ఓటుకు ముందే ఓడిన మహిళ

24 May, 2014 23:49 IST|Sakshi
ఓటుకు ముందే ఓడిన మహిళ

1935 భారత ప్రభుత్వ చట్టం నాటి నుంచి మన పార్టీలు మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. రాజ్యాంగంలో మహిళా రిజర్వేషన్లన్న మాటే రాకుండా కాంగ్రెస్ తదితర పార్టీలు జాగ్రత్త వహించాయి. నాటి నుంచి నేటి వరకు వాటిది అదే తీరు. ఆ తీరు మారేది కాదు. రిజర్వేషన్లు లేకుండా చట్ట సభల్లో మహిళా ప్రతినిధ్యం పెరగడం అసంభవం.
 
మహిళా సాధికారతను కోరే వారంతా సంబరాలు జరుపుకోవాల్సి న సమయమిది. కొలువుదీరనున్న పదహారవ లోక్‌సభలో మహిళా సభ్యుల సంఖ్య స్వాంతంత్య్రానంతర కాలంలోకెల్లా అత్యధిక స్థాయికి చేరింది. 543 స్థానాలున్న లోక్‌సభలో 61 మంది... 11.2 శాతం మహిళలే! గత లోక్‌సభతో పోలిస్తే ఇద్దరు ఎక్కువ. మహిళా సాధికారత దిశగా మనం సాధించిన  ఘన విజయమిది. ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు రెండూ 1997 నుంచి చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లకు పట్టంగడతామని చెప్పుకుంటూనే ఉన్నాయి. 2010లో యూపీఏ ప్రవేశపెట్టిన బిల్లు లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కట్టబెట్టేసినంత పని చేసింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు గట్టెక్కక పోవడానికి కారణాలు ‘అంతుపట్టేవి’ కావు. ఆ సంగతి పక్కనబెట్టి, ఈసారి మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామని ఢంకా బజాయించిన కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు వారికి ఏ స్థానం ఇచ్చాయో చూడ్డం తేలిక. అవి మూడూ కలిసి బరిలోకి దించిన మొ త్తం 1,325 మంది అభ్యర్థుల్లో మహిళల సంఖ్య 631...12 శాతం! మొత్తం అభ్యర్థులు 8,251 మంది కాగా వారిలో 668 మంది మాత్రమే మహిళలు!

ఓటమికి మారుపేరు మహిళ

మహిళల పట్ల ఎంతగా సానుభూతి కట్టలు తెంచుకుంటున్న పార్టీలకైనా టిక్కెట్లిచ్చే సమయానికి వచ్చి పడే ఇబ్బంది ఒక్కటే... గెలవగలగడం. ఓటమి పుట్టుకకు ముందే ఆడాళ్లకు రాసిపెట్టి ఉన్న తలరాత. దాన్ని మార్చడం ఎవరి తరం? ఎలాగూ ఓడేవారికి సీట్లిస్తే మాత్రం ఒరిగేదేమిటి? ఫలితాలు మాత్రం మగ అభ్యర్థులతో పోలిస్తే మహిళలకే గెలుపు అవకాశాలు ఎక్కువని సూచిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం మగ అభ్యర్థుల్లో 6.36 శాతం గెలిస్తే, మహిళల్లో 9.13 శాతం గెలిచారు! ఎన్నికల ప్రక్రియలో మహిళలు పాల్గొనడం తక్కువగా ఉండగా మహిళా ప్రాతినిధ్యం ఎలా పెంచగలుగుతామనేది మరోవాదన. ఇందులో కొంత వాస్తవం ఉన్నా అది కొండంత మార్పు ను కనపించకుండా చేసేదేమీ కాదు. ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో స్త్రీ, పురుషుల మధ్య అంతరం పూడిపోతూ వస్తోంది. 1962లో మహిళల కంటే పురుషులు 16.7 శాతం ఎక్కువగా ఓటు హక్కును వివియోగించుకోగా... 2009 నాటికి అ తేడా 4.4 శాతానికి పడిపోయింది. వీధుల కెక్కి, వేదికలకెక్కి ఎన్నికల ప్రచారంలోనూ, పార్టీ కార్యకాలాపాల్లోనూ పాల్గొనే మహిళల సంఖ్య పెరుగుతోంది. ప్రత్యేకించి 1990ల నుంచి రాజకీయాల్లో, పార్టీల్లో మహిళల భాగస్వామ్యం వేగంగా పెరుగుతోంది. అన్ని వర్గాల మహిళల్లో పెరుగుతున్న ఈ రాజకీయ చైతన్యం ఒక పార్శ్వం మాత్రమే. ఒకప్పటిలాగా నేడు ఇంటి పెద్దగా మగాడిని ఆకట్టుకుంటే ఆడాళ్లందరి ఓట్లు పడతాయనే హామీ లేకుండా పోతోంది. ఇది ఈ పరిణామానికి ఉన్న మరో పార్శ్వం. సగం ఓటర్లుగా ఉన్న మహిళలను ఆకట్టుకోడానికి మహిళా కార్యకర్తలు, నేతలు, ప్రత్యేక వాగ్దానాలు పార్టీలకు తప్పనిసరి అవుతున్నాయి. వెరసి పార్టీల, రాజకీయాల లైంగికపరమైన అమరికలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చట్ట సభల్లో అవి ప్రతిఫలిం చడం లేదు ఎందుకు? మహిళల్లో నాయకత్వ లక్షణాలు కొరవడటం.

ఆడ నెత్తురులో లేనిది

జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ మహిళలకు అతి తక్కువ సీట్లను కేటాయించడానికి మరో కారణం. పార్టీ నిర్మాణం నిచ్చెన మెట్లు ఎక్కి వ చ్చిన పై స్థాయి నేతలు అతి తక్కువగా ఉండటం. ఎక్కువ మంది దిగువ మెట్ల మీదే చతికిలబడక తప్పడం లేదు. నాయకత్వ లక్షణాలు కొరవడటం వల్లనే వారు ఉన్న త స్థానాలకు ఎదగలేకపోతున్నారనేది తరచుగా వినిపించే వాదన. నాయకత్వ లక్షణాలను మగ పుట్టుకతో సంక్రమించేవిగా చూడటం పార్టీలకు అలవాటుగా మారింది. ఇళ్లల్లో, పని ప్రదేశాల్లో, వీధుల్లో ఎక్కడైనా కనిపించే స్రీల పట్ల వివక్షను అధిగమించినట్టు కమ్యూనిస్టులు సహా అన్ని పార్టీలు నటిస్తుంటాయి. కానీ పార్టీ నిర్మాణం అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయి వరకు అదే కనిపిస్తుంది. అసలు పార్టీ నిచ్చెనే మహిళలు ఎక్కలేని మాయా మెట్ల మయం. ఉట్టికెగర లేని వాళ్లు స్వర్గానికి ఎగరలేరు. చట్టసభలకు ఎగబాకాల ని అంగలార్చరాదు. సోనియాగాంధీ, మమతా బెనర్జీ, జయలలిత, మాయావతి ఎవరూ మాయ నిచ్చెనను మార్చలేకపోయారు. పార్టీల్లో వ్యవస్థీకృతమైనమైన ఈ అదృశ్య వడపోత యంత్రం బారి నుంచి తప్పించుకుని పైకి  ఎది గిన వాళ్లు కొద్దిమందే. అత్యధిక శాతం పెద్దగా పోటీలేని దిగువస్థాయి అలంకార ప్రాయమైన పదవులతో సరిపెట్టుకుంటారు. ఇందిరాగాంధీ నుంచి మాయావతి, జయలలిత, మమతా బెనర్జీల వరకు అత్యున్నత స్థానాలకు ఎదిగిన మహిళలంతా ‘మగాడురా’ అనిపించుకుంటారే తప్ప సమర్థవంతమైన మహిళా నేతలకు ఉదాహరణలుగా పార్టీలకు కనిపించరు. మహిళలు మంచి పార్లమెంటేరియన్లు కాలేరనేది మరో వాదన. ఆ అర్హతే నిజమైతే నిన్నటి ఎన్నికల్లో కాంగ్రె స్ తరఫున షీలా దీక్షిత్, మీరా కుమార్‌లు కాకున్నా ప్రియాంకాగాంధీ, బీజేపీ తరఫున సుశ్మాస్వరాజ్ ప్రధాని అభ్యర్థులుగా తలపడాల్సి వచ్చేది.  

గత వైభవ ఘన కీర్తి

మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో మన దేశం ప్రాంతీయ ఆగ్రరాజ్యంగా మారిం దన్నారు. భావి ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రరాజ్య ంగా మారుస్తారంటున్నారు. మహిళా ప్రాతినిధ్యం రికార్డు స్థాయికి (11.2 శాతానికి) చేరిన నేటి మన స్థితిని మోడీ ప్రమాణ స్వీకార ఉత్సవానికి విచ్చేయబోతున్న ‘సార్క్’ దేశాలతో సరిపోల్చడం సందర్భోచితం. సార్క్ దేశాలన్నిటిలోనూ పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యం ప్రపంచ సగటు 20 శాతం కంటే తక్కువగా ఉన్న దేశాలు రెండే రెండు... భారత్, శ్రీలంక (4.89). మహిళా హక్కుల కాలరాచివేతకు మారు పేరుగా చెప్పే అఫ్ఘానిస్థాన్ పార్లమెంటు 27 శాతం మహిళలతో సార్క్ దేశాల్లో ప్రథమ స్థానం లో ఉంది. పాకిస్థాన్ పార్లమెంటులో సైతం 21.35 శాతం మహిళలు. ఇక మన ప్రతిష్టను నిలపగలిగేది ఏది? మనం మరచిన గత వైభవ ఘనకీర్తే.  ఈ విషయంలో ఒకప్పుడు ప్రపంచంలోనే మూడవ స్థానంలో నిలిచిన ఘనత మనకుంది. బ్రిటిష్ పాలనలో 1937లో పరిమిత ఓటింగ్ హక్కులతో జరిగిన ఎన్నికల్లో మొత్తం 80 మంది మహిళా సభ్యులు ఉండేవారు. నాడు మన దేశం ప్రపంచంలో అమెరికా, రష్యాల తదుపరి మూడో స్థానంలో నిలిచింది.

 నాటి మన ఘనత కైనా అప్ఘాన్, పాక్‌ల వంటి దేశాల ఘనతకైనా కార ణం ఒక్కటే.. మహిళలకు  రిజర్వేషన్లు. 1935 భారత ప్రభుత్వ చట్టం కాలం నుంచి మన పార్టీలు మహిళా రిజర్వేషన్లును వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. స్వాతంత్య్రానంతరం అమల్లోకి వచ్చిన నూతన రాజ్యాంగం మహిళలు సహా ప్రతి ఒక్కరికీ సార్వత్రిక ఓటింగ్ హక్కును ఇచ్చింది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లన్న మాటే రాకుండా కాంగ్రెస్ తదితర రాజకీయ పక్షాలు జాగ్రత్త వహించాయి. నాటి నుంచి నేటి వరకు మన పార్టీలది అదే తీరు. ఆ తీరు మారేది కాదు. మార్చాల్సింది. కాబట్టే 1997లో పార్లమెంటు కెక్కిన  మహిళా రిజర్వేషన్లు నేటికీ దుమ్ముకొట్టుకుపోతున్నాయి. గెలిచిన మహిళలు సైతం పార్టీ వైఖరికే తప్ప మహిళలుగా మహిళా సమస్యల పరిష్కారానికి ఆలోచించడం లేదని, అలాంటప్పుడు రిజర్వేషన్లు వచ్చినా మహిళల పరిస్థితి మారదనే  మాట తరచుగా వినవస్తోంది. రిజర్వేషన్లే అన్ని వాదనలకు సమాధానం, రిజర్వేషన్ల బిల్లు చ ట్టమైతే లోక్‌సభలో మహిళా సభ్యుల సంఖ్య 61 నుంటి 179కి పెరిగిపోతుంది. ఆ సంఖ్యే అటు పార్టీల నాయకత్వంలోనూ, విధానాల్లోనూ మహిళలకు ప్రాతినిధ్యాన్నిచ్చే మార్పును తేగలుగుతుంది. చట్టసభల్లో మహిళలు మహిళల కోసం మాట్లాడే రోజులు వస్తాయి. అంతవరకు ఎన్నికల జాతరలు వస్తూ పోతూ ఉంటాయి. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుండక తప్పదు.    

 పిళ్లా వెంకటేశ్వరరావు  విశ్లేషణ
 

మరిన్ని వార్తలు