార్నాడోలను, టార్పీడోలను చవిచూస్తూ, అపార జన నష్టానికి, ఆస్తి నష్టానికి గురవుతున్న జపాన్‌ను ఉపద్రవాల నుంచి బయ టపడవేయటానికి చేస్తున్న శాస్త్ర, సాంకేతిక ప్రయోగాలు ఎన్నో రెట్లు ప్రయో జనకరంగా కన్పిస్తున్నాయి. ఉదాహరణకు భీకరమైన ఉప్పెనలు, క్షణాలలో విరుచుకుపడే సునామీల ఉధృతిని, అది కలిగించే నష్టాల్నీ గణనీయంగా నియంత్రించేందుకు జపాన్‌ నిత్య ప్రయోగాలలో నిమగ్నమై ఉంది.
 
ప్రకృతి విలయ తాండవానికి పరిష్కారంగా, ఇటీవల విద్యుదుత్పా దనకు వనరుల కొరత ఉన్న జపాన్‌ ఆధారపడిన న్యూక్లియర్‌ రియాక్టర్‌ సునామీ దాడివల్ల విధ్వంసానికి గురికాగా, దేశ ఇంధన సమస్య పరిష్కారా నికి సిద్ధమైంది. ఈ పరిష్కారంలో భాగమే అత్యంత ఆధునిక పద్ధతిలో దేశవాళీ సాంకేతిక పరి జ్ఞానాన్ని వినియోగించుకుని సునామీ లాంటి రాక్షస వైపరీత్యాన్ని కూడా తట్టుకుని నిలబడగల ఒక ‘టర్బైన్‌’ను రూపొందించింది జపాన్‌. కొన్ని వైజ్ఞానిక సత్యాలను ఏనాడో ఊహించినవాడు శ్రీశ్రీ. ‘‘చంద్రుడి ఎకరాల్లో/చుక్కల విత్తనాలు నాటే/శుభ మహోత్సాహాన్ని చూడ గల’’శ్రీశ్రీ, మానవుడు చంద్ర లోకాధినేత కావడానికి ముందే కొన్ని దశాబ్దాల నాడు ఆ పండుగను కవితా రూపంలో ఆవిష్కరించిన ఆశాజీవి. అంతేకాదు ‘ఉత్తర ధ్రువంలో వ్యవసాయం జరిగి తీరుతుంది’ అన్నవాడూ కవే.
ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in
మరిన్ని వార్తలు