అఖిలేష్ యాదవ్ రాయని డైరీ

13 Sep, 2015 08:51 IST|Sakshi
అఖిలేష్ యాదవ్ రాయని డైరీ

అసలు నాది యూపీనేనా? లేక వలస శరణార్థిగా ఏ రాష్ట్రం నుండో ఇక్కడికి వచ్చి, ఎవరింట్లోనైనా అద్దెకు ఉంటున్నానా? నా మీద నాకే డౌట్ వస్తోంది. ఉత్తరప్రదేశ్‌ని ఒక్క నేను తప్ప, మిగతా అంతా పరిపాలిస్తున్నారు! ఫారిన్ నుంచి ఇన్వెస్టర్లు వస్తారు. వచ్చి, ‘హౌవ్వీజ్ యూపీ’ అని నన్నే కదా అడగాలి. నన్ను వదిలేసి మీడియాను అడుగుతారు. లేదంటే బీజేపీని అడిగి వెళ్తారు. రూలింగ్ పార్టీ గురించి మీడియా గానీ, ప్రతిపక్షంగానీ ఒక మంచి విషయం చెప్పిన దాఖలాలు ఏ దేశ చరిత్రలోనైనా ఉన్నాయా? ఈ మూడున్నరేళ్లలో ముఖ్యమంత్రిగా నేను మూట కట్టుకున్నదేం లేదు.
 
 కనీసం ముందుకు మూడడుగులైనా వేసింది లేదు. ఒక్క అడుగు వేయబోతానో లేదో... ‘బాబూ పడిపోతావ్’ అని నాన్నగారు వచ్చి పట్టుకుంటారు. ఆయనకు నేనంటే ప్రేమ. దాన్ని ప్రజలపై ప్రేమగా ఫోకస్ చెయ్యడానికి నాకు నానా టార్గెట్‌లు, సాధ్యం కాని డెడ్‌లైన్లు పెట్టి చంపుతుంటారు. ఒక్కోసారి నాన్నగారికంటే అపోజిషనే నయం అనిపిస్తుంటుంది. మొన్నా ఇలాగే! అందరి ముందు పట్టుకుని ‘అబ్బే లాభం లేదు’ అనేశారు. ‘ఈ ప్రాంతానికి సైనిక్‌స్కూల్ శాంక్షన్ అయింది కదా ఎప్పుడు కట్టిస్తావ్? నాకు ఈ శంకుస్థాపనల మీద నమ్మకం లేదు. పని జరగాలి’ అన్నారు నాన్న. అంతా చప్పట్లు.  ‘చూస్తూ ఉండండి. ఏడాదిలోపు ఇక్కడ సైనిక్ స్కూలు పూర్తవుతుంది’ అన్నాను. జనంలో రెస్పాన్స్ లేదు! ‘పన్నెండు నెలలా! కుదరదు ఎనిమిది నెలల్లో స్కూలు పూర్తి కావాలి’ అన్నారు నాన్న. మళ్లీ చప్పట్లు.  
 
 నాన్న నన్ను ఊపిరి తీసుకోనివ్వడు. నాకై నన్ను ఆలోచించుకోనివ్వడు. నా నవ్వు నన్ను నవ్వనివ్వడు. నా ఏడుపు నన్ను ఏడ్వనివ్వడు. ‘ఒక్కరోజైనా నన్ను యూపీ ముఖ్యమంత్రిగా చూడండి నాన్నా’ అని పెద్దగా అరిచి చెప్పాలని ఉంటుంది. అదీ చెప్పనివ్వడు. ‘నువ్వు ముఖ్యమంత్రివి కాదు, ములాయంసింగ్ కొడుకువి. గుర్తుంచుకో’ అన్నట్లు ఉంటాయి ఆయన మాటలు, చూపులు.
 
సినిమా చూసినా నాన్నగారితో కలిసే చూడాలి! ఎక్కడ కుదురుతుంది? ఎలాగో తప్పించుకుని నా గదిలో నేను ప్రశాంతంగా ‘పీకే’ చూస్తుంటే అదో ఇష్యూ అయింది. ఇల్లీగల్‌గా డౌన్‌లోడ్ చేసి, కొత్త సినిమా చూసేశానని మీడియా గొడవ! ఇల్లీగల్ ఎలా అవుతుంది? సినిమా చూడ్డానికి నాకు లెసైన్స్ ఉంది. మీడియాకే సెన్స్ లేదు. దానికెప్పుడూ ఏదో ఒక న్యూసెన్సు కావాలి. యూపీని వదిలి అంతా బతుకుతెరువు కోసం వలస పోతున్నారట! ఏం మాటలో ఇవి. మరి రామ్ నాయక్‌ని ఏమనుకోవాలి? మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన గవర్నర్ అనుకోవాలా? అసలు నన్నేమనుకోవాలి. సొంత రాష్ట్రంలో వలసపక్షిలా బతుకుతున్నాను. అంతకన్నా పరాయి ఊరికి వలస పోవడం ఏమంత గౌరవం తక్కువని?
 - మాధవ్ శింగరాజు

మరిన్ని వార్తలు