చీకటి ఖండంలో చావుకేక

4 Nov, 2014 00:55 IST|Sakshi
చీకటి ఖండంలో చావుకేక

ఎబోలా సంక్షోభం వెనుక ఉన్న అసమానతలకు విరుగుడు కనిపెట్టకుండా, ఈ వైద్య ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించడం సాధ్యంకాదని మోడియన్ డల్‌హౌసీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ నిసీమ్ మన్నాతుకారన్ అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి పరిస్థితులలో, ఎక్కడ ‘ఎబోలా’లు జనిస్తున్నాయి? అమెరికా తన పౌరుల ఆరోగ్యం కోసం తల ఒక్కింటికి  8,362 (ఏడాదికి) డాలర్లు వెచ్చిస్తున్నది. ఆఫ్రికాలోని ఎరిత్రియా అనే దేశం ఖర్చు చేస్తున్నది కేవలం 12 డాలర్లు. ప్రపంచంలో సంపన్న దేశాల ప్రజలు కేవలం 18 శాతం. కానీ ప్రపంచంలో ఆరోగ్యం కోసం జరుగుతున్న ఖర్చులో 84 శాతం ఈ సంపన్న దేశాలలోనే జరుగుతోంది.
 
రుగ్మత ఏదైనా దాని నివారణ కోసం, నిర్మూలన కోసం జరిపే పోరాటం ఎలా ఉండాలి? అది మానవ శరీర పటు త్వంపైన ఆధారపడి ఉంటుంది. ఆ దృఢత్వం ప్రభుత్వ ప్రజారోగ్య విధానాల అమలుపైన ఆధారపడి ఉంటుంది. అంతేగానీ బలహీనమైన శరీరంపైన ఆధారపడి వైద్యుడు తన వృత్తి కౌశలంతోనే బలమైన శరీరాన్ని సృష్టించలేడు. ఆరోగ్యవంతమైన దృఢమైన శరీరాన్ని నిర్మించడమన్నది మొత్తం సామాజికుల సమష్టి కృషి ఫలితంగా ఉండాలి.    
- షేగువేరా
 
ఈ సత్యాన్ని నిరూపించగలిగేదీ, సామాజిక స్పృహతో పరిపూర్ణంగా సుసాధ్యం చేయగలిగేదీ ఒక్క సోషలిస్ట్ ఆర్థికవ్యవస్థ మాత్రమే. ఇది ఎబోలా మహమ్మా రితో రుజు వవుతోంది. కొద్దికాలం క్రితం ఆఫ్రికా ఖండం లో ప్రారంభమై, ఇతర ఖండాలను చుట్టబెట్టడానికి సమాయత్తమైన వ్యాధి ఎబోలా. ఈ వ్యాధిని అరికట్టడా నికి ఆరంభమైన కృషిలో సోషలిస్టు క్యూబా నిర్వహించిన పాత్రకి ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఐక్యరాజ్యసమితి ప్రశంసల వర్షం కురిపించాయి.

క్యూబానే ఎందుకు ప్రశంసించవలసి వచ్చింది? పశ్చిమాఫ్రికాలోని గినియా, లైబీరియా, సియె ర్రాలియోన్‌లలో వేలాది మందికి సోకిన ఆ అంటువ్యాధిని ఒక రాక్షస వ్యాధిగా గుర్తించారు. ఇది ఆయా దేశాల ప్రజ లలో బయ టపడిన వెంటనే ఎబోలా వైరస్ సంహారానికి ఆగమేఘాల మీద క్యూబా విరుగుడు కనిపెట్టింది. అయినా డిసెంబర్‌కు ఇది మరింత విస్తరించే అవకాశం ఉందని భయాలు వ్యక్తమవుతున్నాయి
 
మూలం ఏది?
నిజానికి ఈ వ్యాధి ఆ మూడు దేశాలకే పరిమితం కాలేదు. ఆఫ్రికాలోని కొన్ని దేశాలకు వ్యాపించింది. ఇతర ఖండాల నుంచి ఆయా దేశాలకు రాకపోకలు సాగించే దేశాల ప్రజ లవల్ల మరికాస్త విస్తరించే అవకాశమూ లేకపోలేదని హెచ్చరికలు వెలువడుతున్నాయి. భారత్, చైనాలలో విద్య కోసం, ఉద్యోగాల కోసం వచ్చిన ఆఫ్రికన్లు వివిధ పారి శ్రామిక వాడలలో నివసిస్తున్నారు. కాబట్టి ఈ వ్యాధి ఆఫ్రి కా నుంచి ఆసియాకు పాకే అవకాశాలూ ఎక్కువేనని, అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ సంస్థలు హెచ్చరికలు చేస్తున్నాయి.  ఈ సమయంలో దూసుకు వచ్చినదే క్యూబా మందు.

ఇప్పటికే ఎబోలా వైరస్‌కు 10,000 మంది వరకు బలైనారు. చడీచప్పుడు లేకుండా కాటు వేసి, 48 గంటల లోనే ప్రాణాలను తోడేసే వ్యాధి ఎబోలా. దీని వైరస్ మూలాల గురించి  నలుగురూ నాలుగు రకాల కారణాలు చెబుతున్నారు. వీటికి సంబంధించి ఈ నెల రెండో తేదీన లండన్ నుంచి వెలువడిన వార్త మరీ భయానకంగా ఉంది. ఈ వైరస్‌ను వ్యాప్తి చేయగలిగిన జీవి గబ్బిలమని కొందరు నిర్ధారణకు వచ్చారు. నిజానికి ఎబోలాతో పాటు, వంద రకాల వైరస్‌లకు గబ్బిలమే కారణమని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలలో వెల్లడైంది.

వీటిలో రాబిస్, తీవ్ర శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే క్రిములు కూడా ఉన్నాయని తేలింది. ఇన్ని ప్రమాదకర వైరస్‌లతో జీవించే గబ్బిలాలకు ఆఫ్రికా అడవులే నిలయాలు. ఈ విషయాల తోనే వ్యాధి నిరోధకాన్ని కనుగొనడానికి  శాస్త్రవేత్తలకు మార్గం కూడా దొరికింది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమా నాశ్రయం సహా, దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తంగా ఉండవలసిందిగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. మన దేశం నుంచి చాలామంది ఆఫ్రికా దేశాలకు రాకపోకలు సాగిస్తున్నందున ఎబోలా వ్యాపించ డానికి అవకాశాలెక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు.

ఎప్పుడు, ఎక్కడ గుర్తించారు?
38 ఏళ్లనాడు మధ్య ఆఫ్రికాలోని కాంగో రిపబ్లిక్ (పాత జైరే)కు చెందిన ఒక నర్సుకు ప్రాణాంతక వ్యాధి ఒకటి సోకి, కొన్ని గంటలలోనే కన్నుమూసింది. అప్పుడు ఆ రోగి శరీరం నుంచి స్రవించిన రక్తం, చేసుకున్న వాంతులు, విరేచనాలను పరీక్షించినపుడు బయట పడిన వ్యాధికే ఎబోలా అని పేరు పెట్టారు. ఎబోలాలో మొత్తం 20 రకా లు ఉన్నాయని కూడా అప్పుడే కనుగొన్నారు. కాంగోలోనే ఎంబుకు అనే గ్రామంలో తొలిసారి ఈ వ్యాధి లక్షణాలను గమనించారు కాబట్టి, ఆ ఊరి పేరే పెట్టారు.

తరువాత ఆ గ్రామాన్నీ, వారి సంస్కృతినీ అవమానించడం ఇష్టం లేక అక్కడికి సమీపంలోనే ప్రవహిస్తున్న ఎబోలా అనే నది పేరును ఈ వైరస్‌కు తగిలించారు. దీని అర్థం - నల్ల నది. పాశ్చర్ పరిశోధనా సంస్థ (ఫ్రాన్స్)కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ పియరీ సురెయు ఈ పేర్లను నిర్ధారించినవారిలో ప్రముఖుడు. ఓ వ్యాధి పేరుతో ఎబోలా నది అలా ప్రపంచ ప్రజలకు పరిచయమైంది. ఇలాగే కొన్ని నదుల పేర్లు రోగాలకు ఆపాదించారు. ఎబోలాను వీటన్నిటికి మించిన ప్రాణాంతక వ్యాధిగా శాస్త్రజ్ఞులు పరిగణిస్తున్నారు. ఆధు నిక మానవుడు ఘోరమైన విపత్తును ఎదుర్కొనబోతు న్నాడని కూడా అంచనా వేస్తున్నారు.
 
నిరంతర అప్రమత్తతే వ్యూహం
ఇలాంటి మహమ్మారిని నివారించడానికి పశ్చిమాఫ్రికా దేశాలతో కలసి, చిన్న దేశమైన సోషలిస్టు క్యూబా తన సామర్థ్యానికి మించి కృషి చేస్తున్నదని ప్రపంచ సంస్థలు శ్లాఘించాయి.  అక్కడి వైద్యులకూ, నిపుణులకే కాకుండా ఇతర దేశాల వైద్య సిబ్బందికి కూడా క్యూబా నాణ్యమైన శిక్షణ ఇస్తున్నది. ప్రపంచానికి వైద్యసేవలు అందిస్తున్న బహుకొద్ది దేశాలలో  క్యూబా ఒకటి అని అపోలో ఆస్పత్రు ల అధినేత డాక్టర్ ప్రతాప్ రెడ్డి కూడా ఉదహరించారు. 1961 నుంచి ఇప్పటి వరకు 154 దేశాలకు క్యూబా ఆరోగ్య సేవకులు వెళ్లారని లాటిన్ అమెరికాకు చెందిన ప్రసిద్ధ పత్రికా సంపాదకుడు డాక్టర్ ఫిట్జ్ రాశాడు.

సామ్రాజ్య వాద పెట్టుబడిదారి పాలక వ్యవస్థలు శతాబ్దాలుగా తమ పాత వలసను దురాక్రమిస్తూ యుద్ధాల ద్వారా, వనరుల దోపిడీ ద్వారా, బానిస వ్యాపారం ద్వారా ఆ ప్రాంతాల లోని ప్రజల ప్రతిఘటనా శక్తిని నిర్వీర్యం చేస్తున్నాయి. దీనితో పాటు విషక్రిముల ద్వారా, విషపూరిత రసాయ నాల ద్వారా ఆ దేశాల పంటలను జనావాస ప్రాంతాలను కకావికలు చేస్తున్నాయి. ‘ఏజెంట్  ఆరెంజ్’ అనే విష పదార్థం సాయంతో వియత్నాం మీద అమెరికా చేసిన పని ఇదే.  ఆ రసాయనాన్ని వియత్నాం మీద చల్లి అమెరికా అక్కడ పదిహేనేళ్ల పాటు ఏ పంట వేయడానికి ఆస్కారం లేకుండా చేసింది.

ఆఫ్రికాలోని నిరుపేద దేశాలలో ఆరో గ్య వ్యవస్థలు కుప్పకూలిపోవడం ఇలాంటి క్రమంలో జరిగిందే. ఆ దేశాలు సామ్రాజ్యవాద దురాక్రమణ యుద్ధా లకూ, నిరంతర ఘర్షణలకూ సుదీర్ఘకాలం కేంద్రంగా ఉన్న వే. ఆ దేశాలలోని ఇతర వ్యవస్థలతో పాటు వైద్య ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోవడం లేదా నిర్వీర్యం కావడం దీని ఫలితమే. లైబీరియా సంగతే చూద్దాం. అక్కడ 40 లక్షల జనాభాకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు కేవలం 51 మంది. సియెర్రాలియోన్‌లో 60 లక్షల జనాభాకు 136 మంది వైద్యులు మాత్రం అందుబాటులో ఉన్నారు.
 
అమెరికా అమానుషత్వం
బడుగు దేశాల పంటలనీ, ప్రజారోగ్యాన్నీ దెబ్బతీసిన వల స, నయా వలస పాలక వ్యవస్థలే ఇప్పుడు ఎబోలా వంటి వ్యాధులకు గురి అవుతున్న వర్ధమాన దేశాల పౌరులను తమ దేశంలోకి అనుమతించడంలేదు. వీరి ప్రవేశం మీద ఆంక్షలు, నిషేధాలు పెట్టడానికి వెనకాడటం లేదు. థామస్ డంకన్ అనే లైబీరియా పౌరుడు అమెరికాలో అడు గుపెట్టినపుడు అతడికి ఎబోలా లక్షణాలు ఉన్నట్టు గుర్తిం చారు. దీనితో అమెరికా ప్రభుత్వం, ‘కావాలనే, ఈ వ్యాధిని అమెరికాలో వ్యాపింప చేసే ఉద్దేశంతోనే’ అతడు వచ్చినట్టు చిత్రించింది. అతడు చనిపోక ముందే క్రిమినల్ నేరాలు మోపడానికి కూడా సిద్ధమైంది. ఇదే వైఖరిని తాజాగా ఆస్ట్రేలియా అనుసరిస్తున్నది.

అసమానతలే అసలు వైరస్
ఎబోలా సంక్షోభం వెనుక ఉన్న అసమానతలకు విరుగుడు కనిపెట్టకుండా, ఈ వైద్య ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరిం చడం సాధ్యంకాదని  మోడియన్ డల్‌హౌసీ విశ్వవిద్యాల యానికి చెందిన ప్రొఫెసర్ నిసీమ్ మన్నాతుకారన్ అభి ప్రాయపడుతున్నారు. ఎలాంటి పరిస్థితులలో, ఎక్కడ ‘ఎబోలా’లు జనిస్తున్నాయి? అమెరికా తన పౌరుల ఆరో గ్యం కోసం తల ఒక్కింటికి  8,362 (ఏడాదికి) డాలర్లు వెచ్చిస్తున్నది. ఆఫ్రికాలోని ఎరిత్రియా అనే దేశం ఖర్చు చేస్తున్నది కేవలం 12 డాలర్లు. ప్రపంచంలో సంపన్న దేశా ల ప్రజలు కేవలం 18 శాతం.

కానీ ప్రపంచంలో ఆరోగ్యం కోసం జరుగుతున్న ఖర్చులో 84 శాతం ఈ సంపన్న దేశా లలోనే జరుగుతోంది. ఇలాంటి అసమానతల వల్లనే వర్ధ మాన, బడుగు దేశాలలో ఇప్పటికీ  క్షయ వ్యాధితో, ప్రసూతి సమయంలో లక్షల సంఖ్యలో మరణాలు సంభవి స్తున్నాయి. మూలిగే నక్క మీద తాడిపడినట్టు ఎబోలాలు తలెత్తేదీ ఇలాంటి చోటేనని మరచిపోరాదు.     
 
ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు
 

మరిన్ని వార్తలు