అఫ్ఘాన్‌లో ఆపదమొక్కులు!

14 Feb, 2014 00:30 IST|Sakshi
అఫ్ఘాన్‌లో ఆపదమొక్కులు!

అఫ్ఘానిస్థాన్‌లో ఎలాగైనా ఎన్నికలను నిర్వహించి, అక్కడ తమ సైన్యాన్ని నిలిపి ఉంచగలిగేలా కొత్త ప్రభుత్వంతో ఒప్పందం కోసం అమెరికా ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడు కర్జాయ్ 2014 తదుపరి కొత్త ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య మధ్యవర్తిగా నిలవాలని యత్నిస్తున్నారు. దీంతో అఫ్ఘాన్‌లో అమెరికా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  
 
 ‘తప్పుల నుంచి నేర్చుకునే వాడివైతే అసలు ఓడిపోయేవాడివే కావు’ అని అంటే అన్నారేమో. అమెరికాకు అది వర్తించాలని లేదు. తప్పులు చేయడమే తప్ప నేర్చుకోవడమన్నది ఎరగని అమెరికా తప్పులు చేస్తూనే గెలిచి చూపించగలనని అఫ్ఘానిస్థాన్‌లో రుజువు చేసి చూపిస్తానంటోంది. ఏప్రిల్ 5న జరగనున్న అఫ్ఘాన్ ఎన్నికల బరిలోకి దిగిన ఐదుగురు ప్రధాన అభ్యర్థుల మధ్యన ఈ నెల 4న టీవీ చర్చ జరిగింది. తాలిబన్‌లకు, నాటో బలగాలకు మధ్య యుద్ధం సాగుతుండగానే, బాంబు దాడులు, ఆత్మాహుతి దాడుల విధ్వంస కాండ జోరు తగ్గకుండానే ఎన్నికలేమిటి? అని అనుమానం అక్కర్లేదు. అమెరికా తలిస్తే ఏమైనా జరుగుతుంది. అధ్యక్ష అభ్యర్థులు విడి విడిగా ఎవరు ఏం మట్లాడినా అంతా ఒక్క గొంతుకతో చెప్పింది ఒక్కటే.
 
  అమెరికాతో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుని, దాని సేనలను నిలిపి ఉంచుతామని. ఆ ఒప్పందం కోసమే అమెరికా, అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కాళ్లూ, గడ్డం పట్టి ఒప్పించాలని తంటాలు పడింది. 13 ఏళ్లుగా యుద్ధం సాగిస్తున్న తాలిబన్ ‘ఉగ్రవాదు’లతో సయోధ్య కోసం నానా అగచాట్లు పడింది అందుకోసమే. అదంతా వృధా ప్రయాసే అయినా... కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడ తాడన్నట్టు జరిగింది. రేపు ఎవరు అధ్యక్షులైనా అమెరికా ‘రక్షణ’ను కోరేవారే కావడానికి మించి దానికి కావాల్సింది ఏముంది. అమెరికా ఆశీర్వాద ‘బలం’తో 2001లో దేశాధ్యక్షుడైన ఒకప్పటి అనామకుడు కర్జాయ్ గతి ఏమిటి? ఆయన ఏ అథోగతి పాలైనా అమెరికాకు చింతలేదు. కానీ అధ్యక్ష భవనంలోనే రక్షణ లేక బిక్కుబిక్కుమని బతికే ఆయన కాబూల్‌లో నిర్మిస్తున్న భారీ నివాస భవనం అమెరికా కంటికి కనుకు లేకుండా చేస్తోంది. ఏప్రిల్ తర్వాత దేశం విడిచి పారిపోవడానికి బదులుగా ఆయన అఫ్ఘాన్ రాజకీయాల్లో సూత్రధారిగానో లేక అధికారానికి అతి సన్నిహితునిగానో ఉండగలనని విశ్వసిస్తున్నారని దాని అర్థం.
 
 కర్జాయ్ ‘మధ్యవర్తి’ అవతారం
 అఫ్ఘాన్ ‘వాతావరణ పరిస్థితుల’ను అంచనా కట్టడంలో కర్జాయ్‌ని మించిన వారు లేరు. అమెరికా, నాటో బలగాల సత్తా ఏ పాటిదో కర్జాయ్ 2007లోనే గ్రహించారు. అమెరికాతో ఎలాంటి రక్షణ ఒప్పందాన్నైనా తిరస్కరిస్తామన్న తాలిబన్ల వైఖరికి అనుగుణంగానే ఆయన దానితో ద్వైపాక్షిక రక్ష ణ ఒప్పందాన్ని ‘ఆమోదించారు.’ దానిపై సంతకాలు చేసే సర్వాధికారాలున్నా కొత్త అధ్యక్షుడే ఆ పని చేస్తాడంటూ తిరకాసు పెట్టారు. తాలిబన్లతో అమెరికా సాగించిన ఏకపక్ష చర్చలపై కన్నెర్ర చేసిన కర్జాయ్ ఏకపక్షంగా తాలిబన్లతో చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల తదుపరి లేదా ఈ ఏడాది చివరికి అమెరికా సేనల ఉపసంహరణ జరిగాక కొత్త ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య మధ్యవర్తిగా నిలవాలని  ఆయన భావిస్తున్నారు. కర్జాయ్ తాలిబన్లతో రహస్యంగా చర్చలు జరుపుతుండటం నిజమేనని అమెరికా ప్రభుత్వ అధికారిక ప్రతినిధులు ఫిబ్రవరి 3న అంగీకరించారు. ‘ఈ చర్చలను మేం వ్యతిరేకిస్తున్నామనడం సరైనది కాదు’ అని అసత్యం చెప్పారు. అదే రోజున అధ్యక్షుడు బరాక్ ఒబామా అఫ్ఘాన్‌లోని తమ సేనాధిపతి జనరల్ జోసెఫ్ డన్‌ఫోర్డ్, రక్షణ మంత్రి చుక్ హ్యాగెల్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్టిన్ డెంప్సీలతో సమావేశమయ్యారు.  త్వరలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో కుదుర్చుకోబోయే ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని కాపాడుకోవడమెలాగని వ్యూహ రచన గురించి చర్చించారు. జరుగుతాయో లేదో తెలియని ఎన్నికలు, ఆ తదుపరి ఎవరు అధ్యక్ష పీఠం ఎక్కుతారో తెలియకముందే వారితో కుదుర్చోకోబోయే ఒప్పందం, దానికి ఇప్పుడే ముప్పు వచ్చి పడ్డం, దాన్ని కాపాడుకోడానికి వ్యూహం!
 
 అఫ్ఘాన్‌తో ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుని 2014 తర్వాత  అక్కడ కనీసం 10,000 సైన్యాన్ని నిలిపి ఉంచాలని అమెరికా భావిస్తోంది. సేనలను పూర్తిగా ఉపసంహరించడానికి ముందు అమెరికాతో ఒప్పందం కాదుగదా, చర్చలు సైతం వీల్లేదని తాలిబన్లు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలను జరగనిచ్చేది లేదని, రక్తపాతం తప్పదని పదేపదే హెచ్చరిస్తున్నారు. చేసి చూపిస్తున్నారు. కానీ తుపాకులతో ఎలాగోలా ఎన్నికలు జరిగాయనిపించేసి, ఎవరో ఒకరికి అధ్యక్ష పీఠం కట్టబెట్టేసి ఒప్పందంపై సంతకాలు పెట్టించేయాలనే వ్యూహం ఎప్పుడో తయారు చేశారు. తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని, అది చేసుకునే ఒప్పందాలను తిరస్కరిస్తారని, తాలిబన్లతో పోరు కొనసాగక తప్పదని కూడా ముందే తెలుసు.
 
  ఇంకా కొత్తగా వచ్చే ముప్పేమిటి? కర్జాయ్ ‘మధ్యవర్తి’ అవతారానికి ముస్తాబవుతుండటమే! తాలిబన్లతో రహస్య మంతనాలు కొలిక్కి వస్తే కర్జాయ్ మధ్యవర్తిగా మారతారు. తాలిబన్లతో సయోధ్య కోసం  కొత్త ప్రభుత్వం అమెరికాతో ఒప్పందాన్నిన రద్దు చేసుకునే త్యాగం చేయక తప్పదని ఒప్పిస్తారనే భయం ఇప్పుడు అమెరికాను పట్టి పీడిస్తోంది. చేతికి, నోటికి మధ్య అతి పెద్ద అగాధంగా కర్జాయ్ మారగలరని అమెరికా ఊహించలేదు. కథ అడ్డం తిరిగింది కాబట్టి త్రిమూర్తులతో అధ్యక్షుని సమావేశం తదుపరి విడుదల చేసిన అధికారిక ప్రకటన ‘2014 తర్వాత అఫ్ఘాన్‌లో అమెరికా పాత్రపై ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు’ అని ముక్తసరిగా ముగించింది.  
 
 తాలిబన్ రాజ్యం
 నాటో బలగాలు తాలిబన్లపై పైచేయి సాధించలేవని అమెరికా కంటే చాలా ముందుగా 2007లోనే కర్జాయ్ గ్రహించారు. సంప్రదాయకమైన పాకిస్థాన్ వ్యతిరేక వైఖరిని చేపట్టారు. ఒకవంక అమెరికాతో నెయ్యం సాగిస్తూనే పాక్‌లోని వాయవ్య ప్రాంతంలోని తెగల ప్రాంతంలోని పష్తూన్‌ల దుస్థితిపై ధ్వజమెత్తారు. అఫ్ఘాన్, పాక్‌లలో ఉన్న ఫష్తూ ప్రజల ఐక్యతను చాటే పష్తూన్ దినోత్సవాన్ని అట్టహాసంగా జరపడం ప్రారంభించారు.  ఒప్పందానికి మోకాలడ్డి అమెరికా వ్యతిరేకి గుర్తింపు కోసం పాకులాడుతున్నారు. గత డిసెంబర్‌లో అమెరికా రక్షణ మంత్రి హ్యాగెల్ అఫ్ఘాన్ పర్యటనకు వచ్చి వెళ్లిన వెంటనే ఆయన హఠాత్తుగా ఇరాన్‌కు వెళ్లి అధ్యక్షుడు హస్సన్ రుహానీతో రహస్య మంతనాలు సాగించారు.
 
  ప్రస్తుతం అమెరికా, నాటోల బలగాలు ముమ్మరంగా సైనిక చర్యలు సాగిస్తున్న పర్వాన్ రాష్ట్రంలో వందల మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేసి అమెరికాకు పుండు మీద కారం రాసినంత పని చేశారు. గత ముప్పయ్యేళ్లుగా రెండు అగ్రరాజ్యాలు రష్యా, అమెరికాలతో పాటూ పాకిస్థాన్ కూడా అఫ్ఘాన్ లో నెత్తుటి విధ్వంస క్రీడను సాగించింది. అది మెజారిటీ జాతి పష్తూన్‌లలో బలంగా నాటుకుపోయింది. 2014 తర్వాతి అఫ్ఘాన్‌కు అంతర్గతంగా తాలిబన్ల నుంచి ముప్పు కంటే బయటి నుంచే ముప్పే ఎక్కువని చాలా మంది అఫ్ఘాన్‌లలాగే కర్జాయ్ కూడా భావిస్తున్నారు. ఇరాన్, చైనా, భారత్‌లలో ఎవరితో వ్యూహాత్మక బంధం లాభసాటి అనే విషయాన్ని అతి జాగ్రత్తగా బేరీజు వేస్తున్నారు.
 
 దక్షిణ ఆసియాలో అత్యంత దౌత్య చాతుర్యం ప్రదర్శిస్తున్న నేత కర్జాయేననడంలో సందేహం లేదు. తాలిబన్లు ఆయన ఎత్తుగడలను వ్యతిరేకించడం లేదు. సమర్థిస్తున్నట్టు కనిపిస్తున్నారు. అలా అని 2014 తర్వాతికి ఆయన రూపొం దిస్తున్న ‘శాంతి’ పథకం ప్రకారం నడవాలని భావిస్తున్న దాఖలాలు లేవు. అతి తెలివిగా ఆయన్ను వాడుకోవాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత తాలిబన్, అల్‌కాయిదా ఎత్తుగడలను కర్జాయ్ కంటే బాగా బుష్, ఒబామా ప్రభుత్వాల్లో రక్షణ మంత్రిగా పనిచేసిన రాబర్ట్ గేట్స్ అర్థం చేసుకున్నట్టుంది. ‘శత్రువులు (తాలిబన్లు) ఇప్పుడు ఏమీ చేయనవసరం లేదు. కేవలం వేచి చూస్తే సరిపోతుంది.’ అమెరికా బలగాల నిష్ర్కమణ ప్రకటన వారికి కొత్త ఊపిరులూదిందని  గేట్స్ భావిస్తున్నారు.
 
  ‘అఫ్ఘాన్‌లో ఓటమి పాలైనామన్న అపప్రథ’ను అల్‌కాయిదా తనకు అనుకూలంగా మలుచుకొని మధ్యప్రాచ్యంలో చెలరేగిపోతోందని వాపోయారు. ఏది ఏమైనా 2014 తర్వాతి తాలిబన్‌ల పాలనను అందరూ కలిసి ఇప్పుడే అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం అఫ్ఘాన్ పార్లమెంటు ముందున్న ఒక చట్టం ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంది. అది ఆమోదం పొందితే అఫ్ఘాన్ పురుషులకు తమ బంధువులైన మహిళలను హింసించే, అత్యాచారం చేసే హక్కులు లభిస్తాయి. అయినా కొత్త చట్టాలతో పనేముంది? అత్యాచారాలకు గురైన మహిళలను వ్యభిచార నేరం కింద శిక్షించి హంతకులకు వేసే శిక్షల కంటే కఠిన శిక్షలను విధిస్తూనే ఉన్నారు. 1917లోనే 18 ఏళ్ల లోపు వివాహాలను, బురఖాలను నిషేధించిన దేశంలో పాతికేళ్ల అమెరికా జోక్యం సాధించిన ప్రగతి ఇది.    
 - పిళ్లా వెంకటేశ్వరరావు

మరిన్ని వార్తలు