‘శాంతి చర్చల’ నాలుగు స్తంభాలాట!

7 Aug, 2013 00:08 IST|Sakshi
‘శాంతి చర్చల’ నాలుగు స్తంభాలాట!

అఫ్ఘాన్ శాంతి చర్చలలో కీలక పాత్రధారులుగా కనిపిస్తున్న అమెరికా, తాలిబన్, కర్జాయ్, పాక్‌లకు ఎవరికి వారికి సొంత అజెండా ఉంది. కాబట్టే శాంతి చర్చలు నాలుగు స్తంభాలాటగా మారాయి.
 
 భూమి గుండ్రంగా ఉన్నదని మరోసారి రుజువైంది. అమెరికా జూన్‌లో అట్టహాసంగా ప్రారంభించిన అఫ్ఘానిస్థాన్ శాంతి చర్చల నావ బయలుదేరిన తీరానికే తిరిగి చేరింది. శాంతి చర్చలు కొనసాగుతాయంటూ తాలి బన్ల అగ్రనేత ముల్లా ఒమర్ మంగళవారం చేసిన  ప్రకటన అమెరికాతో చర్చలను ఉద్దేశించినదేనని పొరబడటానికి వీల్లేదు. అమెరికాతో చర్చలకోసం ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్లు తెరచిన కార్యాలయం జూలై 9నే మూతబడింది. మరి ఒమర్ చర్చలంటున్నది ఎవరితో? ఎవరితోనో ‘అసోసియేటెడ్ ప్రెస్’ వార్తా సంస్థ సోమవారంనాడే వెల్లడించింది. అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఏరికోరి నియమించిన అత్యున్నత శాంతి మండలి సభ్యులకు, తాలిబన్లకు మధ్య అనధికారికంగా చర్చలు జరుగుతున్నాయని అది తెలిపింది.
 
 జూన్ 19న అఫ్ఘాన్ శాంతిభద్రతల పరిరక్షణ విధులను జాతీయ భద్రతా బలగాలకు అప్పగించిన రోజునే కర్జాయ్  అమెరికాపై అలిగారు. కారణం శాంతి చర్చలే! కర్జాయ్ ప్రభుత్వ ప్రమేయం లేకుండా దోహాలో తాలిబన్లతో అమెరికా నేరుగా చర్చలకు పూనుకున్నందునే ఆయన అలిగారు. అలిగి, అరచి, ఆగ్రహించి అమెరికాను కాళ్ల బేరానికి వచ్చేలా చేయడం ఎలాగో కర్జాయ్‌కి కొట్టిన పిండే. కాబట్టే సొంత బలం లేకుం డానే పదేళ్లుగా అఫ్ఘాన్ అధినేతగా కొనసాగుతున్నారు. 2010లోనే కర్జాయ్ నేరుగా తాలి బన్లతో తెరవెనుక చర్చలు ప్రారంభించారు.  జూన్‌లో బెడిసికొట్టిన అమెరికా ‘శాంతి చర్చల’లో కర్జాయ్‌కు స్థానం లేనట్ట్టే, ఆనాటి కర్జాయ్ చర్చలు కూడా అమెరికా ప్రమేయం లేకుండా సాగినవి. అమెరికా బెదిరించి, బతి మాలి, బుజ్జగించి అప్పట్లో కర్జాయ్ చేత తాలి బన్లతో చర్చలను విరమింపజేసింది. నేడు కథ మళ్లీ మొదటికి వచ్చింది. అఫ్ఘాన్ శాంతి చర్చల ప్రహసనంలోంచి అమెరికా నిష్ర్కమించి, కర్జాయ్ రంగ ప్రవేశం చేశారు.
 
 శాంతి చర్చలు జరుపుతామంటూనే, దాడులను ముమ్మరం చేస్తామని ఒమర్ తన ప్రకటనలో స్పష్టం చేశారు. అమెరికా, అప్ఘాన్ ప్రభుత్వాలే జూన్‌లో ప్రారంభమైన చర్చల ప్రక్రియను దెబ్బ తీశాయని ఆయన ఆరోపణ. పనిలో పనిగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలను బహిష్కరించాల్సిందిగా ఒమర్ అఫ్ఘాన్లకు పిలుపునిచ్చారు. 2014 చివరికి అమెరికా, నాటో బలగాలు నిష్ర్కమించనుండగా ఎన్నికల నిర్వహణ ‘అర్థరహిత, అనవసర కాలహరణమే’నని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి ఆమెరికా అఫ్ఘాన్ ‘ఎండ్ గేమ్’ (ముగింపు క్రీడ) అనుకున్నట్టు జరగదనేది స్పష్టమే. ఏప్రిల్ 5 ఎన్నికల్లోగానే, అంటే ఈ ఏడాది చివరికే తాలి బన్లతో ఒప్పందాన్ని కుదుర్చుకొని, ఎన్నికల ద్వారా ఏర్పడబోయే నూతన ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టడం ‘ఎండ్ గేమ్’లో కీలక ఘట్టం. అమెరికా ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలకు హామీని కల్పించి, సైనిక స్థావరాల కొనసాగింపునకు అంగీకరించే నూతన ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా భావిస్తోంది. అమెరికాతో శాంతి చర్చలకు తాలిబన్ల ప్రధాన షరతు కర్జాయ్ ప్రభుత్వాన్ని చర్చల ప్రక్రియ నుంచి, అధికార పంపకం నుంచి మినహాయించడమే.
 
 కానీ తాలిబన్లు అదే కర్జాయ్‌తో నేరుగా తెరచాటు సంబంధాలు నెరపుతూనే ఉన్నారు. ఎప్పుడు ఎవరితో చర్చలు సాగించాలో, విరమించాలో నిర్ణయించేది తాలిబన్లే. మరోవంక అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఈ నెల ఒకటిన తాలిబన్లతో చర్చలు తిరిగి మొదలు కావడానికి సహకరించాలని పాకిస్థాన్‌ను అభ్యర్థించారు. గత ఏడాది జరిపిన ‘శాంతి చర్చల’ నుంచి అమెరికా, కర్జాయ్‌లు పాక్‌ను మినహాయించాయి. నేడు అదే పాక్ సహా యంతో చర్చలకు అమెరికా తాపత్రయపడుతోంది. దోహా స్థాన బలం కలిసి రాలేదో ఏమో రెండు దేశాలూ కలిసి చర్చల వేదికను మరో దేశానికి మార్చాలని నిర్ణయించాయి!
 
 అఫ్ఘాన్ శాంతి చర్చలలో కీలక పాత్రధారులుగా కనిపిస్తున్న అమెరికా, తాలిబన్, కర్జాయ్, పాక్‌లకు ఎవరికి వారికి సొంత అజెండా ఉంది. కాబట్టే శాంతి చర్చలు నాలుగు స్తంభాలాటగా మారాయి. ఒమర్ ప్రకటనలో శాంతి చర్చలు ఎవరితోనో ప్రస్తావించకపోవడమేగాక,  కర్జాయ్ ప్రభుత్వంతో చర్చలకు అంగీకరించేదిలేదనే మూసపోత షరతును  ఉపసంపహరించారు. అంటే తాలిబన్లు అటు కర్జాయ్ ప్రభుత్వంతోనూ, ఇటు అమెరికాతోనూ కూడా ఒకేసారి విడి విడిగా చర్చలు సాగించడమనే  నూతన ఘట్టం ఆవిష్కృతం కానున్నదని భావించాలా? నిజానికి తాలిబన్లు కూడా చర్చల విషయంలో సందిగ్ధంలో ఉన్నారు.
 
  సేనల ఉపసంహరణ తదుపరి అతి కొద్ది కాలంలోనే ప్రభుత్వ బలగాలను చిత్తుగా ఓడించగలమనే అంచనాతో చర్చలను ఒక వర్గం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. మరో వర్గం మాత్రం అది సుదీర్ఘ అంతర్గత యుద్ధంగా మారుతుందని భయపడుతున్నారు. ఈ సందిగ్ధం నుంచి వెంటనే బయటపడాలన్న ఆదుర్దాగానీ, అగత్యంగానీ  తాలిబన్లకు లేదు. అందుకే ఈ ఆటను కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా అఫ్ఘాన్‌లో పాక్‌కు ఎలాంటి పాత్రా లేకుండా చేయాలన్న కర్జాయ్ ఆశలు నెరవేరేలా లేవు. అమెరికా పరిస్థితి సైతం ఇరాక్‌లో లాగే అఫ్ఘాన్ నుంచి కూడా ఎలాంటి దీర్ఘకాలిక వ్యూహాత్మక ఒప్పందమూ లేకుండా, అవమానకరంగా నిష్ర్కమించాల్సిన దుస్థితిగా మారేట్టుంది.
 - పిళ్లా వెంకటేశ్వరరావు

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా