కరెన్సీ ఊయల్లో కవలలు

23 Aug, 2016 00:48 IST|Sakshi
కరెన్సీ ఊయల్లో కవలలు

రెండో మాట
రాజన్‌ తొలగినా, ఉర్జిత్‌ వచ్చినా; రేపు మరొకరు వచ్చినా ఒక్కటే. అందుకే కూరగాయలు, పప్పులు, ఉప్పులు సామాన్య ప్రజలు వినియోగించే ఇతర సాధారణ వస్తువుల చిల్లర ధరలు పెరిగినా, రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ (ద్రవ్యోల్బణం) 4 శాతానికి మించకుండా చూడమని రిజర్వు బ్యాంకుకు మోదీ ఆదేశాలు జారీ చేసినా సామాన్య వినిమయ ధరల సూచీ 6.07 శాతానికి పెరిగిపోయింది. మోదీ ఉర్జిత్‌ పటేల్‌ను రిజర్వు బ్యాంకు గవర్నర్‌ పదవికి తీసుకు రావడం గుజరాత్‌ శాసనసభ ఎన్నికల ప్రయోజనాన్ని ఆశించి మాత్రమే.

‘ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ చరిత్రలో మున్నెన్నడూ లేనంతగా వడ్డీ రేట్లకు భారీ సింహాసనం లభించింది. ఈ వడ్డీరేట్లు వృద్ధి క్షయాలను ఏ ఇతర గణాంకాలకన్నా శ్రద్ధగా పరిశీలించడం జరుగుతోంది. ఈ రేట్ల ఆధారంగానే ట్రిలియన్, బిలియన్‌ డాలర్ల కొద్దీ ప్రపంచ మార్కెట్‌లలో దేశాలను వాటి ఆర్థిక వ్యవస్థలను పణంగాపెట్టి జూదం ఆడుకుంటున్నారు. సామ్రాజ్య పెట్టుబడి వ్యవస్థ నెలకొల్పి కొనసాగిస్తున్న ఈ పరాన్నభుక్కుల వ్యవస్థే నేడు రంగంలో ఉందని మరచిపోరాదు. ఈ దోపిడీకాండ ఎలా అమలు జరుగుతోంది? ప్రపం చంలో జూదగొండి, స్పెక్యులేటివ్‌ మార్కెట్లపై ఆధారపడి భారీ గుత్త పెట్టుబడి కంపెనీలు, బహుళ జాతి సంస్థలూ ఎలా లాభాలు తీస్తున్నాయి? నిజానికి వీటికి దేశాల ఉత్పత్తి క్రమంలో, ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో, ప్రజా ప్రయోజనా లతో, నూతన ఆవిష్కరణలతో ఉత్పత్తి శక్తుల అభివృద్ధితో ప్రజా బాహుళ్యం జీవన ప్రమాణాలను పెంచడంలోనూ ప్రత్యక్ష సంబంధం లేకుండా వడ్డీరేట్ల జూదం ద్వారా లాభాల వేటలో భాగస్వాములవుతున్నాయి. స్టాక్‌ మార్కెట్లను జూదగొండుల కేంద్రాలుగా మార్చారు. సాధారణ సంతలలో జరగవలసిన క్రయవిక్రయాలను స్టాక్‌మార్కెట్‌ – షేర్‌ మార్కెట్‌లోనికి నెట్టేశారు.’

ఆర్థికవేత్త, ఆర్థిక వ్యవహారాల పరిశోధకుడు డాక్టర్‌ రాహుల్‌ బర్మన్, ప్రశాం త్‌కుమార్, విపిన్‌ నెగీ ఆధ్వర్యంలోని అధ్యయన బృందం ఇరవయ్యేళ్ల క్రితం ఇచ్చిన నివేదికలోని వ్యాఖ్యలు ఇవి. ఇది రెండు దశాబ్దాల నాటి నివేదిక కావచ్చు. కానీ అందులోని వాస్తవాలకు అధికార స్థాయి ప్రతిరూపాలుగానే ఇద్దరు ప్రముఖులు ఇప్పుడు కూడా కనిపిస్తారు. వారే – రిజర్వు బ్యాంక్‌ గవ ర్నర్‌గా పదవీ విరమణ చేయబోతున్న రఘురామ్‌ రాజన్, ఆయన వారసునిగా నియమితులైన ఉర్జిత్‌ పటేల్‌.
ఆ తానులో ముక్క
1996–97 కాలంలో కొన్ని తూర్పు ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలను చుట్ట బెట్టిన ఆర్థిక సంక్షోభం క్రమంగా (2007–08)అమెరికాకు కూడా వ్యాపిం చింది. ఆ సంక్షోభం ఆంగ్లో–అమెరికన్‌ పెట్టుబడిదారీ వ్యవస్థ పుణ్యమే. నిజానికి ఆ ఆర్థిక మాంద్యం నుంచి ఇంతవరకు అమెరికా బయటపడలేదు. కానీ ‘రాచపీనుగ తోడు లేకుండా వెళ్లద’న్న సామెత వలె తనపై ఆధారపడిన భారత్‌ వంటి వర్ధమాన దేశాలను కూడా అమెరికా ఆ ఊబిలోకి గుంజింది. ఆర్థిక సంక్షోభ దశను ప్రపంచీకరించడం – దీని ఫలితమే. ఆ సంక్షోభాన్ని తిలాపాపం తలా పిడికెడు పంచింది. ఆ క్రమంలోనే ఈ పాపాన్ని వర్ధమాన దేశాల పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలకు సారథ్యం వహిస్తున్న పాలకులూ, బ్యాంకుల గవర్నర్లూ పంచుకోక తప్పలేదు. ఈ పరిణామానికి మూలం 1947లో అమెరికా ఆధ్వర్యంలో జరిగిన బ్రెటెన్‌వుడ్స్‌ గోష్టి చేసిన నిర్ణయా లలో దాగి ఉందన్న వాస్తవం విస్మరించరాదు. ఈ గోష్టి సంతానమే ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌). అమెరికా పెత్తనం కింద పని చేసే ఈ రెండు సంస్థలలో తర్ఫీదు పొంది, వాటిలో కీలక పదవులు అనుభవించినవారిలో రఘురామ్‌రాజన్, ఉర్జిత్‌ పటేల్‌ కూడా ఉన్నారు. బిమల్‌ జలాన్, రాకేశ్‌ మోహన్, రంగరాజన్‌ కూడా ఆ కోవలోనే వస్తారు. ఈ తీరులో ఎదిగి వచ్చిన ఆర్థికవేత్తలు, సలహాదారులు ఆ రెండు సంస్థలకు అప్పగించిన బాధ్యతలను జవదాటి స్వతంత్రంగా వ్యవహరించిన దాఖ లాలు దాదాపు లేవు. ఆ సంస్థలకు అధికార స్థాయిలో వ్యవహరించి భారీ వడ్డీ రేట్ల మీద వర్ధమాన దేశాలను ఊబిలోకి దించి అధికాధిక లాభాలు గుంజి, వాటిని వడ్డీలకు చక్రవడ్డీలకు తిప్పడాన్ని జీర్ణించుకోలేక పదవుల నుంచి తప్పుకున్న  డేవిసన్‌ ఎల్‌ బుధు (గ్రెనెడా), జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ (అమెరికా) వంటి వారు ఆ కోవలో తప్పపుట్టిన వారు. అమెరికా ఆధ్వర్యంలోని రెండు ప్రపంచ ‘ఫండింగ్‌’ సంస్థలు పనిచేస్తున్న తీరుతెన్నులను మొదటిసారి ప్రపంచానికి వెల్లడించారు ఈ ఇద్దరూ. ఇందులో బుధూ ప్రపంచ బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. బ్యాంక్‌ సంస్కరణల ఫలితంగా తన చేతులు రక్తసిక్తమై, మలిన మైనాయని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కొన్ని దేశాల రాజ్యాంగాల నుంచి హక్కులకు ఏ విధంగా బ్యాంకు ఉద్వాసన చెప్పించినదీ మరొకరు వెల్ల డించారు. అయినా మన పాలకులు (యూపీఏ, ఎన్డీఏ) గుణపాఠం నేర్వ లేదు. నేర్చుకోరు కూడా.
రాజన్‌ పోయి ఉర్జిత్‌ వచ్చే ఢాం ఢాం
రఘురామ్‌రాజన్‌కు అప్పగించిన బాధ్యత – సంక్షోభకాలంలో బ్యాంకు వడ్డీ రేట్లు పెరగకుండా అదుపులో ఉంచి, ద్రవ్యోల్బణానికీ, ధరల పెరుగుదలకూ ఆస్కారం లేకుండా చూడడం. కానీ ఆ రేట్ల తగ్గుదల, పెరుగుదల మోదీ అభిప్రాయంపైనా, రిజర్వుబ్యాంక్‌ గవర్నర్ల తాఖీదులపైన ఆధారపడి ఉండదు. ఎందుకని? అదంతా కంట్రోలు వస్తువుల ధరల నియంత్రణ, వడ్డీరేట్ల అదుపు బడుగు, వర్ధమాన దేశాల మార్కెట్లను అమెరికా, యూరప్‌ దేశాల ఎగుమతులతో గుప్పించి మన దేశీయ సంతలను దెబ్బతీసే వ్యూహం మీద ఆధారపడి ఉంటుంది. ఆ వ్యూహాన్ని దెబ్బతీయగల సత్తా స్వతంత్ర ఆర్థిక విధానాల రూపకల్పన మీద, ప్రతి వ్యూహంపైన ఆధారపడి ఉంటుందని గుర్తించాలి. అమెరికాలోని ‘వాషింగ్టన్‌ (కాన్సెన్సెస్‌) వ్యవస్థ, ‘చికాగో స్కూలు’ వ్యూహాలకు బద్ధమై మాత్రమే మన నిర్ణయాలు గానీ, పోకడలు గానీ ఉంటాయి. అంతవరకు రాజన్‌ తొలగినా, ఉర్జిత్‌ వచ్చినా; రేపు మరొకరు వచ్చినా ఒక్కటే – ఎడం చేయి తీసి పురచేయి పెట్టడం. ఫలితం ఒక్కటే. అందుకే కూరగాయలు, పప్పులు, ఉప్పులు సామాన్య ప్రజలు వినియోగించే ఇతర సాధారణ వస్తువుల చిల్లర ధరలు పెరిగినా, రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ (ద్రవ్యోల్బణం) 4 శాతానికి మించకుండా చూడమని రిజర్వు బ్యాంకుకు మోదీ ఆదేశాలు జారీ చేసినా సామాన్య వినిమయ ధరల సూచీ 6.07 శాతానికి పెరిగిపోయింది. బ్యాంకు గవర్నర్లను దేశ పాలకుడు తన ఇష్టానిష్టాల మీద తొలగించినా, వారి స్థానంలో వేరొకరిని నియ మించినా దేశ, విదేశీ బహుళ జాతి సంస్థలకు విదేశీ ప్రత్యక్ష గుత్త పెట్టు   బడులకు దేశ ఆర్థిక వ్యవస్థ తలుపులు బార్లా తెరిచి పెడుతున్నప్పుడు ఫలితాలు అనుభవించేవారు సంపన్నవర్గాలే గానీ, అసంఖ్యాకంగా ఉండే బడుగు, బలహీన వర్గాలు మాత్రం కాదు.
గుజరాత్‌లో కొన్ని మాసాలలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి మోతుబరి వర్గం పటేళ్లు ఇటీవల పెద్ద స్థాయిలో రిజర్వేషన్ల కోసం ఆందోళనలు చేశారు. మోదీ ఉర్జిత్‌ పటేల్‌ను రిజర్వు బ్యాంకు గవర్నర్‌ పదవికి తీసుకురావడం కూడా అదే ఎన్నికల ప్రయోజనాన్ని ఆశించి మాత్రమే. అందుకే ఇవాళ రూపాయి పెడితే, కష్టపడకుండా రేపు ఉదయానికల్లా అది నాలుగు రూపాయలకు పెరుగుతుందని భ్రమలు సృష్టించే జూదగొండి స్టాక్‌ మార్కెట్టు విశ్లేషకులు... నిన్నటి దాకా రాజన్‌ చర్యలనూ మెచ్చినవారు... ఇవాళ పటేల్‌ నియామకాన్నీ ఆహ్వానిస్తున్నారు. అంటే, ప్రపంచబ్యాంకు ప్రజా వ్యతిరేక ‘సంస్కరణల’ పరిధిలో పాలకులూ, బ్యాంకు ఉప్పు తిన్నందుకు నిరంకుశాధికార వర్గమూ (బ్యూరోక్రాట్లు) ఇమిడి పోయినందున ఎవరు గవర్నర్‌గా వచ్చినా ఒరిగేది లేదు, తరిగేదీ లేదు. ప్రజా ప్రయోజన వ్యతిరేక, జాతీయార్థిక వ్యవస్థ స్వతంత్ర మౌలిక విధానాలకు చేటుతెచ్చే పద్ధతులూ, కుట్రలకూ ఇప్పటికైనా స్వస్తి పలకాలి. బహుశా అందుకేనేమో స్వతంత్ర ఆర్థిక వ్యవస్థపై ‘కలలు’కంటూ ‘‘భారత దేశమా ఎటు నీ ప్రయాణం’ (విధర్‌ ఇండియా) అని ప్రశ్నించుకుని ‘దేశ స్వాతంత్య్రం అనంతరం కూడా విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచే పక్షంలో అది నామమాత్రపు స్వాతంత్య్రం కూడా కాజాలద’ని ప్రకటించిన తొలి ప్రధాని నెహ్రూ శకం అంతరించింది. కొత్తగా భగత్‌సింగ్‌ను భుజా నకెత్తుకున్న బీజేపీ–ఆరెస్సెస్‌ పరివారం,  దేశానికి ‘స్వాతంత్య్రం వచ్చిన తరు వాత కూడా దేశీయ పెట్టుబడివర్గాలూ, విదేశీ పెట్టుబడులూ కలగలిసిపోయే జమిలిగానే ప్రజల్ని పీల్చుకుతింటార’ని హెచ్చరికగా ఆయన వినిపించిన భవిష్య వాణిని మాత్రం నామమాత్రంగా అయినా ప్రస్తావించ లేక పోతు న్నది. ఆ బీజేపీ – ఆరెస్సెస్‌ పరివార్‌ నాయకులలోనే ఒకరైన ఎంపీ డాక్టర్‌ సుబ్రహ్మణ్యస్వామి, పదవీ విరమణలో ఉన్న రాజన్‌ను ‘మానసికంగా పూర్తిస్థాయి భారతీయుడు కాడ’నీ, అమెరికా దేశపు గ్రీన్‌కార్డు సాధించుకున్న నకిలీ భారతీయుడనీ దూషించాడు. అలాగే, ప్రధాని మోదీ ప్రధాన ఆర్థిక సలహాదారైన అరవింద సుబ్రహ్మణ్యాన్ని కూడా ఆ పదవికి తగనివాడని కూడా స్వామి విమర్శించారు. అలాగే అమెరికా మందుల కంపెనీలు ఇండియా మార్కెట్‌లో ప్రవేశించనివ్వకుండా అడ్డుపడుతూ, ప్రపంచ వాణిజ్య సంస్థలో ఇండియాను గుచ్చి గుచ్చి ప్రశ్నించమని అమెరికా ‘చెవులు కొరికాడ’ని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు.
ప్రపంచ బ్యాంకు కనుసన్నలలోనే వడ్డీరేట్లు
ఇండియా ఆర్థిక వ్యవస్థను నిలువుదోపిడీ చేసుకునేందుకు వీలుగా పూర్తి స్థాయిలో విదేశీ గుత్త కంపెనీలను, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను విస్తృతంగా అనుమతిస్తే ఇండియా రేటింగ్‌ను పెంచేస్తామని ప్రముఖ రేటింగ్‌ నిర్ణయ సంస్థ ‘మూడీస్‌’ బాహాటంగా ప్రకటించింది. మన బ్యాంకుల వడ్డీ రేట్లు ఎప్పుడు పెంచాలో, ఎప్పుడు తుంచాలో అమెరికన్‌ రిజర్వు బ్యాంకు ‘ఫెడ్‌’ అధ్యక్షురాలు ఎలెన్‌ను అర్థించి తెలుసుకోవలసిందే. ఈ షరతుకు తగినట్టుగానే మోదీ ప్రభుత్వం ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ను విదేశీ పెట్టు బడులతో వస్తువులను ఇండియాలో తయారుచేసిపెట్టమని, అదే ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’గా చెప్పుకోవచ్చునన్న భ్రమలో ఉంది. ఎందుకంటే విదేశీ సైన్యం గానీ, విదేశీ గుత్త కంపెనీగానీ ఒకసారి ప్రవేశించిన తరువాత తిరిగి స్వచ్ఛం దంగా వెనక్కి వెళ్లిపోవడమంటూ జరగదు. ఇది దేశాల, వర్ధమాన దేశాల ప్రజల అనుభవం. -ఏబీకే ప్రసాద్‌ సీనియర్‌ సంపాదకులు -abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు