కమతాలన్నీ కార్పొరేట్లు దున్ని..

12 May, 2015 00:11 IST|Sakshi
కమతాలన్నీ కార్పొరేట్లు దున్ని..

రెండోమాట
 
సాధారణంగా మోతుబరులే చిన్న రైతులకు భూములను కౌలుకిస్తారు. ఆ పరిస్థితిని ఆగ్రో-బిజినెస్ కార్పొరేట్లు తారుమారు చేస్తున్నాయి. సంప్రదాయ బడా రైతు వ్యవసాయేతర వ్యాపారాల్లోకి విస్తరిస్తున్నాడు. ఇదెలా జరుగుతుందంటే, కొత్తగా అవతరిస్తున్న బడా రైతురుణ భారం నుంచి తేరుకోలేని సామాన్య రైతుల నుంచి భూములను ముదరాగా గుంజేసుకోవడం ద్వారా లేదా నష్టాలతో వ్యవసాయంపై భ్రమలు కోల్పోతున్న రైతుల నుంచి భూముల్ని కొనేసుకోవడం ద్వారా, అని వ్యవసాయ విద్యాలయం నిర్వహించిన సర్వే చెప్పింది.
 
‘వ్యవసాయమూ, రైతాంగమూ నేడు రుణాల ఊబిలో దిగబడిపోయాయి. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని వ్యవసాయాన్ని వ్యాపార ప్రయోజనాల వైపు మళ్లించడానికి కార్పొరేట్/ కాంట్రాక్టు శక్తులు రంగంలోకి దిగాయి. క్రమంగా బడా కార్పొరేట్ సంస్థలు చొచ్చుకుపోతున్నాయి. రుణ బాధతో గత ఏడాది లోనే (2014) రెండు లక్షల మంది పంజాబ్ రైతులు పొలాలను విడిచి వ్యవ సాయేతర వృత్తుల వైపు మళ్లవలసి వచ్చింది. వ్యవసాయాధార వ్యాపార సంస్థలు (ఆగ్రో బిజినెస్)కు పన్ను రాయితీలూ, లాభాలు చేకూర్చే సౌక ర్యాలూ ప్రభుత్వం కల్పించినందువల్ల, ఇటు వీరికి వ్యవసాయవ్యయాలు తడిసి మోపిడవుతున్నందున రైతులు అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఫలితంగా రైతులు తమ భూములను ఆగ్రో బిజినెస్ కంపెనీలకు కౌలుకు ఇచ్చుకోవలసిన దుస్థితి నెలకొన్నది.’    {పొఫెసర్ సుఖ్‌పాల్ (పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వేలో)

రైతాంగ, రైతు కూలీ, వ్యవసాయాధార వృత్తుల వారి మౌలిక ప్రయోజ నాలను దెబ్బతీసే ప్రపంచ బ్యాంక్ ప్రజా వ్యతిరేక ‘సంస్కరణల’ పత్రాల మీద పాలకులు 1991లో సంతకాలు చేశారు. నేడు దేశం అనుభవిస్తున్న అనేక దుష్ఫలితాలకు కారణం అదే. పాలకులు, వారి బ్రాండ్లు (కాంగ్రెస్- యూపీఏ/ బీజేపీ- ఎన్డీయే/ బీజేపీ-టీడీపీ) ఏమైనప్పటికీ ఈ విషయంలో వాటి ఆచరణకు సంబంధించి ఎలాంటి తేడాను చూడలేం. పీవీ-మన్మోహన్ -సోనియా/ వాజపేయి-మోదీ- చంద్రబాబుల పాలన వరకు అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న అన్న చందంగానే దేశ విదేశ గుత్త వ్యాపార ప్రయో జనాలతో పాటు, భూస్వామ్య వ్యవస్థ అడుగుబడుగు అవశేషాలను కాపాడేం దుకే యత్నించారని లేదా యత్నిస్తున్నారని ఆచరణ రుజువు చేస్తున్నది. ఆ ఆచరణ కోసమే వారు అవసరమైన పాత చట్టాలకే దుమ్ము దులిపి, అవే చట్టా లకు కొత్త రంగులు అద్దుతున్నారని గమనించాలి.

అవసరమైనప్పుడు దేశ, రాష్ట్రాల చట్టసభల వేదికల మీద బ్రూట్ మెజారిటీ ఆధారంగా కాలాన్నీ, కార్యాన్నీ పాలకులు డొల్లించుకుపోయేందుకు తపన పడుతున్నారన్నది కూడా ఒక వాస్తవం. ఒకరు తాను ‘చాయ్ వాలా’నని ప్రకటించుకుని, తరు వాత కార్పొరేట్ దిగ్గజాల ఛాయగా మారిపోయారు. ఇంకొకరు ైరె తు బాంధ వుడినని చెప్పి, ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని నిర్మాణానికి భూసేకరణ పేరిట రైతులకే (విజయవాడ-గుంటూరు ప్రాంతంలో) ఎసరు పెట్టారు. కాంట్రాక్ట్/ కార్పొరేట్ వ్యవసాయానికంటే ఇంకా ముందే ఇజ్రాయిలీ వ్యవసాయానికి హారతి పట్టి, పంటభూముల సరి హద్దులు చెరిపేసి నవ్వుల పాలైనది కూడా ఆయనేనన్న సంగతి విస్మ రించరానిది. ఇలాంటి కాంట్రాక్ట్/ కార్పొరేట్ వ్యవసాయమే ‘ఆగ్రో బిజినెస్’ రూపంలో పంజాబ్ రైతులనూ, గ్రామాలనూ చుట్టబెడుతోంది.

న్యాయ, చట్ట వ్యవస్థల కన్నుగప్పే యత్నం

పాలనా విధానాలలో, పాలకుల ఆచరణలో మార్పు లేకుంటే విసిగిపోయిన ప్రజలు నెగెటివ్ ట్రయల్‌గా ప్రత్యామ్నాయాన్ని అభిలషించడం సహజం. కానీ నెగెటివ్ ఓటు మీద కూడా అధికారంలోకి వచ్చి, శాసన నిర్మాణ వేది కలను ప్రజా వ్యతిరేక సంస్కరణలకు అనుకూలంగా ఉపయోగించుకోవడమే దారుణం. పైగా ‘ధర్మాసన చైతన్యాన్ని’ (జ్యుడీషియల్ యాక్టివిజమ్)ను పాల కులు తప్పు పట్టడం ఇటీవల ఒక అలవాటుగా మారడం మరో విషాదం. రాజ్యాంగం ప్రకారం శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య విధులకు సంబంధించి పరిధులను స్పష్టంగా నిర్వచించినప్పటికీ జ్యుడీషియరీకి ప్రభుత్వ నిర్ణయాలనూ, ప్రతిపాదనలనూ సమీక్షించే హక్కు అదనంగా ఉన్న దని మరచిపోరాదు. కానీ, ధర్మాసనానికి తన వ్యవహారాల నిర్వహణలో ఉన్న స్వేచ్ఛను, హక్కును తోసిపుచ్చి ప్రభుత్వమే జాతీయ స్థాయిలో న్యాయ మూర్తుల ఎంపికకు, నియామకాలకు ప్రత్యేక జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని భావించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జోసెఫ్ కురియన్ వ్యాఖ్యను పరిశీలించాలి: ‘శాసన సంబం ధమైన అతివేలానికీ, సాహసానికీ మా సమాధానం- ధర్మాసన చైతన్యమే. అది న్యాయమూర్తులుగా మా బాధ్యత’. నిజానికి భూసేకరణ బిల్లుకు చట్ట రూపం ఇవ్వడానికి పార్లమెంటు ఉభయ సభలలో ఎక్కడా ఆమోదం పొంద లేని పరిస్థితి ఎదురైతే అది పాలకులకు దుర్భరమే. అందుకు విరుగుడుగా భావిస్తూ చేసిన పనే ఆర్డినెన్స్ విడుదల. ఆ చట్టం తెస్తేగానీ దేశ విదేశ గుత్త పెట్టుబడులూ, బహుళ జాతి కంపెనీలకూ మరింత ఉధృతంగా రావడానికి వీలుండదు. ఈ రంధే ఇప్పుడు ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పాలకులను పట్టి పీడిస్తున్నది.
 
ఏపీ విషాదానికి అద్దం పడుతున్న పంజాబ్

పంజాబ్ పరిణామాలూ, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పేరిట నిర్వహి స్తున్న తంతూ ఇందుకు తాజా ఉదాహరణలు. పంజాబ్‌లోని మన్యా జిల్లాకు చెందిన మల్సింగ్‌వాలా అనే గ్రామం కేంద్రంగా ప్రారంభమైన కార్పొరేట్ వ్యవసాయం దేశవ్యాప్తంగా (ఆంధ్రప్రదేశ్ సహా) వ్యవసాయ రంగంలో రానున్న విష పరిణామాలకు సూచిక. ఈ గ్రామ పంచాయతీ కార్పొరేట్లకు (అగ్రీ బిజినెస్) అప్పగించే ముందు చేసిన తీర్మానం రేపటి వ్యవసాయ భార తం అనుభవించనున్న ఫలితాలకు అద్దం పడుతోంది. ఒకే ఒక చోట గంప గుత్తగా 100 ఎకరాల చొప్పున తమ వాణిజ్య వ్యవసాయ కార్యకలాపాలకు భూములను తమకు అప్పగిస్తే ‘ఇంత’ని నిర్ణీత డబ్బు ఇస్తామని ఆగ్రో బిజి నెస్ వ్యవస్థలు చెప్పాయి. ఆ పంచాయతీ ‘గ్రామాన్నే కార్పొరేట్లకు కౌలు కిచ్చేస్తాం’ అని రుణ బాధల కారణంగా ప్రకటించింది. ఇదిలా ఉండగా ‘ఎదురు కాళ్లు’ (రివర్స్ టెనెన్సీ) ఒక వ్యవస్థగా వ్యవసాయంలో రూపుదిద్దు కుంటోందని పంజాబ్ వ్యవసాయ విద్యాలయం సర్వే నివేదిక వెల్లడించింది. ఇది కూడా రేపటి పరిణామాలకు హెచ్చరిక. వ్యవసాయ క్షేత్ర (పొలం) పరి మాణాలు కూడా మారిపోతున్నాయి. సంపన్న రైతులకు సన్నకారు, పేద రైతులు తమ భూముల్ని కౌలుకి ఇచ్చుకుంటున్నారు. రివర్స్ గేర్‌లో కౌళ్లు అంటే ఇదే. సాధారణంగా మోతుబరులే చిన్న రైతులకు భూములను కౌలుకి స్తారు.

ఆ పరిస్థితిని ఆగ్రో-బిజినెస్ కార్పొరేట్లు తారుమారు చేస్తున్నాయి, ప్రభుత్వాల ప్రోత్సాహంతో. సంప్రదాయ బడా రైతు వ్యవసాయేతర వ్యాపా రాల్లోకి విస్తరిస్తున్నాడు. ఇదెలా జరుగుతుందంటే, కొత్తగా అవతరిస్తున్న బడా రైతు, రుణ భారం నుంచి తేరుకోలేని సామాన్య రైతుల నుంచి భూము లను ముదరాగా గుంజేసుకోవడం ద్వారా లేదా నష్టాలతో వ్యవసాయంపై భ్రమలు కోల్పోతున్న రైతుల నుంచి భూముల్ని కొనేసుకోవడం ద్వారా అని వ్యవసాయ విద్యాలయం నిర్వహించిన సర్వే స్పష్టంగా వెల్లడించింది. నిజానికి ఆగ్రో-బిజినెస్‌లో ఉన్న కంపెనీలు తాముగా వ్యవసాయం చేయటం లేదు. మరి ఏం చేస్తున్నాయి? ‘మీరు ఆహార పంటలు మానేసి వాణిజ్య పం టలు వేసుకోమ’ని రైతులకు సలహాలిస్తున్నాయి! పెట్రోలియం తవ్వకాలలో ఉన్న అంతర్జాతీయ గుత్త వ్యాపార సంస్థలకు గోరు చిక్కుళ్ల జిగురు (క్లస్టర్ బీన్స్) అవసరం గనుక ఆహార పంట మాని, ఆ పంట వేసుకోమంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఆహార పంటలకు గిరాకీ ఉండదు. ఈ మళ్లింపు ఎలా జరుగు తోంది? ఎవరు కారకులు? వాజపేయి (బీజేపీ) ప్రధానిగా పదవిలోకి రాగానే అమెరికా కనుసన్నల్లో మెసలే ప్రపంచ బ్యాంకు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఆ నమ్మలేని నిజాలు చూడండి:

లాభాలు తెచ్చిపెట్టలేని పంటల్ని తగ్గించి పారేయండి. ఎగుమతులకు అనుకూలమైన పంటల్నే ఉత్పత్తి చేయండి; ఆ మేరకు ఆహార ధాన్యా లను విదేశాల నుంచి దిగుమతి చేయండి. భారతీయ వ్యవసాయం విదేశాలలోని వ్యవసాయంతో పోటీ పడాలి.ఎరువులు, నీటి పారుదలకు, విత్తనాలకు ఇచ్చే రుణాలు సబ్సిడీలను తగ్గించేయండి, క్రమంగా వీటిని ఎత్తివేయండి.దేశీయ వ్యవసాయోత్పత్తుల ఎగుమతులపైన ఆంక్షలు వద్దు.విదేశీ వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై ఎలాంటి ఆంక్షలూ ఉండటా నికి వీల్లేదు.ధాన్యం, గోధుమ, బియ్యం కొనుగోళ్లు, రవాణా, గిడ్డంగులలో భద్రప రిచే బాధ్యతల నుంచి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ను తొలగిం చేయాలి!!

ఈ వినాశకర కార్యక్రమంతోనే ఆఫ్రికా ఖండంలో ఇథియోపియా లాంటి ధాన్యాగారాలను ఆహార పంటల నుంచి దూరం చేసిన ప్రపంచ బ్యాంకు ‘మీకు డాలర్లు కావాలి కాబట్టి, ఆహార పంటలు మానుకుని పండ్లు వగైరా వాణిజ్య పంటలపై దృష్టి కేంద్రీకరించండి. గోధుమలు మేం సరఫరా చేస్తాం. మనుషులు నాజూగ్గా ఉండాలంటే గోధుమలనే తినండి’’ - ‘ఈట్ వీట్’ అనే బోర్డులు తగిలించి మూడేళ్లలో ఆ దేశాలని అమెరికా, బ్యాంకు కలసి శంకర గిరి మాన్యాలు పట్టించాయని మరవొద్దు. కొన్ని దశాబ్దాల నాడే ఆచార్య వినోబా భావే - ‘అమెరికా గోధుమలతో పాటే అమెరికా బుద్ధులూ దిగుమతి అయ్యాయి’ అని చెప్పిన సంగతిని గుర్తు చేసుకోవాలి.
 (వ్యాసకర్త మొబైల్: 9848318414)
 
 ఏబీకే ప్రసాద్  సీనియర్ సంపాదకులు

 

మరిన్ని వార్తలు