మౌలిక సంస్కరణలే మందు

27 Jan, 2016 01:09 IST|Sakshi
మౌలిక సంస్కరణలే మందు

విశ్లేషణ
వ్యవసాయం రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని మౌలిక సంస్కరణల ద్వారానే పరిష్కరించగలం. అప్పుడు మాత్రమే అన్నదాతల ఆత్మహత్యలను నివారించగలుగుతాం.

గత 20 ఏళ్లుగా రైతు మరణ మృదంగం మ్రోగుతూనే ఉన్నది. ప్రభుత్వాలు చేష్టలు డిగి చూస్తూనే ఉన్నాయి. రైతు చనిపోయిన తర్వాత ఇచ్చే పరిహారం రైతు మరణాలను ఎలా నిలువరిస్తుందో ఏలినవారికే తెలియాలి. ఇలాంటి సంస్కరణలు వికటించి, రైతు ఆత్మహత్యలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడం ఖాయం. రైతు మరణానికి గాని, ఆత్మహత్యకు గాని సాకులు వెదకకూడదు. ఇవన్నీ వ్యవ సాయ సంక్షోభం నుండి ఉత్పన్నమైన ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగానే జరిగాయని ప్రభుత్వాలు గుర్తించాలి.  ఈ సమాజంలో ఎవరు ఏయే కారణంగా ఆత్మహత్య చేసుకున్నా, అర్థంతరంగా తనువు చాలించినా ఈ సమాజాన్ని సృష్టించి, పోషిస్తున్న ప్రభు త్వాలదే బాధ్యత అని గుర్తించాలి.

ప్రభుత్వాలు పలు చర్యలు చేపట్టినా రైతు  ఆత్మహ త్యలు ఇంకా కొనసాగుతున్నాయంటే రైతు మరణాలకు మరికొన్ని ముఖ్య కారణాలున్నాయనే లెక్క. అవి  1) చిన్న కమతాలు, 2) ప్రైవేటు అప్పులు. చిన్న కమతాల వల్ల వ్యవసాయ ఉత్పాదకత, వ్యక్తిగత ఉత్పాదకత తగ్గుతాయి. రైతు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతా నికి, వ్యవసాయం నుండి ఇతర వృత్తి, వ్యాపారాలకు మరలే మొబిలిటీ కోల్పోతాడు. చిన్న కమతమొక గుదిబండగా తయారవుతుంది. చిన్న కమతాలలో ఎంత బాగా పండినా, పంటకు ఎంత మంచి ధర లభించినా మూడు ఎకరాలలోపు రైతులకు సాలుకు రూ.50వేలు కూడా నికరాదాయం రాదు.

కుటుంబ ఖర్చులు భరిం చుకుంటూ తాను తెచ్చిన రెండు, మూడు లక్షల రూపా యల అప్పుపై 24 శాతం వడ్డీ చెల్లించడం అసాధ్యం. ఫలితంగా అప్పులు పెరుగుతూ ఉంటాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. నిస్సహాయ స్థితిలో, అవమాన భారంతో, భవిష్యత్తు శూన్యంగా తోచి ఆత్మహత్యకు పాల్పడతారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులలో 99 శాతం మంది మూడెకరాలలోపు అసాములు, కౌలు రైతులు. చిన్నకమతాల సమస్యను శాశ్వతంగా పరిష్క రించకపోతే రైతు మరణాలు జరుగుతూనే ఉంటాయి.

ఇక రెండవ సమస్య ప్రైవేటు అప్పులు. బాకీ వసూలుకు ప్రైవేటు రుణదాతల విధానాలు వేరుగా ఉంటాయి. రుణగ్రహీత కూడా ఎదిరించలేడు. తాను సంతకం పెట్టిన అనేక ప్రాంసరీనోట్లు, చెక్కులు, కాగి తాలు రుణదాత వద్ద ఉన్నాయన్న స్పృహ అతడిని తల వంచేటట్లుగా చేస్తుంది. ప్రైవేటు రుణదాతల బారిన పడకుండా అన్నదాతలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు కొన్ని సూచనలు :

1) సామాజిక కార్యకర్తలతో మండలానికొక కమిటీ నియమించాలి. ఆత్మహత్య చేసుకోవాలన్న రైతు విచా రంగా ఉండటం, రాత్రులందు సరిగా నిద్రించకపో వడం, భోజనంపై ఆసక్తి చూపకపోవడం, ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయడం, సన్నిహితుల వద్ద, కుటుంబ సభ్యుల వద్ద సమస్యలకు తన చావే పరిష్కారమని వాపోతుంటాడు. ఇలాంటి వారిని కమిటీలు గుర్తించి కుటుంబ సభ్యులు వెన్నంటి ఉండేలా హెచ్చరించాలి. కౌన్సిలింగ్ నిర్వహించాలి.

2) ప్రైవేటు రుణదాతలతో సంప్రదించి, రైతు దివాలా తీసినట్లు భావించి, రుణ పరిష్కారం చేయాలి. పరిష్కారం ఒక లక్ష రూపాయలకు లోబడి చేయాలి.

3) ప్రైవేటు రుణదాతలు ఒకే రుణానికి అనేక ప్రాంసరీనోట్లు, చెక్కులు, కాగితాలపై తేదీలు, రుణ మొత్తం కూడా లేకుండా సంతకాలు తీసుకోకుండా నివారించాలంటే ప్రాంసరీ నోటును తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాల్సిన డాక్యుమెంటుగా నిర్వచించాలి.

4) సహకార వ్యవసాయ సంఘాలను ప్రోత్స హించాలి. గ్రామాల పరిధిలోని భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయాన్ని నిర్వహించే ఈ సంఘాలకు ప్రభుత్వం నుండి సబ్సిడీలు, ఎరువులు, రుణాల రూపంలో సహకారం అందించాలి.

5) ఈ రోజు పేద నుండి మధ్యతరగతి కుటుం బాల వరకు వారి సంపాదనను ఆస్తులను కూడా మింగి వేస్తున్న రెండు రంగాలు వరుసగా వైద్యం, విద్య. సామాన్య కుటుంబాలను కూడా కూలద్రోయగల స్థాయి లో వైద్య ఖర్చులుంటున్నాయి. ప్రభుత్వ  విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపర్చాలి.

6) అభివృద్ధి, పారిశ్రామిక వికేంద్రీకరణ ద్వారా గ్రామాల్లో వృత్తి, ఉద్యోగ వ్యాపారాల అవకాశాలు మెరుగుపర్చడం అవసరం.

7) మూడు ఎకరాలను కనీస కమతంగా గుర్తిం చాలి. మూడెకరాలలోపు రైతు భూమిని అమ్మవలసి వస్తే పాక్షికంగా అమ్మకూడదు. పూర్తిగా అమ్మివేయాలి.

రైతు మరణాల సమస్య చాలా తీవ్రమైనది. తీవ్ర వాద, ఉగ్రవాద ఉద్యమాలలో కన్నా మరే ఇతర ఉద్య మాలకన్నా, పాకిస్తాన్‌తో యుద్ధంలోకన్నా రైతు బలవన్మరణాల సంఖ్య ఎక్కువ. అందువల్ల తీవ్రమైన సంస్కరణలు చేయడానికి వెనుకాడకూడదు.
 సీపీఐ/మార్క్‌ఫెడ్ ద్వారా పంటలు కొనుగోలు చేసే నిర్ణయం కానీ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతు లకు ప్రభుత్వం ఇచ్చే అనుమతుల నిర్ణయం కానీ ఆలస్యం అవకుండా పంట మార్కెట్‌కు రావడం ప్రారం భించినప్పటి నుంచే అమలులో ఉండేలా చూడాలి.

చిన్న కమతాలకు పరిష్కార మార్గం చూపి, ప్రైవేటు రుణాలను నియంత్రించి, ప్రాథమిక విద్య, వైద్య రంగాలను అభివృద్ధిపరిచి, పారిశ్రామిక వికేంద్రీ కరణ చేసి, గ్రామాల్లో సౌకర్యాలు మెరుగుపర్చడం ద్వారా ముఖ్యంగా రైతులకు మనోధైర్యం కల్పించడం ద్వారా రైతు ఆత్మహత్యలను అరికట్టవచ్చు
 వ్యాసకర్త ఎల్‌ఎల్‌బీ, ఎఫ్‌సీఏ, చార్టెర్డ్ అకౌంటెంట్
 ఈ. హరిబాబు,  మొబైల్ : 9949911966

మరిన్ని వార్తలు